Khammam: మళ్లీ వణికిన ఖమ్మం..
ABN , Publish Date - Sep 09 , 2024 | 03:57 AM
ఉమ్మడి ఖమ్మం జిల్లాను వరుణుడు మరోసారి వణికించాడు..! గత వారం నాటి అనుభవం ఇంకా కళ్లముందు కదలాడుతుండగానే కంగారు పెట్టించాడు..!
ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం.. మానుకోటలో 18 సెం.మీ.
మరోసారి కలకలం రేపిన మున్నేరు వాగు
ముంపు ప్రాంతాలకు ఐఏఎస్‌లు.. అర్ధరాత్రి ప్రజల తరలింపు
ముప్పు తప్పడంతో ఊరట.. పునరావాస కేంద్రాల్లో భట్టి
ఉమ్మడి రంగారెడ్డిలో తెగిన చెరువులు.. మునిగిన పంటలు
రాష్ట్రంలో వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి
నాగర్‌కర్నూల్ జిల్లాలో దుందుభీలో చిక్కుకున్న కారు
9 మందికి త్రుటిలో తప్పిన ప్రాణాపాయం.. సాత్నాలలో
కొట్టుకుపోయి అతికష్టం మీద బయటపడ్డ రైతులు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): ఉమ్మడి ఖమ్మం జిల్లాను వరుణుడు మరోసారి వణికించాడు..! గత వారం నాటి అనుభవం ఇంకా కళ్లముందు కదలాడుతుండగానే కంగారు పెట్టించాడు..! ముఖ్యంగా మున్నేరు మళ్లీ ముంచేసేలా కనిపించింది..! చివరకు శాంతించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చాలా మండలాల్లో భారీ వర్షం కురిసింది. వాగులు పొంగిపొర్లడంతో చాలాచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలోనే అత్యధికంగా మహబూబాబాద్‌లో 18.25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తల్లాడలో 12.6, ఖమ్మం అర్బన్‌లో 11.5, అన్నపురెడ్డిపల్లిలో 9.8, రఘునాథపాలెంలో 9.2, వైరా, కొణిజర్లలో 9, వేంసూరులో 8.7 సెం.మీ. వాన పడింది. కాగా, కొణిజర్ల మండలం పగిడేరు వద్ద రోడ్డు కొట్టుకుపోవడంతో ఖమ్మం-భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
బుగ్గవాగు ఉధృతంగా ప్రవహించడంతో లింగాల నుంచి డోర్నకల్ వెళ్లే రహదారిని మూసేశారు. రఘునాథపాలెం మండలం చిమ్మపూడి-కోయచెలక రోడ్డు తెగి ఖమ్మానికి రాకపోకలు బంద్ అయ్యాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. వాగులు, వంకలు ఉప్పొంగాయి. చెరువులు, కాల్వలకు గండ్లు పడ్డాయి. పత్తి, మొక్కజొన్న నీట మునిగాయి. తలకొండపల్లి మండలంలో 11.18, ఆమనగల్లులో 9.85, వికారాబాద్ జిల్లా యాలాల మండలం దవులాపూర్‌లో 8.88 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో ఆదివారం మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బోరబండ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేట, రాజేంద్రనగర్, నాంపల్లి, గోల్కొండ, బాలానగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హిమాయత్‌సాగర్ ఒక గేటును, ఉస్మాన్‌సాగర్ (గండిపేట) రెండుగేట్లను ఎత్తారు.
మున్నేరుపై హై అలర్ట్..
ఎగువనున్న మహబూబాబాద్‌లో, స్థానికంగా భారీ వర్షం కురవడంతో ఖమ్మం నగరంలోని మున్నేరు మళ్లీ ముంచేసేలా కనిపించింది. ఉమ్మడి ఖమ్మానికి వాతావరణ శాఖ భారీ హెచ్చరికలు జారీ చేయడంతో ఖమ్మం నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజల్లో ఏం జరుగుతోందోనన్న భయంతో హైటెన్షన్ నెలకొంది. శనివారం సాయంత్రం 8.25 అడుగులున్న మున్నేరు నీటి మట్టం పెరుగుతుండడంతో ఆందోళన అధికమైంది. ఆదివారం ఉదయానికి 15.75 అడుగులకు చేరింది. అయితే, వర్షం తగ్గడంతో మున్నేరు కూడా తగ్గుముఖం పట్టింది. ఆదివారం సాయంత్రానికి 13.10 అడుగులకు పరిమితమైంది. కాగా, దీనికిముందు మున్నేరుపై మంత్రుల ఆదేశాలతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. గత వారం అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అర్ధరాత్రి వేళ ముంపు కాలనీలకు పరుగులు పెట్టారు. ప్రజలను నిద్రలేపారు. ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌తో కలిసి ధంసలాపురం, మోతీనగర్ వైపు నుంచి, కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య రామన్నపేట, బొక్కలగడ్డ, కాల్వొడ్డు ప్రాంతాల నుంచి అప్రమత్తం చేస్తూ వచ్చారు. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆదివారం ఉదయం మున్నేరు తగ్గుముఖం పట్టడంతో తిరిగి ఇళ్లకు చేరుకున్నారు.
అర్థరాత్రి పునరావాస శిబిరంలో భట్టి..
భారీ వర్ష సూచన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చారు. అర్ధరాత్రి వేళ కాల్వొడ్డు ప్రాంతంలో ముంపు ప్రాంత ప్రజలతో మాట్లాడారు. వారిని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. అనంతరం మున్నేరు బ్రిడ్జి వద్ద వరదను పరిశీలించారు. ఒంటిగంట వరకు స్వర్ణభారతి కళ్యాణ మండపం, మహిళా డిగ్రీ కళాశాల, ధంసలాపురం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించారు. ఆహారం, వైద్యం, మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రులు తుమ్మల, పొంగులేటి కూడా.. కలెక్టర్, కమిషనర్‌లను అప్రమత్తం చేశారు.
ఉధృత దుందుభీలో నదిలో చిక్కుకున్న కారు
నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిర్సవాడ వద్ద ప్రవహిస్తున్న దుందుభీ నదిలో ఆదివారం రాత్రి పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఆదిరాల గ్రామానికి చెందిన కుటుంబం, బంధువులు తొమ్మిది మంది విహార యాత్ర కోసం కారులో కొల్లాపూర్ సమీపంలోని సోమశిలకు వచ్చారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో సిర్సవాడ వద్దనున్న దుందుభీ నది కాజ్‌వేపైన వెళ్తుండగా, ప్రవాహం ఉధృతితో మధ్యలో కారు ఆగిపోయింది. దీంతో అందులోనివారు కాపాడాలంటూ కేకలు వేశారు. సిర్సవాడ గ్రామస్థులు ట్రాక్టర్లను తీయగా.. కారులో ఉన్నవారిలో ఒకరు పోలీస్ కంట్రోల్‌ర ూమ్‌కు ఫోన్ చేశారు. ఎస్‌ఐ మహేష్, సీఐ కనకయ్య, అగ్నిమాపక శాఖ అధికారులు చేరుకున్నారు. కారులోని వారిని ఒక్కొక్కరుగా రక్షించారు. కారును కూడా జేసీబీతో బయటకు తీశారు.
సాత్నాలలో అతికష్టం మీద బయటపడ్డ రైతులు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెండల్‌వాడ గ్రామ సమీపంలోని సాత్నాల నదిని దాటుతున్న ఆరుగురు స్థానిక రైతులు.. సాత్నాల ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తడంతో అనూహ్యంగా చిక్కుకుపోయారు. నదిలో వరద ఉధృతి అధికం కావడంతో ఎడ్లబండితో సహా కొంత దూరం కొట్టుకుపోయారు. పెండల్‌వాడ గ్రామస్థులు ఎడ్లబండికి కట్టిన తాళ్లతో ఆరుగురు రైతులు, ఎడ్లను బయటకు తీశారు.
దండిగా వరద.. నిండుగా ప్రాజెక్టులు
ఎగువ నుంచి దండిగా వరద వస్తుండడంతో సాగునీటి ప్రాజెక్టులు నిండుగా కళకళలాడుతున్నాయి. ఆలమట్టి నుంచి నాగార్జున సాగర్ వరకు కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద స్థిరంగా కొనసాగుతోంది. జూరాలకు 1.60 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. సుంకేసుల నుంచి 35,832 క్యూసెక్కులు సహా శ్రీశెలానికి 2.88 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. పూర్తి స్థాయి సామర్థ్యం 215 టీఎంసీలకు గాను 207.41 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 8 గేట్ల ద్వారా 2.19 లక్షల క్యూసెక్కులు, విద్యుదుత్పత్తితో 68 వేల క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. కాగా, ఆదివారం సాగర్ మరో నాలుగు గేట్లను ఎత్తారు. మొత్తం 24 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి 2,83,419 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.
సాగర్ పూర్తి నీటి మట్టం 590 అడుగుల (312.04 టీఎంసీలు)కు 588.70 అడుగులు (308.17 టీఎంసీలు)గా ఉంది. 2.18 లక్షల క్యూసెక్కులను విడిచిపెడుతున్నారు. పులిచింతల 8 గేట్లు ఎత్తారు. పూర్తి నీటి మట్టం 175 అడుగులు (45.77 టీఎంసీలు) కాగా, ఆదివారం సాయంత్రానికి 170.70 అడుగులు (39.36 టీఎంసీలు)గా నమోదైంది. 2.29 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. 1.86 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. ఉత్తర తెలంగాణ వరదాయిని శ్రీరాంసాగర్ గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. గురువారం వరద తగ్గడంతో 42 గేట్లను మూసివేశారు. శనివారం రాత్రి 9 గేట్ల ద్వారా 2.81 లక్షల క్యూసెక్కులను విడిచిపెట్టారు. ఆదివారం మధ్యాహ్నం భారీగా వరద రావడంతో 24 గేట్లను ఎత్తి 99,968 క్యూసెక్కులను గోదావరిలోకి వదులుతున్నారు. 1.26 లక్షల క్యూసెక్కులను కిందకు పంపిస్తున్నారు. పూర్తి నీటి మట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీ)లకు గాను 1090.90 అడుగులు (60.11 టీఎంసీ)గా ఉంది. ఎల్లంపల్లి 12 గేట్లు ఎత్తి 95,256 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలి పెడుతున్నారు. పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలకు 19.20 టీఎంసీల నీరుంది. కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీలోకి 2.02 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 85 గేట్లను ఎత్తారు.
ఆహ్లాదం కోసం వచ్చి అనంత లోకాలకు..
ముంబై యువకుడి మృతి
ఆహ్లాదం కోసం ప్రాజెక్టు అందాలను తిలకించడానికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన ఇది..! ముంబైకి చెందిన ఫిరోజ్(28) జగిత్యాల జిల్లా కోరుట్లలో బంధువుల ఇంటికి వచ్చాడు. ఆదివారం నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వెళ్లాడు. వరద గేట్ల ముందు ఫిరోజ్ సరదాగా గడుపుతుండగా నీటి ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయాడు. స్నేహితుడు రోహిత్ కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. రోహిత్ ఒడ్డుకు చేరుకున్నాడు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మేడిపల్లికి చెందిన పశువుల కాపరి తిరుపతన్న (45) దొరాయకుంట అలుగు ఉధృతిలో కొట్టుకుపోయి చనిపోయాడు.
భూపాలపల్లి జిల్లా గణపురం మండలం దుబ్బపల్లికి చెందిన వ్యవసాయ కూలీ పొనగంటి సులోచన (42) పిడుగుపడి మృతి చెందింది.
వర్షాలకు గోడలు తడిసిపోవడంతో.. మెదక్ జిల్లా టేక్మాల్‌లో ఇంటి కప్పు కూలి మంగలి శంకరమ్మ (63) చనిపోయింది.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురానికి చెందిన పిల్లి వీరస్వామి (58) చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు.