Share News

Khammam floods: మాజీమంత్రి కబ్జాల వల్లే అపార నష్టం

ABN , Publish Date - Sep 05 , 2024 | 05:09 AM

ఓ మాజీమంత్రి కాల్వలను కబ్జా చేయడం వల్లే ఖమ్మం జిల్లాకు పెనుముప్పు వాటిల్లిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.

Khammam floods: మాజీమంత్రి కబ్జాల వల్లే అపార నష్టం

  • కాంగ్రెస్‌ పార్టీకి దాడులు చేసే సంస్కృతి లేదు.. వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలి

  • కేసీఆర్‌లా మేము ఫాంహౌస్‌లో కూర్చోలేదు

  • మీడియాతో మంత్రి పొంగులేటి

  • 2 బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం

హైదరాబాద్‌, కూసుమంచి/నేలకొండపల్లి/కారేపల్లి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఓ మాజీమంత్రి కాల్వలను కబ్జా చేయడం వల్లే ఖమ్మం జిల్లాకు పెనుముప్పు వాటిల్లిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఆ కబ్జాల వల్ల వరద నీరు ప్రవహించే దారి లేకుండా పోయిందని విమర్శించారు. కాల్వలు సరిగ్గా ఉండి ఉంటే నష్టం ఎంతో కొంత తగ్గి ఉండేదన్నారు. ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో వరద బాధితులను బుధవారం ఆయన పరామర్శించారు. షేక్‌ యాకూబ్‌-సైదాబీ దంపతులు, తండ్రీకూతుళ్లు మోతీలాల్‌, అశ్విని మృతి చెందిన నేపథ్యంలో ఆయా కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున మొత్తం రూ.20లక్షల పరిహారం అందజేశారు.


అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల సీఎం ఖమ్మం పర్యటనకు వచ్చిన సందర్భంలోనూ పంట కాల్వల కబ్జా విషయాన్ని ప్రస్తావించారని గుర్తుచేశారు. ఆ తర్వాత ఇక్కడకు వచ్చిన ఆ పార్టీ ముఖ్య నేతలెవరూ దీనిపై స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. బాధితులకు జరిగిన నష్టాన్ని అర్థం చేసుకుని ఆవేదన వ్యక్తం చేస్తే, వారిపై దాడులు చేశామని ప్రచారం చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి దాడులు చేసే సంస్కృతి లేదన్నారు. ఇప్పటికైనా సదరు మాజీమంత్రి ప్రభుత్వ భూమిని తిరిగి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. వర్షాల కారణంగా ఖమ్మం, భద్రాద్రి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో రూ.5,438 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పొంగులేటి తెలిపారు.


వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించి, తక్షణమే రూ.2వేల కోట్లు ఇవ్వాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2022లో వరదలు వచ్చినప్పుడు క్లౌడ్‌ బరస్ట్‌ అని, విదేశీ కుట్ర అని మతి లేని ప్రకటనలు చేసిన బీఆర్‌ఎస్‌ నాయకులకు.. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని పొంగులేటి స్పష్టం చేశారు. కేసీఆర్‌ మాదిరిగా తాము ఫాంహౌ్‌సలో కూర్చోలేదని ఒక ప్రకటనలో తెలిపారు. దొర గారి అల్లుడు హరీశ్‌.. తాజా పరిస్థితులను కూడా కుట్ర కోణంలోనే చూస్తున్నారని ఎద్దేవా చేశారు. జైలు నుంచి వచ్చిన బిడ్డను ఆశీర్వదించడానికి కేసీఆర్‌కు సమయం ఉంది కానీ, కష్టాల్లో ఉన్న ప్రజలను పరామర్శించడానికి గడప దాటలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఇక.. ఆయన కుమారుడు కేటీఆర్‌ ఆమెరికాలో ఉండి, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకుండా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


  • బాధితుల ఖాతాల్లోకే వరద సాయం: తుమ్మల

ఖమ్మం, సెప్టెంబరు4 (ఆంధ్రజ్యోతి): వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని.. బాధితుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తామని చెప్పారు. ఖమ్మంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖమ్మం పట్టణంతోపాటు జిల్లాలో 7,400 ఇళ్లు వరద ముంపునకు గురయ్యాయని మంత్రి చెప్పారు. వరద బాధితుల్లో ప్రతి కుటుంబానికి 10 కిలోల బియ్యం, రగ్గులు, రెండు జతల చీరలు, నూనెప్యాకెట్‌, కూరగాయలు, నిత్యావసర వస్తువుల కిట్లను అందిస్తున్నామని తెలిపారు. ఇంటింటి సర్వే నిర్వహించే.. వరద బాధితుల వివరాలతో పాటు బ్యాంకు ఖాతా వివరాలు తీసుకుని ఆర్థిక సాయాన్ని ఆ ఖాతాలోనే జమ చేస్తామని వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు.

Updated Date - Sep 05 , 2024 | 05:09 AM