ఎంపీ ఎన్నికలపైనే బీఆర్‌ఎస్ భవిష్యత్
ABN , Publish Date - Apr 17 , 2024 | 03:42 AM
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలు.. బీఆర్‌ఎస్ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంత్రి పదవి, పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వారంతా అధికారం పోగానే పార్టీ నుంచి జారుకుంటున్నారని
పదవులు అనుభవించినవారే జారుకుంటున్నారు.. అసలైన ఉద్యమకారులే మిగిలారు
పార్లమెంట్ ఎన్నికల తర్వాత.. తెలంగాణలో రాజకీయ మార్పులు
రాముణ్ని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం: కేటీఆర్
ఆదిలాబాద్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలు.. బీఆర్‌ఎస్ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంత్రి పదవి, పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వారంతా అధికారం పోగానే పార్టీ నుంచి జారుకుంటున్నారని విమర్శించారు. మంగళవారం ఆదిలాబాద్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్లమెంట్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరై మాట్లాడారు. ‘‘రాసి పెట్టుకోండి.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో భారీ రాజకీయ మార్పులు చోటుచేసుకుంటాయి. గెలిచిన ఎంపీలతో కలిసి సీఎం రేవంత్ బీజేపీలోకి జంప్ అవడం ఖాయం’’ అని కేటీఆర్ అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వంద రోజులు గడిచినా వాటిని నేరవేర్చలేదని విమర్శించారు. డిసెంబరు 9న అధికారంలోకి రాగానే రూ.2లక్షల రుణమాఫీపై సంతకం చేస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు పంద్రాగస్టు వరకు మాఫీ చేస్తానంటూ కొత్త కథ చెబుతున్నారని మండిపడ్డారు. రైతుబంధు ఏమైందని ప్రశ్నిస్తే మంత్రి వెంకట్‌రెడ్డి చెప్పుతో కొడతానంటున్నారని, మే 13న రైతులు కాంగ్రె్‌సను చెప్పుతో కొట్టే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ‘‘రేవంత్‌రెడ్డి జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతూ పేగులను మెడలో వేసుకుంటా అంటాడు.. అసలు నువ్వు ముఖ్యమంత్రివా? లేక బోటికొట్టే వాడివా?’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఇదికూడా చదవండి: ఒవైసీ సోదరులను హతమార్చే కుట్ర!
ఉద్యమం పని చేసినవారే మిగిలారు..
తమ పార్టీ నుంచి పోయిన వారంతా ఉద్యమంలో పనిచేసిన వారు కాదని, అసలు ఉద్యమం చేసినవారే ఇప్పుడు పార్టీలో మిగిలారని కేటీఆర్ తెలిపారు. దేశంలో అత్యధికంగా లక్షా 60 వేల 283 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రమేనని, దీనిని ఎన్నికల్లో ప్రజలకు చెప్పుకోలేక పోయామని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు బీఆర్‌ఎస్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయని, ప్రతీ కార్యకర్త సైనికుడిలా పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తామే ఇచ్చినట్లు చెప్పుకొంటున్న 32 వేల ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వమే ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు. మందికి పుట్టిన బిడ్డను వారి బిడ్డగా చెప్పుకోవడం కాంగ్రె్‌సకు అలవాటైందని ఎద్దేవా చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో సంక్షేమ పథకాలను ఆపకుండా ఉండేందుకు.. ఉద్యోగుల వేతనాల చెల్లింపుల్లో కొంత ఆలస్యమైన మాట వాస్తవమేనన్నారు. అంతే తప్ప.. ఉద్యోగులు, ఉపాధ్యాయులతో తమకు ఎలాంటి శత్రుత్వం లేదన్నారు. బీజేపీకి మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చడంతోపాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు లేకుండా మాయం చేసే ప్రమాదం ఉందన్నారు. ‘‘రాముడు ఏ పార్టీ వాడు కాదు. రాముణ్ని మొక్కుదాం.. పైసా పని చేయని బీజేపీని పండబెట్టి తొక్కుదాం’’ అని కేటీఆర్ అన్నారు. ఇదిలా ఉండగా.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు పార్టీ సమన్వయకర్తలను నియమించినట్లు కేటీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.