Flood Damage: వరద నష్టం.. తీరని కష్టం
ABN, Publish Date - Sep 03 , 2024 | 04:22 AM
రెండు రోజులుగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వర్షబీభత్సం మూడోరోజూ కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా 173 మండలాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి!
రాష్ట్రవ్యాప్తంగా 173 మండలాల్లో భారీ వర్షాలు
కామారెడ్డి సదాశివనగర్ మండలంలో 24 సెం.మీ వర్షం
ఖమ్మం జిల్లాలో 60-70 వేల ఎకరాల్లో పంట నీటమునక
రూ.1000 కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా
మహబూబాబాద్ జిల్లాలో తెగిన 53 చెరువుల కట్టలు
ఉమ్మడివరంగల్ జిల్లాలో 35 వేలకు పైగా ఎకరాల మునక
ఆగిన బొగ్గు ఉత్పత్తి.. సింగరేణికి రూ.60 కోట్లకు పైగా నష్టం
వర్షాలు తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్న ఉమ్మడి నల్లగొండ
ఉమ్మడి పాలమూరులో 10వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో నేడు విద్యాసంస్థలకు సెలవు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): రెండు రోజులుగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వర్షబీభత్సం మూడోరోజూ కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా 173 మండలాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి! అయితే.. శని, ఆదివారాల్లో కురిసిన భారీ, అతిభారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న ఉమ్మడి నల్లగొండ, మానుకోట, ఖమ్మం జిల్లాల్లో వాన ఉధృతి ఒకింత తగ్గింది. కానీ.. ప్రజల కంట కన్నీరే మిగిలింది! లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి! వేలాదిగా ఇళ్లు కూలాయి!! అయినవారిని కోల్పోయినవారు కొందరు.. ఇళ్లు పూర్తిగా నీట మునగడంతో కట్టుబట్టలతో మిగిలినవారు ఇంకొందరు! నీటమునిగిన పంటలను చూసి రైతన్నలు కంటతడి పెడుతున్నారు.
తేరుకుంటున్న మానుకోట
రెండురోజులుగా కురిసిన భారీ వర్షాలు దెబ్బకు అతలాకుతలమైన మహబూబాబాద్ (మానుకోట) జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. వర్ష బీభత్సానికి జిల్లాలో పలుచోట్ల పంటలు కొట్టుకుపోగా, పొలాల్లో ఇసుక మేట వేసింది. అనేక చోట్ల వాగులపై వంతెనలు, బీటీరోడ్లు, అప్రోచ్ రోడ్లు ధ్వంసం కాగా, చెరువు కట్టలు తెగిపోయాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం వరకు పడిన భారీ వర్షానికి మహబూబాబాద్ జిల్లాలో 53 చెరువుల కట్టలు తెగినట్టు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. పాలేరు, ఆకేరువాగులపై మూడు చెక్‌డ్యాంలు కొట్టుకుపోయాయి.
వాన ఉధృతికి జిల్లా వ్యాప్తంగా 15 రోడ్లు దెబ్బతినగా.. సుమారు 28 వేల ఎకరాలు నీటమునిగినట్టు ప్రాథమిక అంచనా. కాగా.. రాళ్లవాగులో ఆదివారం రాత్రి కొట్టుకుపోయిన నాగభూషణం (రాజమండ్రి వాసి) ఆచూకీ ఇంత వరకు లభించలేదు. తొర్రూరు మండలం వెంకటపురం వాగులో గల్లంతైన వ్యక్తి చిన్న సోమయ్య మృతదేహాన్ని సోమవారం పోలీసులు వెలికితీశారు. ఇక.. భారీ వర్షాలతో హనుమకొండ జిల్లాలో సుమారు 1000 చెరువులూ నిండుకుండలను తలపిస్తున్నాయి. వరంగల్ జిల్లాలో 6,533 ఎకరాల్లో పంట నీట మునిగింది. జనగామ జిల్లాలో సుమారు 278 ఎకరాల్లో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది.
మల్హర్ మండలంలోని తాడిచర్ల ఓసీపీలో భారీ వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రెండు రోజుల్లో 12 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2.50 లక్షల ఓబీ వెలికితీత పనులు జరగాల్సి ఉండగా అవన్నీ స్తంభించిపోయాయి. ఓసీపీలోకి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపిస్తున్నారు. భూపాలపల్లి సింగరేణి ఏరియాలో భారీ వర్షాలకు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్-2, 3లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మూడు రోజులలో వర్ష ప్రభావంతో ఓసీ-2, 3 ప్రాజెక్ట్‌ల నుంచి సుమారు 17వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగిందని.. దీంతో సింగరేణికి సుమారు రూ. 60 కోట్లు నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో..
వరుసగా రెండురోజులపాటు వర్షాలతో అతలాకుతలమైన ఉమ్మడి నల్గొండ జిల్లాలో.. 23,194 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వరుణుడు శాంతించడంతో సోమవారం అక్కడక్కడా జల్లులు కురిశాయి. హుజూర్‌నగర్‌లోని ముత్యాల బ్రాంచ్ కెనాల్ రెండు చోట్లు గండి పడడంతో నీరు పంట పొలాల్లోకి చేరింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రం నుంచి కోదాడకు వెళ్లే ప్రధాన రహదారిపై కందిబండ గ్రామంలో వంతెన.. సోమవారం ఉదయం పదింటికి కూలిపోయింది. కానీ అధికారులు ఆదివారం నుంచే వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో ప్రాణనష్టం జరగలేదు. ఇక.. రెండు రోజులుగా నీటిలోనే ఉన్న సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం సోమవారం వర్షం తగ్గుముఖం పట్టడంతో తేరుకుంటోంది నీటిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపిన ప్రజలు తమ ఇళ్లలోకి చేరిన నీరు తగ్గుముఖం పట్టడంతో.. తమ వస్తువులు, వాహనాలు ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవడం కనిపించింది.
ఉమ్మడి పాలమూరులో
రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో ఉమ్మడి పాలమూరు జిల్లా జనజీవనం స్తంభించిపోయింది. సోమవారం కొంత సమయం తెరిపి ఇచ్చినప్పటికీ మళ్లీ వర్షం పడుతోంది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 10,072 ఎకరాల్లో వరి, మిరప, పత్తి, కంది పంటలు దెబ్బతిన్నాయి. అవి పూర్తిగా నీట మునిగినందున.. నీళ్లు తగ్గిపోతేనే పంట నష్టంపై కచ్చితమైన అంచనా వేయగలమని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో..
జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగానే వాన కురిసింది. వర్షబీభత్సానికి వాగులు పొంగి పొర్లుతుండగా.. చెరువులు నిండుకుండల్లా మారాయి. జిల్లాలోని 996 చెరువులకుగాను.. 678 చెరువులు పూర్తిగా నిండి అలుగులు పారుతున్నాయి. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ వదలడంతో కొప్పర్గ, హంగర్గ గ్రామాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. గోదావరికి భారీగా వరద వచ్చిన నేపథ్యంలో.. రెంజల్, నవీపేట, నందిపేట, డొంకేశ్వర్, మెండోరా, ఏర్గట్ల మండలాల పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంత గ్రామవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. వరద బీభత్సం నేపథ్యంలో మరో మూడు రోజులపాటు అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో చాటింపు వేయించారు. వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా ప్రకారం కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 2 వేల ఎకరాలలో మొక్కజొన్న, సోయా, పత్తి పంటలు వరద నీటిలో మునిగాయి. కాగా.. మంగళవారం కూడా భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలు, కళావాలలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
ఆదిలాబాద్ జిల్లాలో
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కుంటాల, పొచ్చెర, కనకాయి, గాయత్రి జలపాతాలు వరద నీటితో పరవళ్లు పెడుతున్నాయి. పెన్‌గంగా బ్యాక్‌వాటర్‌తో భీంపూర్, తాంసి, జైనథ్, బేల మండలాల్లోని పలు గ్రామాల్లో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1849 ఎకరాలలో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా. మరో 48గంటల పాటు జిల్లాకు భారీ వర్షసూచన ఉండడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఇక.. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బాసర వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.
ఖమ్మం జిల్లాలో.. వరద నష్టం రూ.1000 కోట్లు
ఖమ్మం జిల్లాలో వాన, వరద, మున్నేరు బీభత్సంతో సుమారు వెయ్యి కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. జాతీయ, రాష్ట్ర రహదారులు దెబ్బతిన్నాయి. జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో పంటలు ఉండగా.. 60 వేల నుంచి 70వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్టు వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. వరి, పత్తి, పెసర, మినుము, మిర్చి, తోపాటు పలు కూరగాయల తోటలు భారీవర్షాలు, వరదలకు కొట్టుకుపోగా కొన్నిచోట్ల ఇసుకమేటలు వేశాయి. ఆర్‌అండ్‌బీ పీఆర్, జాతీయ రహదారులకు సుమారు రూ.400 కోట్ల దాకా నష్టం వాటిల్లగా.. మున్నేరు వరదతో విద్యుత్‌శాఖకు సుమారు రూ.10 కోట్ల నుంచి 20 కోట్ల నష్టం జరిగినట్టు ప్రాధమిక అంచనా. వేలాదిగా ఇళ్లు కూలినట్టు సమాచారం. ఆ నష్టం రూ.వందల కోటల్లో ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో
మూడురోజులుగా కురుస్తున్న వర్షాలు సోమవారం కొంత తెరిపిచ్చినా.. వరద ఇబ్బందుల నుంచి ప్రజలు ఇంకా తెప్పరిల్లలేదు. చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి భారీ ఎత్తున వరద నీటిని దిగువకు వదలడంతో రాళ్లవాగు పరివాహకంలో బ్యాక్ వాటర్ పెరిగి పోయింది. వరద నీరు సమీపంలోని ఎన్టీఆర్‌నగర్‌లోని 20 ఇళ్లలోకి నీరు చేరింది. గోదావరి నది సమీపంలోగల మాతా శిశు సంరక్షణ కేంద్రం చుట్టూ నీరు చేరడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బాలింతలు, శిశువులను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పలుచోట్ల పిడుగులు పడి విద్యుత్తు సబ్‌స్టేషన్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్)కు వర్షాల కారణంగా 18,65,000 రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. కరీంనగర్ రూరల్ మండలంలో దాదాపు 150 ఎకరాల పంట పొలాలు వరదనీటిలో మునిగిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షానికి సుమారు 700 ఎకరాల్లో పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు తవ్వకాలు నిలిచిపోగా, ఓబీ మట్టి తొలగింపు పనులకు ఆటంకం ఏర్పడుతోంది. దాదాపు రూ.19.5 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది.
రాజధాని నగరాన్ని వదలని వాన...
రాజధాని హైదరాబాద్ నగరాన్ని వణికిస్తున్న వాన మూడో రోజు జల్లులతో సరిపెట్టింది. సోమవారం ఉదయం నుంచి ముసురు, జల్లులు పడటంతో పలు ప్రాంతాల్లో రహదారులు బురదతో నిండిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం ఉదయం 8 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు 22 గంటల్లో అత్యధికంగా గచ్చిబౌలి ప్రాంతంలో 9.7 సెం.మీ వర్షం కురిసింది. హెచ్‌సీయూలో 8.5, లింగంపల్లిలో 8.5, హైదర్‌నగర్ -8.0, కూకట్‌పల్లి బాలాజీనగర్- 7.5,చందానగర్- 7.3, యూసు్‌ఫగూడ - 6.9, మాదాపూర్‌లో 6.8 సెం.మీ వర్ష పాతం నమోదయ్యింది. ముఖ్యంగా.. ఆదివారం అర్థరాత్రి తర్వాత పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, లింగంపల్లి, హైదర్‌నగర్, బాలాజీనగర్, కేపీహెచ్‌బీ, చందానగర్, యూసు్‌ఫగూడ, మాదాపూర్, షేక్‌పేట, హఫీజ్ పేట, బోరబండ ప్రాంతాల్లో రహదారులపై మోకాళ్లలోతు వరదనీరు నిలిచిపోయింది. కాగా.. మరో రెండురోజుల పాటు గ్రేటర్‌లో తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
నష్టం అంచనా 5,438 కోట్లు అత్యధికంగా రోడ్లుభవనాల శాఖకు నష్టం
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో రూ.5,438 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. పలు జిల్లాల్లో పంటలు దెబ్బతినగా.. 84 చోట్ల రోడ్లు తెగిపోయాయి. చాలా చోట్ల రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. ఈ నష్టంలో సింహభాగం ఆర్‌అండ్‌బీ శాఖ పరిఽధిలోని రోడ్లవేనని స్పష్టమవుతోంది. ఈ శాఖకు కలిగిన నష్టం అంచనాను ప్రభుత్వం రూ.2,362 కోట్లుగా లెక్కగట్టింది. మునిసిపల్ శాఖ పరిధిలో దాదాపు రూ.1,150కోట్ల మేర నష్టం వాటిల్లగా.. దాదాపు 4.15లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని, దీని విలువ దాదాపు రూ.415కోట్లుగా ఉంటుందని అంచనావేసింది.
సాగునీటి పారుదల శాఖ పరిధిలో దెబ్బతిన్న చెరువుల మరమ్మతులకు రూ.629కోట్ల మేర ఖర్చవుతుందని పేర్కొంది. ఇంకా.. పంచాయతీరాజ్ శాఖకు రూ.170కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ.12కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.25కోట్లు, ప్రజా ఆస్తులకు రూ.500కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీఎంవో ఓ ప్రకటనను విడుదల చేసింది. కాగా.. 110 పునరావాస కేంద్రాల్లో 4,000 మందిని తరలించినట్లు ఆ ప్రకటన స్పష్టం చేస్తోంది. 32 జిల్లాల్లో సుమారు 84 చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. జాతీయ రహదారుల విషయానికి వస్తే.. దెబ్బతిన్న రోడ్ల తాత్కాలిక మరమ్మతులకు రూ.3 కోట్లు, పూర్తిస్థాయి నిర్మాణాలకు రూ.19 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు.
Updated Date - Sep 03 , 2024 | 04:23 AM