Harish Rao: వరద బాధితులకు తక్షణ సాయం అందజేయాలి
ABN, Publish Date - Sep 21 , 2024 | 09:01 PM
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు తెలంగాణను అతలాకుతలం చేశాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. లనీలు పూర్తిగా వరద నీటితో నిండిపోగా, జనజీవనం స్తంభించిపోయిందని తెలిపారు. ఎంతో మంది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారని చెప్పారు
హైదరాబాద్: వరద బాధితులకు తక్షణ సాయం అందజేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, సాయాన్ని పెంచడంతో పాటు, బాధితులందరికీ తక్షణమే ఆ సాయం అందేలా చూడాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు లేఖ రాశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు తెలంగాణను అతలాకుతలం చేశాయని చెప్పారు. ఖమ్మం, భద్రాచలం, మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్‌తో పాటు పలు జిల్లాల్లో వరద ఉధృతి బీభత్సాన్ని సృష్టించిందని అన్నారు. కాలనీలు పూర్తిగా వరద నీటితో నిండిపోగా, జనజీవనం స్తంభించిపోయిందని తెలిపారు. ఎంతో మంది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారని హరీశ్ రావు చెప్పారు.
అధికారిక లెక్కల ప్రకారమే, 33 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. రూ.5,438 వేల కోట్ల ఆస్తి నష్టం, 4.25 లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని అన్నారు. ఇంకా లెక్కకు రాని మరణాలు ఆస్తి, పంట నష్టం చాలా ఉంటుందని... ఇది అత్యంత బాధాకరమన్నారు. ఇది అందరి మనస్సులను కలిచివేసిన విషాదమని చెప్పారు. వరదలు వచ్చిన ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంకా బురదతో నిండిన ఇళ్లు, ఇసుక మేటలు వేసిన పొలాలు, కొట్టుకుపోయిన రోడ్లు కనిపిస్తున్నాయని అన్నారు. ప్రాణాలు కోల్పోయిన విషాదాలు, బాధితుల విలాపాలే కనిపిస్తున్నాయని చెప్పారు. ఎవరిని పలకరించినా హృదయాన్ని కదిలించే కన్నీటి గాథలే కనిపిస్తున్నాయన్నారు. కడగండ్ల పాలైన తమకు ప్రభుత్వం వైపు నుంచి కనీస ఓదార్పు కూడా కరువైందని, ఆపద సమయంలో తమను ప్రభుత్వం ఆదుకోలేదనే ఆగ్రహం వరద బాధితుల్లో ఉందని హరీష్‌రావు తెలిపారు.
విపత్తు నిర్వహణలో వైఫల్యం
ఇలాంటి విపత్కర పరిస్థితిలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహారించాలని సూచించారు. పాలకులు అండగా ఉన్నారనే ధీమాను ప్రజలకు కల్పించాలని కోరారు. కానీ, ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పడానికి చింతిస్తున్నానని అన్నారు. వాతావరణ శాఖ ముందే హెచ్చరించినప్పటికీ విపత్తును ఎదుర్కొనే సన్నాహక చర్యలు తీసుకోవడంలో, ప్రజలను అప్రమత్తం చేయడంలో వైఫల్యం చెందారని అన్నారు. ముంపు ప్రదేశాలను గుర్తించి ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో వైఫల్యం, వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడంలో వైఫల్యం, బాధితులను గుర్తించడంలో పైఫల్యం, ఓదార్చడంలో వైఫల్యం, సాయం అందించడంలో వైఫల్యం చెందారన్నారు. మొత్తంగా విపత్తు నిర్వహణ, నష్టనివారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. ఇన్ని రోజుల తర్వాత కూడా వరద మిగిల్చిన బురదను తొలగించే ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదంటే ప్రభుత్వ వైఫల్యాన్ని అంచనా వేయొచ్చని అన్నారు.
అధికార పార్టీ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మంలో వరదల్లో చిక్కుకున్న 9 మందిని కాపాడే నాయకుడే కరువయ్యారని ఆరోపించారు. చివరికి ఒక హెలికాప్టర్ కూడా దిక్కు లేని దీన రాష్ట్రంగా తెలంగాణను మార్చారని అన్నారు. వరదలో చిక్కుకున్న వారిని కాపాడటంలో ఒక జేసీబీ డ్రైవర్ చేయగలిగిన పనిని యావత్ ప్రభుత్వ యంత్రాంగం చేయలేకపోయిందంటే ఇంతకు మించిన చేతకాని తనం ఉంటుందా? అని ప్రశ్నించారు. వరద తాకిడికి గురైన ప్రాంతాలను, కాలనీలను సంపూర్ణంగా పర్యటించడానికి మీకు ఓపిక లేక పోయిందని తెలిపారు. విషాద పర్యటనలో సైతం చిరునవ్వులు చిందిస్తూ చేతులూపుతూ ప్రచార పర్యటన చేసిన విధానం చూసి ప్రజలు విస్తుపోయారని తెలియచేయడానికి చింతిస్తున్నానని అన్నారు. వరద బాధితులకు సహాయం చేయడంలో ప్రభుత్వం అన్ని దశల్లో విఫలమైందని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని... ఇది కోతల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని ఈ సందర్భంగా తేలిపోయిందని చెప్పారు. అందుకే బాధితుల్లో ఎవరిని పలకరించినా ఈ ప్రభుత్వంపై ఆక్రోశం, ఆగ్రహమే కనిపిస్తున్నాయని అన్నారు.
తూతూ మంత్రంగా ప్రభుత్వ సాయం
‘‘విపత్తు వేళ మీ నిర్లక్ష్యానికి తోడుగా, నష్టపరిహారం విషయంలో మీ అసమంజస వైఖరి ప్రజలను మరింత ఆగ్రహానికి, ఆవేదనకు గురి చేస్తోంది. ముఖ్యమంత్రి తక్షణ సాయం కింద ముందు రూ. 10 వేల నష్టపరిహారం ఇస్తామన్నారు. ఆ తర్వాత నష్ట స్థాయిని బట్టి తగిన సాయం చేస్తామని చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధిత కుటుంబాలకు ఇచ్చే సాయాన్ని మరో రూ. 6,500 కలిపి మొత్తం రూ.16,500లకు పరిమితం చేశారు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు కొట్టుకుపోయి, చెడిపోయి కట్టుబట్టలతో మిగిలిన వారికి రూ.16,500 సహాయం ఏ మూలకు వస్తాయి. ఇండ్లు కూలిన పేద వారికి రూ.18వేల సహాయం చేస్తే ఎలా సరిపోతాయి? ఒక్క ఖమ్మం జిల్లాలోనే 15,096 మంది వరద బాధితులకు రూ. 16,500 సహాయం అందించేటందుకు గుర్తిస్తే, రూ. 18వేల సహాయం అందించేటందుకు కేవలం 146 మంది మాత్రమే గుర్తించడంలో మీ ఆంతర్యం ఏమిటి? రుణమాఫీలో లబ్ధిదారులను కుదించినట్లుగానే, వరద బాధితుల సంఖ్యను కూడా కుదించేందుకు మీరు ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. చిన్న చిన్న వ్యాపారస్తులు నిల్వ చేసుకున్న సరుకులు కూడా వరద పాలై పోయి పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయి, జీవితమే అగమ్యగోచరమైన స్థితిని ఎదుర్కొంటున్నారు. వారికి మీరిచ్చే కొద్ది పాటి సాయంతో ఉపశమనం కలగదు’’ అని హరీష్‌రావు తెలిపారు.
పంట మునిగిన వారికి అందని సాయం
‘‘పంట మునిగిన వారికి ఒక్క రూపాయి విడుదల చేయలేదు. పంట నష్టం జరిగిన రైతన్నకు ఎకరాకు మీరిచ్చే రూ. 10 వేల సాయం ఏ మూలకు సరిపోతుంది. రేవంత్ రెడ్డి గారూ.. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ నోటితోనే పంట నష్టానికి ఆర్థిక సాయంగా ఎకరాకు 25వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నరు. ఎందుకు నష్టపరిహారాన్ని పది వేలకు కుదించారు. వరద బాధితులకు చేసే సహాయం దగ్గర కూడా మీరు మాట మార్చడమేనా? ఇది మీ మోసపూరిత వైఖరి కాదా? నామమాత్రంగా సహాయం చేసి చేతులు దులుపుకుందామనుకుంటున్న మీ బాధ్యతారాహిత్యాన్ని చూసి వరద బాధితులు లబోదిబోమంటున్నారు’’ అని హరీష్‌రావు పేర్కొ్న్నారు.
అందని ద్రాక్షగా ప్రభుత్వ సాయం
వరద ప్రభావం తగ్గి 20 రోజులు గడిచినా ప్రభుత్వం ఇస్తానని పరిహారం అందక బాధితులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కొన్ని కుటుంబాలకు సాయం అందని ద్రాక్షగానే మిగిలిపోయిందన్నారు. సర్వే సమయంలో ఇళ్ల వద్ద బాధితులు లేకపోవడం, బ్యాంకు ఖాతా పుస్తకాలు సమర్పించకపోవడం, ఇళ్లు మునిగిన ఫొటోలు లేకపోవడం, ఇతర సాంకేతిక అంశాలు కారణాలుగా చూపుతూ పరిహారం జమచేయకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. తమకు పరిహారం అందించాలని అధికారుల చట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అద్దె ఇళ్లలో నివాసం ఉండి, వరద వల్ల నష్టపోయిన వారి వివరాలు నమోదు చేయకపోవడంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. వరద వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ సాయం అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని హరీష్‌రావు పేర్కొన్నారు.
బాధ్యతగా వ్యవహరించండి, సాయం తక్షణం అందించాలి
ఈ విపత్తు వేళనైనా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓటేసి అధికారంలోకి తెచ్చిన ప్రజల పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించాలని కోరారు. బాధితులకు నిజమైన ఉపశమనం కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వీలుగా సరిపోయే సహాయాన్ని చేయాలన్నారు. మీడియా మేనేజ్మెంట్ విడనాడి డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద దృష్టి కేంద్రీకరించాలని కోరారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలకు తగ్గకుండా సహాయం చేయాలని, ఇళ్లు కూలిపోయి ఇంట్లో సామాన్లు నష్టపోయిన వారికి రూ. 2 లక్షల సహాయం అందించాలన్నారు, పూర్తిగా ఇళ్లు కొట్టుకుపోయిన వారికి రూ. 10లక్షల సహాయం చేయాలన్నారు. పంట నష్టం కింద ఎకరాకు గతంలో డిమాండ్ చేసినట్లుగానే 25వేల రూపాయల సహాయం అందించాలని కోరారు. పశువులు నష్టపోయిన వారికి లక్షకు తగ్గకుండా సహాయం చేయాలని అడిగారు. చిన్న వ్యాపారస్తులకు రూ.5లక్షల నష్టపరిహారంతో పాటు వడ్డీ లేకుండా రుణాలు అందించాలి’’ అని హరీష్‌రావు డిమాండ్ చేశారు.
Updated Date - Sep 21 , 2024 | 09:06 PM