High Court: డీఎస్సీ పరీక్షలపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ
ABN, Publish Date - Jul 19 , 2024 | 04:43 AM
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 11 వేల ఉపాధ్యాయ పోస్టు ల భర్తీకి నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. పరీక్షలు వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌లో ఎలాంటి ఉత్తర్వులు జారీచేయడానికి హైకోర్టు ఆసక్తి చూపకుండా విచారణను వాయిదా వేసింది.
2.45 లక్షల మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు
పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి: ఏఏజీ
యథాతథంగా డీఎస్సీ పరీక్షలు
హైదరాబాద్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 11 వేల ఉపాధ్యాయ పోస్టు ల భర్తీకి నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. పరీక్షలు వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌లో ఎలాంటి ఉత్తర్వులు జారీచేయడానికి హైకోర్టు ఆసక్తి చూపకుండా విచారణను వాయిదా వేసింది. దీంతో ఈనెల 18 నుంచి ప్రారంభమైన డీఎస్సీ పరీక్షలు యథాతథంగా కొనసాగనున్నాయి. డీఎస్సీ- 2024 పరీక్షలను వాయిదా వేసేలా ఆదేశించాలని.. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తగిన సమ యం ఇవ్వకుండా హడావుడిగా పరీక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొంటూ రాంపల్లి అశోక్, మరో తొమ్మిది మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలను వినిపిస్తూ.. టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్-1, గ్రూప్-2, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోస్టులకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారని.. ఈ నేపథ్యంలో తగిన సమయం ఇవ్వకుండా ప్రభుత్వం పరీక్షల విషయంలో హడావుడిగా ముందుకెళ్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ తేరా రజినీకాంత్‌రెడ్డి వాదనలను వినిపిస్తూ.. టీచర్ పోస్టుల భర్తీకి ఎన్నో ఏళ్లుగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారని.. ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందని.. గురువారం నుంచి వచ్చేనెల 5 వరకు పరీక్షలు కొనసాగనున్నాయని పేర్కొన్నారు.
ఇప్పటికే 2.45 లక్షల మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ఎవరికీ లేని అభ్యంతరం పిటిషనర్లకు ఎందుకని ప్రశ్నించారు. సెంటర్ల గుర్తింపు,. ప్రశ్నపత్రాల పంపిణీ, సిబ్బందికి విధుల కేటాయింపు, ఇన్విజిలేషన్, లాజిస్టిక్స్ తదితర అన్ని ఏర్పాట్లు పూర్తయిన దశలో పరీక్షలను వాయిదా వేయాలని కోరడం సమంజసం కాదని విన్నవించారు. వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి ఇష్టపడలేదు. తదుపరి విచారణ వచ్చేనెల 28కి వాయిదా వేసింది.
Updated Date - Jul 19 , 2024 | 04:43 AM