Hyderabad: బదిలీకి లెక్క..
ABN, Publish Date - Jul 01 , 2024 | 02:35 AM
రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇకపై విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగానే ఉపాధ్యాయులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందుతుందని భావిస్తోంది.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు
10 మంది పిల్లలున్న పాఠశాలకు ఒక టీచర్
40 మంది ఉంటే ఇద్దరు.. 60 మందికి ముగ్గురు
బదిలీల్లో ఉపాధ్యాయుల కేటాయింపు విధానమిదే
విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి హేతుబద్ధీకరణ
విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాల కోసమే..
ప్రవేశాల్లేని బడులకు ఉపాధ్యాయులను ఇవ్వరు
వీటిలో 8ఏళ్లు పూర్తయితే బదిలీ.. కోరుకున్నవారికీ!
ఆప్షన్లు చూపించకపోవడంపై సంఘాల అభ్యంతరం
బదిలీలు చేశాక సర్దుబాటు చేయాలని డిమాండ్
హైదరాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇకపై విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగానే ఉపాధ్యాయులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందుతుందని భావిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను కూడా ఈ మేరకే చూపిస్తున్నారు. బదిలీల్లో భాగంగా ప్రస్తుతం.. ఉపాధ్యాయులు తాము కోరుకునే స్థానాలకు సంబంధించి వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా.. కొన్ని పాఠశాలల్లో ఉన్న పోస్టుల కంటే తక్కువ పోస్టులను చూపిస్తున్నారని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఆ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్ పోస్టులు కేటాయించే క్రమంలో కొన్ని పాఠశాలలకు ఉన్న పోస్టుల కంటే తక్కువ మంది ఉపాధ్యాయులను ఇవ్వనున్నారు.
మరికొన్ని పాఠశాలల్లో పోస్టుల కంటే ఎక్కువ మంది టీచర్లను కేటాయించే అవకాశం కూడా ఉంది. పాఠశాల విద్యా బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు, ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్యా బోధనను అందించేందుకే ఈ విధంగా ఉపాధ్యాయ బదిలీలు చేపడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట తక్కువ మంది ఉపాధ్యాయులు, తక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉండడంతో విద్యా ప్రమాణాలు నానాటికీ పడిపోతున్నాయి. కొన్ని చోట్ల అసలు విద్యార్థులే లేని పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ నేపథ్యంలో.. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిలో హేతుబద్ధతకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు గతంలో ఉన్న మార్గదర్శకాలను కొంత సవరించింది.
మెరుగైన విద్యా బోధన కోసమే..
ఇప్పటివరకు ఉన్న విధానం ప్రకారం.. 0-19 మంది వరకు విద్యార్థులు ఉన్న పాఠశాలకు ఒక టీచర్, 20 నుంచి 60 మంది విద్యార్థులున్న పాఠశాలకైతే ఇద్దరు, 61 నుంచి 90 మంది వరకు విద్యార్థులున్న పాఠశాలకు ముగ్గురు టీచర్లు ఉండేలా గత ప్రభుత్వం 2015 జూన్ 27న జీవో నెంబరు 17, తర్వాత 2021 ఆగస్టు 21న జీవో నెంబరు 25ను జారీ చేసింది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఈ విధానంలో కొన్ని మార్పులు చేసింది. విద్యార్థుల సంఖ్య, వారికి మెరుగైన విద్యా బోధన అందించే విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆయా పాఠశాలలకు టీచర్ పోస్టులను కేటాయించాలని సర్కారు నిర్ణయించింది. దీని ప్రకారం.. 1 నుంచి 10 మంది విద్యార్థులున్న పాఠశాలకు ఒక టీచర్‌ను, 11 నుంచి 40 మంది వరకు విద్యార్థులున్న పాఠశాలకైతే ఇద్దరు టీచర్లను కేటాయించాలని నిర్ణయించారు. ఇక 41 నుంచి 60 మంది విద్యార్థులున్న పాఠశాలకు ముగ్గురు టీచర్లను కేటాయించాలని, 61కిపైన విద్యార్థులున్న పాఠశాలకైతే.. ఆ స్కూల్‌కు మంజూరైన అన్ని పోస్టులనూ భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకే వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఒక్క విద్యార్థి కూడా లేని (జీరో అడ్మిషన్ల) పాఠశాలలకు ఉపాధ్యాయులను కూడా కేటాయించడం లేదు. ఈ మేరకు బదిలీ ఆప్షన్ కూడా ఇవ్వకూడదని నిర్ణయించారు. రాష్ట్రంలో ఈ ఏడాది జీరో అడ్మిషన్ల స్కూళ్ల సంఖ్య 1,739గా గుర్తించారు. వీటిలో ఇప్పటికీ 1,609 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఇందులో ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్నవారు తప్పనిసరిగా బదిలీ అవుతారు. ఎనిమిదేళ్లు పూర్తికాని వారు మాత్రం ఆ పాఠశాలల్లోనే ఉంటారు. బదిలీల ప్రక్రియ పూర్తయి సోమవారం ఉదయం పోస్టుల కేటాయింపు తర్వాత విద్యార్థులు లేని పాఠశాల్లలో ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారనేది స్పష్టత రానుంది.
పాఠశాలలో ఒకరిద్దరు విద్యార్థులు చేరినా ఓకే..
విద్యార్థులు లేని పాఠశాలల్లో ఒకరిద్దరు విద్యార్థులు చేరినా ఉపాధ్యాయులను కేటాయిస్తారు. ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలల్లోని ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్న ఇతర పాఠశాలకు బదిలీ కావాలని కోరుకుంటే ప్రభుత్వం వెంటనే ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. అంతేకాకుండా.. పాఠశాలలో ప్రస్తుతం ఉన్న విద్యార్థుల కన్నా రాబోయే రోజుల్లో ఎక్కువ మంది చేరితే ..పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొత్తగా ఉపాధ్యాయులను కేటాయించనున్నారు. ఈ విధానం ద్వారా ఉపాధ్యాయుల కొరత సమస్య కూడా తలెత్తదని, ఎక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లకు ఆ మేరకు టీచర్లను కేటాయించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. శిక్షణ పొంది, నైపుణ్యం, అపార అనుభవం ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుల బోధన విద్యార్థులకు అందేలా చూడాలన్నదే ప్రభుత్వం లక్ష్యంగా ఉంది.
ఈ మేరకే విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిని హేతుబద్ధీకరించాలని నిర్ణయించింది. విద్యార్థులు లేనిచోట ఉపాధ్యాయుల సామర్థ్యం వృథా కావద్దనే ఉద్దేశంతోనే బదిలీల్లో విద్యార్థులు లేని పాఠశాలలను వెబ్ ఆప్షన్‌లో బ్లాక్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మిగిలిన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఖాళీలను ఆన్‌లైన్‌లో చూపారు. ఇప్పటికే ఉపాధ్యాయులు (రంగారెడ్డి జిల్లా మినహా) వెబ్ ఆప్షన్లు ఇవ్వడం దాదాపు పూర్తయింది. ఆదివారం రాత్రి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగుస్తుంది. వాటిని పరిశీలించిన తర్వాత సోమవారం ఉదయం ఉపాధ్యాయులు పెట్టుకున్న దరఖాస్తుల ఆధారంగా ఆయా పాఠశాలలకు వారిని బదిలీ చేసి ఆ వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచుతారు. సోమవారం ఉదయం నుంచి రంగారెడ్డి జిల్లాలోని పాఠశాలల్లో ఖాళీలకు అనుగుణంగా బదిలీల ప్రక్రియను ప్రారంభించి మూడు రోజుల్లో దానిని పూర్తి చేస్తారు.
ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాలు..
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలు ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిర్ణయం కారణంగా.. ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను వెబ్ ఆప్షన్లలో చూపించకుండా కొన్ని పోస్టులనే చూపిస్తున్నారని, దీంతో ఉపాధ్యాయులకు నష్టం జరుగుతుందని పేర్కొంటున్నాయి. ఉపాధ్యాయల సంఘాల స్టీరింగ్ కమిటీ కన్వీనర్ చావా రవి, డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సోమయ్య, లింగారెడ్డి, ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ షౌకత్ అలీ, పిట్ల రాజయ్య ఈ విషయంపై స్పందించారు. బదిలీల్లో అన్ని ఖాళీలను చూపించి, బదిలీల అనంతరం సర్దుబాటు చేయాలని వారు కోరారు.
విద్యార్థుల సంఖ్య పేరిట వేలాది పోస్టులను బ్లాక్ చేసి అప్రకటిత రేషనలైజేషన్ చేస్తున్నారని ఆరోపించారు. దీనినితీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టు కేసులను బూచిగా చూపి వేల సంఖ్యలో ఉండే ఎస్‌జీటీలకు ఆప్షన్ గడువును ఒక్క రోజే ఇచ్చి హడావుడిగా బదిలీలను ముగించాలని చూడటం సమంజసం కాదన్నారు. సీనియారిటీ జాబితాల్లో తప్పులు సవరించకుండా, ఖాళీలను పూర్తి స్థాయిలో చూపించకుండా జరిపే బదిలీల ద్వారా న్యాయం జరగదన్నారు.
Updated Date - Jul 01 , 2024 | 02:44 AM