Harish Rao: పైసల్లేక పథకాలు పరేషాన్..
ABN, Publish Date - Jul 23 , 2024 | 03:53 AM
రాష్ట్రంలో సర్కారు మొద్దు నిద్రతో సంక్షేమ పథకాలకు నిధుల్లేని పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. గ్రామ పంచాయతీలు మొదలు.. జీహెచ్‌ఎంసీ దాకా నిధుల లేమితో అభివృద్ధి అటకెక్కిందని ఎద్దేవా చేశారు.
ఆసరా పింఛన్లూ ఆగిపోయాయి
ఉపాధి హామీలో రాష్ట్ర వాటా ఏది?
పోలీసు వాహనాలకూ డీజిల్ ఇవ్వట్లేదు
రాష్ట్రంలో తీవ్రంగా విద్యుత్తు సమస్యలు
40% మందికి రుణమాఫీ ఎగ్గొట్టారు
చిట్‌చాట్‌లో హరీశ్‌రావు వ్యాఖ్యలు
హైదరాబాద్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సర్కారు మొద్దు నిద్రతో సంక్షేమ పథకాలకు నిధుల్లేని పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. గ్రామ పంచాయతీలు మొదలు.. జీహెచ్‌ఎంసీ దాకా నిధుల లేమితో అభివృద్ధి అటకెక్కిందని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన అసెంబ్లీ బీఆర్‌ఎ్‌సఎల్పీ కార్యాలయంలో విలేకరులతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ సర్కారు సమస్యలను పరిష్కరించకుండా మొద్దు నిద్రపోతోంది. బీఆర్‌ఎస్ తట్టి లేపినా.. లేవడం లేదు. సర్పంచ్ ఎన్నికలను నిర్వహించకపోవడంతో.. కేంద్రం నుంచి రూ.750 కోట్ల గ్రాంట్ విడుదలవ్వలేదు. గ్రామ పంచాయతీలకు మార్చికి ముందే కేంద్రం రూ.500 కోట్లను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వాటిని పంచాయతీలకు అందజేయనేలేదు. పారిశుధ్య కార్మికుల సమస్యలను మేం లేవనెత్తితే.. వారికి జీతాలను విడుదల చేస్తామనే ప్రకటన సర్కారు నుంచి వచ్చింది. కేంద్రం జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ.850 కోట్లిచ్చింది. రాష్ట్రం మాత్రం తన వాటా రూ.350 కోట్లను విడుదల చేయలేదు.
కేంద్రం ఇచ్చిన నిధులను 15 రోజుల్లో సంబంధిత విభాగాలకు విడుదల చేయకుంటే.. రాష్ట్రం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండు నెలలుగా జీతాల్లేవు. జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు అత్యవసర పనుల నిమిత్తం నెలకు ఇచ్చే రూ.40లక్షలను ఆపేశారని, దీంతో ఏడు నెలలుగా డివిజన్లు అస్తవ్యస్థంగా తయారైందన్నారు. కేంద్రం నిధులిస్తున్నా.. రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడంతో పలు పథకాలు నిలిచిపోయే పరిస్థితి దాపురించింది’’ అని హరీశ్‌రావు దుయ్యబట్టారు. రాష్ట్రంలో రెండు నెలలుగా ఆసరా పింఛన్లను ఇవ్వడం లేదని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు ఇవ్వడం లేదని, ఇప్పటి వరకు లక్షకు పైగా చెక్కులు పెండింగ్‌లో ఉన్నాయని విమర్శించారు. హోంగార్డులకు జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని, కొన్ని నెలలుగా పోలీసు వాహనాలకు పెట్రోల్/డీజిల్‌కు డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల పోలీసులు పర్సంటేజీ ముట్టజెబితే బిల్లులు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఐదు డీఏలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు.
విద్యుత్తు సంక్షోభం
రాష్ట్రంలో విద్యుత్తు శాఖ తీవ్ర సంక్షోభంలో ఉందని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘వినియోగం గతంలో మాదిరిగానే ఉంది. అయినా.. కరెంటు కోతలు ఎందుకు? అదే ప్రశ్న వేస్తే.. విచిత్రమైన కారణాలు చెబుతున్నారు. తొండలు, బల్లుల వల్ల ఈ దుస్థితి అంటున్నారు. కాదుకాదు.. హరీశ్‌రావు చెబితే కరెంటు తీసేస్తున్నారని అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అని ఎద్దేవా చేశారు. రైతులు డీడీలు కట్టినా ట్రాన్స్ ఫార్మర్లు రావట్లేదని, స్తంభాలను ఏర్పాటు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో పంచాయతీలు, స్కూళ్లు విద్యు త్తు బిల్లులు చెల్లించడం లేదని, దీంతో విద్యుత్తుశాఖ ఆదాయానికి గండి పడుతోందన్నారు. ప్రజాపాలనలో కంచెలే ఉండవన్న కాంగ్రెస్.. అసెంబ్లీ చుట్టూ నాలుగు కంచెలు వేసిందని విమర్శించారు.
రుణమాఫీ ఎగ్గొట్టారు
రైతు రుణమాఫీకి రేషన్‌కార్డు, పీఎంకిసాన్ నిబంధనలను అమలు చేయడంతో పలువురు అర్హత కోల్పోయారని, 40ు మందికిపైగా రైతులకు ప్రభుత్వం రూ.లక్షలోపు మాఫీ ఎగ్గొట్టిందని హరీశ్‌రావు ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలో విమల అనే మహిళకు రూ.59వేల అప్పుంటే రూ.3వేలు మాఫీ అవుతున్నట్టు మెసేజ్ వచ్చిందని, ఇలాంటి తప్పులు చాలా ఉన్నాయన్నారు. గత నిబంధనలే అమలు చేస్తున్నామని మంత్రులు చెబుతున్నారని.. అలా చేసి ఉంటే.. అధిక సంఖ్యలో రైతులకు రుణమాఫీ అవుతుందన్నారు. రైతు బీమా చెక్కులు కూడా సకాలంలో అందించడం లేదన్నారు.
పీహెచ్‌సీల్లో స్పెషాలిటీ డాక్టర్లా?
వైద్యశాఖలో అవసరం ఉన్నచోట కాకుండా... ఏమాత్రం వసతుల్లేని ఆస్పత్రులకు స్పెషాలిటీ డాక్టర్లను బదిలీ చేశారని హరీశ్‌రావు ఆరోపించారు. ప్రభుత్వ అనాలోచిత చర్యలకు నిదర్శనంగా రెండువేల పడకల ఆస్పత్రుల్లో సూపరింటెండెంట్, హెచ్‌వోడీలుగా పనిచేసిన వారిని వంద పడకల ఆస్పత్రులకు పంపారని దుయ్యబట్టారు. బిహారీలకు ప్రాధాన్యమిస్తున్నారని బీఆర్‌ఎస్ హయాంలో విమర్శలు చేసిన రేవంత్‌రెడ్డికి ఇప్పుడు వారే ముద్దయ్యారా? అని ప్రశ్నించారు. సివిల్ సర్వీస్ అధికారులకు కులం, ప్రాంతం ఆపాదించడం సరికాదని హితవుపలికారు. సిద్దిపేటలో అమలు చేసిన పలు కార్యక్రమాలకు కేంద్ర ఆర్థిక సర్వేలో చోటు దక్కడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
Updated Date - Jul 23 , 2024 | 03:54 AM