Harish Rao : గిరిజనబిడ్డలు విద్యకు దూరం కావడమా?
ABN, Publish Date - Aug 28 , 2024 | 05:29 AM
ప్రభుత్వ తప్పిదం వల్ల గిరిజన బిడ్డలు ప్రాథమిక విద్యకు దూరం కావడం క్షమించరాని నేరమని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
టీచర్లు లేక బడులు మూతబడితే ఎలా: హరీశ్
హైదరాబాద్, ఆగస్టు27 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ తప్పిదం వల్ల గిరిజన బిడ్డలు ప్రాథమిక విద్యకు దూరం కావడం క్షమించరాని నేరమని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గిరిజనులు అధికంగా నివసించేచోట వారికి చదువుకునే అవకాశం లేకపోవడం బాధాకరమని అన్నారు. ఉపాధ్యాయులు లేని కారణంగా గిరిజన ప్రాంతాల్లో ఏకంగా 43 పాఠశాలలు మూతబడితే ఎలాగని ఎక్స్ వేదికగా ఆయన ప్రశ్నించారు. దీనికి పాలకులు సిగ్గుతో తలదించుకోవాలని, ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి.. ఆ పాఠశాలలను వెంటనే తెరిపించాలని హరీశ్ డిమాండ్ చేశారు.
ఆస్పత్రుల్లో మందుల్లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వైద్య విభాగాలు చేతులెత్తేయడంతో చేసేదిలేక ప్రైవేటు ఫార్మసీల్లో కొనాల్సి వస్తోందని హరీశ్ ఆరోపించారు. ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కయిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మందుల కొరత ఉందని ఆయన ఆరోపించారు. మూడు నెలలకు సరిపడా మందుల బఫర్ స్టాక్ పెట్టుకోవాల్సి ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోందని ఆయన ప్రశ్నించారు.
Updated Date - Aug 28 , 2024 | 05:30 AM