ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG NEWS: తెలంగాణకు కేంద్రం అదిరిపోయే శుభవార్త... నెరవేరిన ఎన్నో ఏళ్ల కల

ABN, Publish Date - Nov 28 , 2024 | 07:07 PM

కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుతో రాష్ట్రానికి పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. దాదాపు రూ.500 కోట్లతో ఏర్పాటు చేసే కోచ్‌ ఫ్యాక్టరీతో దాదాపు 2000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి.

వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విభజన హామీలలో మరో హమీని కేంద్రం ప్రభుత్వం నెరవేర్చింది. ఖాజీపేటలో రైల్వే తయారీ యూనిట్(ఆర్ ఎం యు) ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఖాజీపేటలోని వ్యాగన్ ఫ్యాక్టరీని కేంద్ర రైల్వేశాఖ అప్ గ్రేడ్ చేసింది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంకు రైల్వే బోర్డు లేఖ రాసింది. 55 ఏళ్లుగా ఇక్కడి ప్రజలు, ఉద్యోగులు కోచ్‌ ఫ్యాక్టరీ కోసం ఆందోళనలు చేస్తున్నా తెలిసిందే. 2014లో ఏపీ విభజన చట్టంలో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం ప్రభుత్వం హమీ ఇచ్చింది. 2023లో వ్యాగన్‌ తయారీ పరిశ్రమపై ఓ ప్రకటన చేసింది కానీ అమల్లోకి రాలేదు. మరోవైపు దక్షిణ భారతదేశానికి గేట్‌వేగా ఉన్న కాజీపేట జంక్షన్‌ను డివిజన్‌గా చేయాలని పలువురు ఎన్నో ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఉత్తర, దక్షిణ ధ్రువాలను కలపడంతో పాటు బొగ్గు రవాణాలో కీలకంగా ఉన్న కాజీపేట జంక్షన్‌ను డివిజన్‌గా ఏర్పాటు చేస్తే ఎంతో ప్రయోజనం కలగనుంది.


ఎన్నో ఏళ్ల కల..

కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ.. ఇక్కడి ప్రజల ఎన్నో ఏళ్ల కల. 2014లో రాష్ట్ర విభజన చట్టంలో కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని కేంద్రం హమీ ఇచ్చింది. ఇందు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 150 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అయితే 2017లో దేశంలో ఎక్కడ కూడా కోచ్‌ ఫ్యాక్టరీల అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి విరుద్ధంగా2018 ఏప్రిల్‌లో మహారాష్ట్రలోని లాతూర్‌లో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు రూ.625కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఒత్తిడి పెరగటంతో 2023 జూలై 8న కాజీపేటలో 160 ఎకరాల్లో రైల్వే వ్యాగన్‌ తయారీ పరిశ్రమకు ప్రధాని మోదీ భూమి పూజ చేశారు. 2025లోగా పూర్తయ్యేలా రూ.521కోట్లతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. అయితే కోచ్‌ ఫ్యాక్టరీతో సుమారు 60వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని.. వ్యాగన్‌ పరిశ్రమ ద్వారా 2వేల మందికి కూడా ఉపాధి లభించే అవకాశాలు లేవని స్థానికులు పేర్కొంటున్నారు.


డివిజన్‌కు అన్ని అర్హతలు..

ఏపీ నుంచి విడిపోయాక రైల్వే కనెక్టివిటీ తక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మారింది. దీంతో తెలంగాణలో కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వెళ్లాయి. అయితే ప్రధానంగా దక్షిణ భారతదేశ రైల్వేకు గేట్‌వేగా ఉన్న కాజీపేటను డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చింది. కాజీపేట మీదుగా ఉత్తర, మధ్య భారతదేశానికి రైళ్లు నడుస్తున్నాయి. కాజీపేట, వరంగల్‌ స్టేషన్ల మీదుగా నిత్యం సుమారు 200కు పైగా గూడ్స్‌, ప్యాసింజర్‌ రైళ్లు నడుస్తున్నాయి. వీటితో పాటు భూపాలపల్లి, గోదావరిఖని, మణుగూరు, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో ఉన్న బొగ్గు రవాణా కాజీపేట మీదుగానే జరుగుతోంది. ఎక్కువ ఆదాయం వచ్చే జంక్షన్లలో కాజీపేట ముందంజలో ఉంది.


2019లో పీయూష్‌ గోయెల్‌ ప్రకటన..

తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్లు మాత్రమే ఉన్నాయి. ఆ రెండు కార్యాలయాలు ఒకే చోట ఉండటంతో వాటిని వేరుగా చూడటం లేదు. ఇక సికింద్రాబాద్‌ డివిజన్‌కు అతి సమీపంలో ఉండటంతో కాజీపేటకు డివిజన్‌ ఇవ్వటం కుదరటం లేదని కేంద్రం చెబుతోందని.. అయితే విజయవాడకు కేవలం 30కి.మీ. దూరంలోనే ఉన్న గుంటూరును డివిజన్‌ చేసినప్పుడు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌కు 120కి.మీ. దూరంలో ఉన్న కాజీపేటను డివిజన్‌ చేయటంలో అభ్యంతరం ఎందుకనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. నల్లగొండ జిల్లాలో కొంత భాగం గుంటూరు డివిజన్‌లో, మరికొంత భాగం సికింద్రాబాద్‌లో కొనసాగుతోంది. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు కాజీపేట డివిజన్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ వచ్చింది. వాస్తవానికి 2019లోనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ దీనిపై స్పష్టతనిచ్చారు. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవకాశం లేదని లోక్‌సభ వేదికగా వెల్లడించారు. అయినా... రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఈ అంశాన్ని ప్రధాని, కేంద్ర మంత్రుల దృష్టికి తెస్తూనే ఉన్నారు.రాష్ట్ర విభజన సమయంలోనే తెలంగాణలోని వరంగల్‌ జిల్లా కాజీపేటలో ‘ఇంటెగ్రల్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్)’ని ఏర్పాటు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.


పునర్విభజన చట్టం ప్రకారం..

రాష్ట్ర అపాయింట్‌మెంట్‌ డే నుంచి ఆరు నెలల్లోగా భారతీయ రైల్వే ఫీజిబిలిటీ స్టడీ చేస్తుందంటూ ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం-2014లోని 13వ షెడ్యూలు, ఐటెమ్‌ నెంబర్‌ 10 స్పష్టతనిచ్చింది. రైల్వే కనెక్టివిటీని పెంచడానికి కృషి చేస్తుందని వెల్లడించింది. ఫీజిబిలిటీ స్టడీ కోసం రైల్వే సీనియర్‌ అధికారులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎలాంటి పురోగతి లేదు. అయితే... 2019 నవంబర్‌లోనే పీయూష్‌ గోయెల్‌ దీనిపై స్పష్టతనిచ్చారు. ఎంపీ రంజిత్‌రెడ్డి కోచ్‌ ఫ్యాక్టరీ గురించి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ... కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవకాశం లేదని వెల్లడించారు. అయినా... రాష్ట్రం తరపున అప్పటి సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ కేంద్రానికి విజ్ఞప్తులు పంపారు. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కోరారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కోచ్‌ ఫ్యాక్టరీ కోసం రూ.380 కోట్ల విలువైన 150.5 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించింది. రైల్వే శాఖ 60 ఎకరాలను మాత్రమే అడిగితే... రాష్ట్రం ఏకంగా 150 ఎకరాల స్థలాన్నిచ్చింది. వాస్తవానికి భారతీయ రైల్వేలోని 17 జోన్లలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ నుంచే అత్యధిక ఆదాయం వస్తుంది.


రైల్వే కనెక్టివిటీ ..

తెలంగాణలో రైల్వే కనెక్టివిటీ చాలా తక్కువగా ఉంది. కానీ... జోన్‌ పరిధిలో కోచ్‌ ఫ్యాక్టరీలు, ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాప్‌లు లేవు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు అవసరమైన ప్యాసెంజర్‌ కోచ్‌లను పెరంబుదూరు ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీని నుంచి తెప్పించుకుంటున్నారు. ఈ దృష్ట్యా ఇక్కడ కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటూ 1969 తెలంగాణ ఉద్యమ కాలం నుంచే డిమాండ్‌ ఉంది. అప్పట్లోనే ఉద్యమకారులు కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటూ పోరాడారు. తెలంగాణకు ప్రతిపాదించిన కోచ్‌ ఫ్యాక్టరీని పంజాబ్‌కు తరలించారు. దాంతో మొండి చెయ్యే ఎదురైంది. ఎట్టకేలకు విభజన చట్టంలో మరోసారి కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించారు. ఈసారి కూడా హామీ నెరవేరడం లేదు.


కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ప్రయోజనం

కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుతో రాష్ట్రానికి పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. దాదాపు రూ.500 కోట్లతో ఏర్పాటు చేసే కోచ్‌ ఫ్యాక్టరీతో దాదాపు 2000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. దీనికి బదులుగా కాజీపేటలో ‘పీరియాడికల్‌ ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాప్‌’ను ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. దీని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్న అభిప్రాయాలున్నాయి. కోచ్‌లను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీని పక్కన పెట్టి, గూడ్స్‌ వ్యాగన్ల మెయింటెనెన్స్‌కు సంబంధించిన ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాప్‌ను పెడితే ప్రయోజనమేమిటని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Nov 28 , 2024 | 07:29 PM