Jogipet: సైబరాబాద్ మాజీ సీపీ సంతకం ఫోర్జరీ!
ABN, Publish Date - Jul 11 , 2024 | 03:43 AM
సైబారాబాద్ మాజీ (రిటైర్డ్) పోలీస్ కమిషనర్ ప్రభాకర్‌రెడ్డి, మరో ముగ్గురి సంతకాలను ఫోర్జరీ చేసి 57.12 ఎకరాల భూమిని రూ.22.23 కోట్లకు అమ్మేందుకు సిద్ధమయ్యాడు ఓ కేటుగాడు. చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన సం గారెడ్డి జిల్లా అందోలులో వెలుగుచూసింది.
57.12 ఎకరాల భూమి అమ్మేందుకు యత్నం.. మరో ముగ్గురి సంతకాల ఫోర్జరీతో పత్రాలు
రూ.22.23 కోట్లకు అమ్మేందుకు ఒప్పందం
రూ.11 లక్షలు బయానాగా చెల్లించిన బిల్డర్
పోలీసులకు భూ యజమాని ఫిర్యాదు.. నిందితుల అరెస్ట్
జోగిపేట, జూలై 10: సైబారాబాద్ మాజీ (రిటైర్డ్) పోలీస్ కమిషనర్ ప్రభాకర్‌రెడ్డి, మరో ముగ్గురి సంతకాలను ఫోర్జరీ చేసి 57.12 ఎకరాల భూమిని రూ.22.23 కోట్లకు అమ్మేందుకు సిద్ధమయ్యాడు ఓ కేటుగాడు. చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన సం గారెడ్డి జిల్లా అందోలులో వెలుగుచూసింది. సైబరాబాద్ మాజీ సీపీ శేరి ప్రభాకర్‌రెడ్డికి అందోలు శివారులో 32.21 ఎకరాల అనువంశిక వ్యవసాయ భూమి ఉంది. దాని పక్కనే వారి బంధువులైన శేరి నర్సింహారెడ్డికి 10.05 ఎకరాలు, రామకృష్ణారెడ్డికి 5.12 ఎకరాలు, శేరి అం జమ్మకు 5.23ఎకరాల భూమి ఉంది. అయితే వీరు నలుగురూ కలిసి భూములను ఉమ్మడిగా అమ్మాలని నిర్ణయించుకున్నారు. కొంతకాలంగా పాసుపుస్తకాలు, ఆధార్ కార్డుల జిరాక్సులను కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు వాట్సా్‌పలో పంపారు. అవి నారాయణఖేడ్ మండలం ర్యాకల్‌కు చెందిన సంజీవరెడ్డి, కంగ్టి మండలంలోని దెగుల్‌వాడికి చెందిన సుధాకర్‌రెడ్డి, ముకుంద్ నాయక్ తండాకు చెందిన ఆరె రవీందర్‌కు కూడా చేరాయి.
వీటిని చూసిన సంజీవరెడ్డికి ఆ భూములను దొంగతనంగా అమ్మేయాలన్న దుర్బుద్ధి పుట్టింది. ఈ విషయా న్ని మిత్రులైన సుధాకర్‌రెడ్డి, రవీందర్‌కు చెప్పా డు. ముగ్గురూ కలిసి దొంగ అగ్రిమెంట్‌ను తయారు చేయించారు. భూయజమానులైన శేరి ప్రభాకర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, రామకృష్ణారెడ్డి, అంజమ్మ కలిసి సంజీవరెడ్డికి ఎకరాకు రూ.39 లక్షల చొప్పున మొత్తం 57.12 ఎకరాల భూమి ని అమ్ముతున్నట్లు, ఇందుకు తాము ఒప్పందం చేసుకున్నట్లు పత్రాలు సృష్టించారు. అందులో సంజీవరెడ్డి.. ఒకే పెన్నుతో రిటైర్డ్ సీపీ సహా నలుగురు భూయజమానుల సంతకాలను ఫోర్జరీ చేశాడు. ఆ అగ్రిమెంట్‌ను తీసుకుని హైదరాబాద్‌కు చెందిన బిల్డర్ యాదగిరిరెడ్డిని సంప్రదించారు. ఎకరా రూ.39 లక్షలకు కొనుగోలు చేశామని, తమకు ఎకరాకు లక్ష లాభం ఇస్తే చాలని చెప్పారు. ఎకరాకు రూ.40 లక్షల చొప్పున 57.12 ఎకరాలను కొనేందుకు ఆయన బేరం కుదుర్చుకున్నారు. బయా నా కింద రూ.11 లక్షలు సంజీవరెడ్డి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేశారు.
2 నెలలపాటు సంజీవరెడ్డి విషయాన్ని సాగదీశాడు. నాలుగు రోజుల క్రితం యాదగిరిరెడ్డి ఇతరుల ద్వారా అందోలులోని భూముల వద్దకు వచ్చారు. అదే సమయంలో పంటను చూసేందుకు శేరి నర్సింహారెడ్డి వచ్చారు. మీరెవరని యాదగిరిరెడ్డిని ప్రశ్నించగా.. తాను ఈ భూమి ని కొనుగోలు చేస్తున్నానని, అడ్వాన్స్ కూడా చెల్లించానని చెప్పారు. మీకెవరు అమ్మారని నర్సింహారెడ్డి ప్రశ్నించడంతో మోసపోయామని గుర్తించిన యాదగిరిరెడ్డి.. విషయాన్ని శేరి నర్సింహారెడ్డి.. రిటైర్డ్ సీపీ ప్రభాకర్‌రెడ్డికి వివరించగా, ఆయన జోగిపేట పోలీసులకు ఫిర్యా దు చేయమని చెప్పారు. ఆయన కూడా ఎస్పీ చెన్నూరి రమేశ్‌కు సమాచారం అందించారు. ఎస్పీ ఆదేశాలు, నర్సింహారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సీఐ అనిల్‌కుమార్ దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం నిందితు లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Updated Date - Jul 11 , 2024 | 03:43 AM