Tummala: రూ.79.57 కోట్ల పంట నష్ట పరిహారం విడుదల
ABN, Publish Date - Oct 10 , 2024 | 03:20 AM
గత నెలలో కురిసిన భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు రూ.79.57కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
గత నెలలో భారీ వర్షాలకు 79 వేల ఎకరాల్లో నష్టం
రైతుల ఖాతాల్లోనే నిధులు జమ చేస్తాం: మంత్రి తుమ్మల
పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): గత నెలలో కురిసిన భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు రూ.79.57కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎకరాకు రూ.10వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లో 79,574 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. కాగా, ఈ ఏడాది మార్కెట్‌కు 25.33 లక్షల టన్నుల పత్తి వచ్చే అవకాశం ఉందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కెట్‌లో పత్తి విక్రయాల పర్యవేక్షణకు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసి, వాటి సజావుగా విక్రయాలు జరిగేట్లు పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా టెండర్లలో పాల్గొన్న 319 జిన్నింగ్ మిల్లులను గుర్తింపు కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించే అధికారాన్ని ఆయా జిల్లాల కలెకర్లకు అప్పగించాలని పేర్కొన్నారు. రైతులు ఏ కేంద్రానికి వెళ్తే త్వరగా అమ్ముకునేందుకు అవకాశం ఉందనే వివరాలను రైతులకు తెలియజేయాలన్నారు. పత్తిని విక్రయించే రైతులు తప్పనిసరిగా వారి ఆధార్ కార్డును కొనుగోలు కేంద్రానికి తీసుకువెళ్లాలని, ఆధార్‌తో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాకు నగదు చెల్లింపులు ఉంటాయని తెలిపారు. కాగా, మరో 7 వ్యవసాయ మార్కెట్ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్లు, పాలకవర్గ సభ్యులుగా ఎంపికైన వారికి మంత్రి తుమ్మల శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - Oct 10 , 2024 | 03:20 AM