Warangal: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..
ABN, Publish Date - Jun 17 , 2024 | 05:19 AM
ఫైనాన్షియర్ల ముసుగులో కార్లు, టిప్పర్లు, జేసీబీ వంటి భారీ వాహనాలను మోసపూరితంగా కొనుగోలు చేసి నెదర్లాండ్, దక్షిణాఫ్రికా, కాంబోడియా వంటి దేశాలకు విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారి తెలిపారు.
విదేశాలకు భారీ వాహనాల ఎగుమతి
అదుపులోకి తీసుకున్న వరంగల్ పోలీసులు
70 లక్షల విలువైన ఐదు కార్లు స్వాధీనం
మట్టెవాడ, జూన్ 16: ఫైనాన్షియర్ల ముసుగులో కార్లు, టిప్పర్లు, జేసీబీ వంటి భారీ వాహనాలను మోసపూరితంగా కొనుగోలు చేసి నెదర్లాండ్, దక్షిణాఫ్రికా, కాంబోడియా వంటి దేశాలకు విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారి తెలిపారు. ఆదివారం వరంగల్ మట్టెవాడ పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తురకలకుంట గ్రామానికి చెందిన వరికుప్పల దశరథ్, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వసంతనగర్ చిన్నదుర్గం సందాన్, రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం జగద్గిరిగుట్టకు చెందిన కౌశెట్టి రాకేశ్, హైదరాబాద్ సంతో్‌షనగర్ ఓల్డ్ సిటీకి చెందిన మహ్మద్ జాబీర్‌లు ఈ దందాకు తెరలేపారన్నారు. వీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో... ఆర్థిక ఇబ్బందుల కారణంగా భారీ వాహనాలు అమ్మకానికి పెట్టుకున్న కొంతమంది యజమానుల నుంచి వాహనాలు కొనుగోలు చేసేవారని చెప్పారు.
వాటికి సంబంధించిన ఈఎంఐలు తామే కడతామని నమ్మించేవారన్నారు. అలా కొన్న వాహనాలను ఇతరులకు విక్రయించడమో లేక స్ర్కాప్ కింద అమ్మడమో చేసేవారని వివరించారు. అలాగే ముంబాయిలోని కొన్ని బృందాల ద్వారా విదేశాలకు ఎగుమతి చేసేవారని డీసీపీ వెల్లడించారు. ముఠా సభ్యులు గతంలో హైదరాబాద్ పోలీసులకు పట్టుబడి సుమారు 16 నెలలు జైలుకు వెళ్లారని, విడుదలయ్యాక కూడా అదే తరహాలో నేరాలకు పాల్పడుతున్నారని స్పష్టం చేశారు. 2023లో వరంగల్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సుమారు నాలుగున్నర కోట్ల విలువైన వాహనాలను మోసపూరితంగా తీసుకొని నెదర్లాండ్, సౌతాఆఫ్రికా, కాంబోడియా లాంటి దేశాలకు ఎగుమతి చేశారని తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున వరంగల్ హనుమాన్‌జంక్షన్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకొని, 5 కార్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
Updated Date - Jun 17 , 2024 | 05:19 AM