Dharani Portal: ఆర్వోఆర్-2024 చట్టంతో.. ధరణిలో సవరణలకు చాన్స్
ABN, Publish Date - Aug 04 , 2024 | 04:59 AM
ధరణి పోర్టల్‌లో ఇంతకాలం పరిష్కారానికి వీలులేని సమస్యలకు చరమగీతం పాడేందుకు సర్కారు సిద్ధమైంది. ఇందుకోసం తీసుకురానున్న ఆర్వోఆర్-2024 ముసాయిదా బిల్లులో పరిష్కార మార్గాలను చూపించనుంది.
చట్టాన్ని మళ్లీమళ్లీ మార్చకుండా పలు సెక్షన్లు.. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత అసెంబ్లీలో ముసాయిదా
హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌లో ఇంతకాలం పరిష్కారానికి వీలులేని సమస్యలకు చరమగీతం పాడేందుకు సర్కారు సిద్ధమైంది. ఇందుకోసం తీసుకురానున్న ఆర్వోఆర్-2024 ముసాయిదా బిల్లులో పరిష్కార మార్గాలను చూపించనుంది. ఆర్వోఆర్-2020 చట్టంలో పరిష్కరించలేని సమస్యలకు ఈ బిల్లులో పలు సెక్షన్లను పొందుపరిచింది.
ఏమిటా సమస్యలు?
ఆర్వోఆర్-2020 చట్టంలో కొన్ని సమస్యలకు పరిష్కారమే లేదు. ధరణి పోర్టల్ రాకముందు డాక్యుమెంట్ల ద్వారా కొనుగోలు చేసిన భూమిని మ్యుటేషన్ చేసే అధికారం ఈ చట్టంలో లేదు. భూ రికార్డుల ప్రక్షాళనలో జరిగిన తప్పులను సరిదిద్దడం, 22ఏ రిజిస్ట్రార్‌లో నమోదైన వాటిని సవరించడానికి అవకాశాల్లేవు. అన్నింటికీ మించి.. ధరణి పోర్టల్ అమల్లోకి రావడానికి ముందు భూములను కొన్నవారి పేర్లతో కాకుండా.. పాత యజమానుల పేరిట డిజిటల్ పాస్‌పుస్తకాలను జారీ చేశారు. వాటి ఆధారంగా ఆ భూములను మళ్లీ అమ్మిన దాఖలాలున్నాయి. అలాంటి క్రయవిక్రయాలను రద్దుచేసే అధికారం 2020 చట్టం ప్రకారం రెవెన్యూ శాఖకు లేదు. దాంతో.. అలాంటి సమస్యలను కోర్టుల్లో పరిష్కరించుకోవాలని అధికారులు సూచించారు.
అంతేకాదు..! ఒక్కసారి డిజిటల్ పాస్‌పుస్తకం జారీ అయితే.. దాన్ని రద్దుచేసే అధికారం కూడా పాత చట్టంలో లేదు. ఇలా అనే రకాల సమస్యలతో రైతులు సతమతమయ్యారు. వీటికి పరిష్కారంగా ప్రభుత్వం ఆర్వోఆర్-2024 చట్టాన్ని తీసుకువస్తోంది. పాత చట్టంలో కలెక్టర్లకే ఉన్న కొన్ని అధికారాలను ఆర్డీవోలు, తహసీల్దార్లకు కట్టుబెట్టాలని కొత్త చట్టం ముసాయిదా బిల్లు చెబుతోంది. బాధితులు తమకు అన్యాయం జరిగిందని భావిస్తే.. అప్పీల్‌కు వెళ్లొచ్చు. ప్రతి కమతానికి శాశ్వత నంబర్‌ను కేటాయించనున్నారు.
భూములకు తొలుత తాత్కాలికంగా భూధార్ నంబర్ ఇస్తారు. సర్వే తర్వాత శాశ్వత భూధార్ నంబర్‌ను కేటాయిస్తారు. ఆ నంబర్ ద్వారా కమతానికి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవచ్చు. అంతేకాదు.. భవిష్యత్‌లో కూడా మళ్లీమళ్లీ ఆర్వోఆర్ చట్టాన్ని మార్చకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలను సులభంగా అమలు చేసేందుకు వీలుగా పలు సెక్షన్లను ఈ బిల్లులో చేర్చారు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు చట్టరూపుదాలిస్తే.. రైతుల ధరణి కష్టాలు తీరిపోతాయని అధికారులు చెబుతున్నారు.
Updated Date - Aug 04 , 2024 | 04:59 AM