Harish Rao: రేవంత్ రెడ్డి దైవ ద్రోహానికి పాల్పడ్డారు.. హరీష్‌రావు సంచలన ఆరోపణలు
ABN, Publish Date - Aug 22 , 2024 | 12:51 PM
పోలీస్ యాక్ట్‌తో లాఠీలతో రైతు ధర్నాలు ఆపలేరని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. ప్రజా పాలనలో ధర్నాలు నిషేధం అని రైతులకు పోలీసులు నోటీసులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
యాదాద్రి: పోలీస్ యాక్ట్‌తో లాఠీలతో రైతు ధర్నాలు ఆపలేరని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. ప్రజా పాలనలో ధర్నాలు నిషేధమని రైతులకు పోలీసులు నోటీసులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.హోటల్ హరితలో హారీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై హారీష్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామంలో జర్నలిస్ట్‌పై దాడి చేశారని అన్నారు.
చివరి రైతుకు రుణమాఫీ జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రేవంత్ రెడ్డి చేసిన ప్రమాణం ఏమైందని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తామని యాదగిరిగుట్ట దేవుడిపై ఒట్టు పెట్టారని అన్నారు. రేవంత్ రెడ్డి దైవ ద్రోహానికి పాల్పడ్డారని సంచలన విమర్శలు చేశారు. మాట మీద నిలబడటం తనకు తెలుసునని హరీష్‌రావు తేల్చిచెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇంకా రుణమాఫీ పూర్తిగా కాలేదని చెబుతున్నారని గుర్తుచేశారు. 42 లక్షల్లో 20 లక్షల మంది రైతులకే రుణమాఫీ జరిగిందని మంత్రులే చెబుతున్నారని హరీష్‌రావు అన్నారు.
రేవంత్ రెడ్డి మాట తప్పారని.. ఆయన చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం లక్ష్మీనరసింహ స్వామి దగ్గరికి వచ్చామని తెలిపారు. రుణమాఫీకి డిసెంబర్ 9వ తేదీ నుంచి వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒట్టు పెట్టి ప్రమాణం చేసిన అన్ని దేవాలయాలకు వెళ్తామని స్పష్టం చేశారు. ఆయన చేసిన పాపాలకు కనీసం ఆలయాలను శుభ్రం చేయాలని హరీష్‌రావు వెల్లడించారు.
Updated Date - Aug 22 , 2024 | 12:54 PM