TG News: కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ సెటైర్.. హైదరాబాద్ వ్యాప్తంగా గాడిద గుడ్డు ఫ్లెక్సీలు..
ABN, Publish Date - Jul 24 , 2024 | 04:44 PM
కేంద్ర బడ్జెట్-2024లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. "కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది..? గాడిద గుడ్డు" అంటూ వినూత్న రీతిలో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్-2024లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. "కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది..? గాడిద గుడ్డు" అంటూ వినూత్న రీతిలో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8ఎంపీ సీట్లు గెలిచిందని.. అయితే 8సీట్లు ఇచ్చిన రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో దక్కింది మాత్రం గాడిద గుడ్డు అంటూ బ్యానర్లపై పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే తీవ్రస్థాయిలో చర్చ మెుదలైంది. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై బీజేపీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..
ఇప్పటికే ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు సహా రాష్ట్ర ప్రతిపక్షాలు సైతం మోడీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. తెలంగాణ అంటే మీకెందుకంత ద్వేషం అని నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణపై వివక్ష చూపించారని, మాపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తున్నట్లు కనిపిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చినప్పుడు స్వయంగా వెళ్లి స్వాగతం పలికి మరి పెద్దన్న పాత్ర పోషించమని అడిగానని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని చిన్నచూపు చూడడం సరికాదని మండిపడ్డారు. తాను మూడుసార్లు స్వయంగా ఢిల్లీకి వెళ్లి నిధులు ఇవ్వాలని మోడీని అడిగినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తమ నేతలు సైతం 18సార్లు కేంద్ర పెద్దలను కలిశారని అయినా చివరికి అన్యాయమే జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో తెలంగాణ పదాన్నే నిషేధించారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రజలు గర్తు రాలేదా?
కేంద్ర ప్రభుత్వ తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. తెలంగాణపై ఎందుకంత చులకన భావం అంటూ మండిపడుతున్నారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో భాజపాకు ఆదరణ పెరిగిందని అలాంటప్పుడు నిధులు కేటాయించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌తో సమానంగా 8ఎంపీ సీట్లు ఇచ్చినా మీకు సరిపోలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విభజన హామీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కి బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించారని, అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్లు కేటాయించారని చెప్పారు. మరి తెలంగాణ మీకు గుర్తు రాలేదా అంటూ కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పదేపదే తెలంగాణకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలు గుర్తున్నారు కదా, మరి బడ్జెట్ కేటాయింపులు చేసేటప్పుడు ఆ ప్రజలు మీకు గుర్తు రాలేదా? అంటూ మోడీని ప్రశ్నిస్తున్నారు. మీరు చేసిన పనిని తెలంగాణ సమాజం గమనిస్తోందని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు.
Updated Date - Jul 24 , 2024 | 04:45 PM