CM Revanth Reddy: 5 నుంచి భారీగా బదిలీలు!
ABN, Publish Date - May 26 , 2024 | 05:53 AM
ఎన్నికలు పూర్తవ్వడంతో ఇప్పుడు పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘకాలంగా ఒకేచోట పాతుకుపోయిన వారికి స్థానచలనం కలిగించనున్నారా? ఆ స్థానాల్లో సమర్థులైన అధికారులను నియమిస్తారా? ఇందుకోసం పాలనాయంత్రాంగంలో తహసీల్దార్ మొదలు సీనియర్ ఐఏఎస్ అధికారి దాకా అన్ని స్థాయుల్లో భారీ బదిలీలకు కసరత్తు జరుగుతోందా?
11లోగా అన్ని శాఖల్లో ప్రక్షాళన
తహసీల్దార్ నుంచి ఐఏఎస్ దాకా..
సిద్ధమవుతున్న బదిలీల చిట్టా
ఇంటెలిజెన్స్ నివేదికలే ప్రాథమికం
సంఘాలతోనూ చర్చించిన సర్కారు
ఉద్యోగ సంఘాలతోనూ చర్చించిన సర్కారు
హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు పూర్తవ్వడంతో ఇప్పుడు పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘకాలంగా ఒకేచోట పాతుకుపోయిన వారికి స్థానచలనం కలిగించనున్నారా? ఆ స్థానాల్లో సమర్థులైన అధికారులను నియమిస్తారా? ఇందుకోసం పాలనాయంత్రాంగంలో తహసీల్దార్ మొదలు సీనియర్ ఐఏఎస్ అధికారి దాకా అన్ని స్థాయుల్లో భారీ బదిలీలకు కసరత్తు జరుగుతోందా? ఈ ప్రశ్నలకు అత్యంత విశ్వసనీయవర్గాలు ఔననే చెబుతున్నాయి. జూన్ 4న లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ పూర్తవ్వగానే కోడ్ ముగుస్తుంది. జూన్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ప్రభుత్వ యంత్రాంగంలో భారీ ప్రక్షాళన ఉంటుందని.. వరుసగా బదిలీల ఉత్తర్వులు వెలువడతాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.
అవినీతిపై ఫోకస్..!
రేవంత్ సర్కారు అధికారంలోకి రాగానే.. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)ని బలోపేతం చేసింది. ఆ శాఖలో సమర్థులైన అధికారులతోపాటు.. కోర్టుల్లో కేసులు బలంగా నిలబడి, నిందితులకు శిక్షపడేలా పకడ్బందీ చార్జ్‌షీట్లు రూపొందించే సిబ్బంది, నిందితులు బెయిల్ పిటిషన్‌తో కోర్టులను ఆశ్రయిస్తే.. శక్తిమంతమైన కౌంటర్ వేసే సామర్థ్యమున్న సిబ్బందిని ఏసీబీకి తీసుకొచ్చింది. దాంతో.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు.. అవినీతి అధికారులపై దాడులు పెరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులున్న అధికారుల అరెస్టులు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో.. కొన్ని శాఖల్లో ఉన్నతాధికారులు మొదలు మధ్యస్థాయి అధికారులను బదిలీ చేయాలని రేవంత్ సర్కారు నిశ్చయించినట్లు తెలుస్తోంది.
సుదీర్ఘకాలం ఒకేచోట ఉన్నవారు..
గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు బదిలీలు జరిగినా.. ఒకేచోట తిష్టవేసిన వారిపై సర్కారు ఇప్పుడు దృష్టిసారించింది. కొత్త జిల్లాల విభజన సమయంలోనూ ‘ఆర్డర్ టు సర్వ్’ కింద సర్దుబాట్లు జరిగినా.. కొందరు ఒకేచోట ఉండిపోయారని గుర్తించింది. నిబంధనల ప్రకారం రెండేళ్లకు మించి ఒకేచోట పనిచేసేవారిని బదిలీ చేయాలి. ఈ క్రమంలో.. ఆర్థిక, రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్యం, పురపాలక-పట్టణాభివృద్ధి, వ్యవసాయం, విద్యుత్తు, పంచాయతీరాజ్, రోడ్లు-భవనాలు, రవాణా.. ఇలా అన్ని శాఖల్లో బదిలీలు చేపట్టేందుకు సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒకరిద్దరు కీలక ఐఏఎస్ అధికారులను, పెద్ద సంఖ్యలో ఐపీఎ్‌సలను బదిలీ చేయనున్నట్లు సమాచారం. పోలీసు శాఖలో ఇన్‌స్పెక్టర్లు మొదలు ఎస్పీల దాకా.. రెవెన్యూ శాఖలో తహసీల్దార్ మొదలు.. ఆర్‌డీవో, డీఆర్‌వో, కలెక్టర్ వరకూ బదిలీలు ఉంటాయని స్పష్టమవుతోంది.
అటు.. పంచాయతీరాజ్ శాఖలో ఎక్స్‌టెన్షన్ అధికారులతోపాటు.. డివిజనల్ పంచాయతీ ఆఫీసర్లు, జిల్లా పంచాయతీ ఆఫీసర్లు(డీపీవో), జిల్లా పరిషత్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్లకు స్థానచలనం తప్పదని తెలుస్తోంది. మరోవైపు.. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖలో కొంత మంది సబ్-రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీలను బదిలీ చేయనుంది. ఈ శాఖలో 2023 ఆగస్టులో భారీస్థాయిలో బదిలీ జరిగాయి. కొంత మంది సబ్-రిజిస్ట్రార్లు, కింది స్థాయిలో అధికారుల బదిలీలు జరగలేదు. వీరి వల్ల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు చెడ్డ పేరు వస్తోందన్న ఆరోపణలున్నాయి. ఇలాంటివారిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని సమాచారం. వీటితోపాటు.. ఇంటెలిజెన్స్ నివేదికలు, ఉద్యోగ సంఘాల నేతలతో అంతర్గత చర్చలు జరిగిన సమయంలో సేకరించిన వివరాలను తాజా బదిలీల్లో పరిగణనలోకి తీసుకునే అవకాశాలున్నట్లు సచివాలయ వర్గాల చెబుతున్నాయి.
Updated Date - May 26 , 2024 | 05:53 AM