Harish Rao: దావత్‌లు బంద్ జేసి.. హాస్టళ్లను దత్తత తీసుకోవాలి
ABN, Publish Date - Dec 29 , 2024 | 04:40 AM
దావత్‌లు, నూతన సంవత్సర వేడుకలను బంద్ చేసి, ప్రభుత్వ హాస్టళ్లను దత్తత తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
సంఘాలు, దాతలు ముందుకు రావాలి: హరీశ్‌రావు
సిద్దిపేట కల్చరల్/హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): దావత్‌లు, నూతన సంవత్సర వేడుకలను బంద్ చేసి, ప్రభుత్వ హాస్టళ్లను దత్తత తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని నాసర్‌పుర అర్బన్ రెసిడెన్షియల్ బ్రిడ్జి స్కూలులోని విద్యార్థులకు పవనసుత యూత్ సేవా సమితి ఆధ్వర్యంలో హరీశ్ స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. యువజన సంఘాలు, యువతతో పాటు ప్రతి ఒక్కరూ ముందుకువచ్చి ప్రభుత్వ హాస్టల్లోని విద్యార్థులకు సాయమందించాలని సూచించారు.
చలికాలం వల్ల హాస్టళ్లలోని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని, విద్యార్థుల సమస్యలు తీర్చేందుకు వివిధ సంఘాలు, దాతలు ముందుకురావాలని కోరారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయని చేతలు గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. ‘కంది రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే రాష్ట్రవ్యాప్తంగా కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్లు మద్దతు ధరపై 400 రూపాయలు బోనస్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి’ అని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ రాశారు.
Updated Date - Dec 29 , 2024 | 04:40 AM