Medical Department: వైద్య శాఖ బదిలీలపై విజిలెన్స్ విచారణ
ABN, Publish Date - Jul 28 , 2024 | 03:46 AM
వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల బదిలీల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు.
హెల్త్ సెక్రటరీకి మంత్రి దామోదర ఆదేశాలు
హైదరాబాద్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల బదిలీల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల బదిలీల్లో భారీ అవినీతి జరిగిందని మీడియాలో కథనాలు రావడంతో ఆ శాఖ ఉన్నతాధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడిన వారు ఏ స్థాయి ఉద్యోగైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కాగా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల బదిలీల్లో గందరగోళం కొనసాగుతూనే ఉంది. తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారి జాబితాలో 600 మంది స్టాఫ్ నర్సులు ఉండగా వారిలో 250 మందికే అధికారులు స్థాన చలనం కల్పించారు.
మిగిలిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించకుండానే బదిలీల ప్రక్రియను ముగించారు. దీంతో పెద్ద సంఖ్యలో స్టాఫ్ నర్సులు డీహెచ్ కార్యాలయం వద్ద శనివారం ఆందోళనకు దిగారు. ఈ నెల 30న హెడ్ నర్సుల బదిలీలకు కౌన్సెలింగ్ జరగనుండగా...హెడ్ నర్సుల జాబితాలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు ల్యాబ్ టెక్నిషియన్(ఎల్టీ) గ్రేడ్-2 బదిలీల్లో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని ఎల్టీలు ఆరోపిస్తున్నారు. 95 శాతం అభ్యర్థులు వారు ఎంచుకున్న ప్రాంతం కాకుండా సుదూర ప్రాంతాలకు అఽధికారుల ఇష్టానుసారంగా బదిలీ చేశారని తెలిపారు. ఈ బదిలీలపై రీ కౌన్సెలింగ్ నిర్వహించాలని లేని పక్షంలో సమ్మెకు దిగుతామని ఎల్టీలు హెచ్చరిస్తున్నారు.
Updated Date - Jul 28 , 2024 | 03:46 AM