HRC: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు..
ABN, Publish Date - Sep 28 , 2024 | 09:23 PM
నగరంలో బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకోవడంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath)పై మానవ హక్కుల కమిషన్(HRC) కేసు నమోదు చేసింది.
హైదరాబాద్: నగరంలో బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకోవడంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath)పై మానవ హక్కుల కమిషన్(HRC) కేసు నమోదు చేసింది. హైడ్రా అధికారులు తన ఇల్లు కూలుస్తారనే భయంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై బాధిత కుటుంబసభ్యులు హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు. హైడ్రా కూల్చివేతల వల్లే తమ తల్లి బలవన్మరణానికి పాల్పడిందని మృతిరాలి కుమార్తెలు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 16063/IN/2024 కింద కేసు నమోదు చేసినట్లు, విచారణ చేపట్టనున్నట్లు మానవ హక్కుల కమిషన్ తెలిపింది.
బుచ్చమ్మ మృతిపై రంగనాథ్ స్పందన..
కాగా, పలు మీడియా కథనాల్లో బుచ్చమ్మ ఆత్మహత్యపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇవాళ(శనివారం) హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైడ్రా ఎవరికీ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. బుచ్చమ్మ దంపతులకు చెందిన ఇళ్లు ఎఫ్‌టీఎల్ పరిధికి దూరంగా ఉన్నాయని రంగనాథ్ తెలిపారు. కూల్చివేతల్లో భాగంగా తమ ఇళ్లనూ అధికారులు కూలుస్తారనే భయంతో కుమార్తెలే ఆమెను ప్రశ్నించారని ఆయన తెలిపారు. దీని వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుందని రంగనాథ్ చెప్పారు. బుచ్చమ్మ బలవన్మరణానికి హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. హైడ్రా గురించి ఎవరూ తప్పుడు ప్రచారం చేయెుద్దని, మీడియా కథనాలు, సామాజిక మాధ్యమాల్లో భయాందోళనలు కలిగించే విధంగా ప్రచారాలు చేయెుద్దని కోరారు. తెలంగాణలో జరుగుతున్న ఇతర కూల్చివేతలను హైడ్రాతో ముడిపెట్టవద్దని కమిషనర్ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు.
ఆత్మహత్య నేపథ్యం..
హైదరాబాద్ కూకట్‌పల్లి యాదవబస్తీలో గుర్రంపల్లి బుచ్చమ్మ, శివయ్య దంపతులు కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. బుచ్చమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పాల వ్యాపారం చేసే ఆ దంపతులు పలు ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేశారు. ఆడపిల్లలకు పెళ్లి చేసిన తర్వాత ఒక్కోక్కరికి ఒక్కో ప్లాట్ ఇచ్చారు. నల్ల చెరువు పరిసరాల్లోని వెంకట్రావునగర్, శేషాద్రినగర్‌లోని ఆ స్థలాల్లో ఇళ్లు కట్టించి అద్దెకు ఇచ్చారు. ఇదిలా ఉండగా నల్ల చెరువులోని ఆక్రమణలకు హైడ్రా అధికారులు ఇటీవల తొలగించారు. చెరువు పరిసరాల్లోని ఇతర నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చేస్తుందని స్థానికంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో తమ ఇళ్లు ఎక్కడ కోల్పోతామోనని బుచ్చమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది. ఇళ్లు కూల్చేస్తే బిడ్డల పరిస్థితేంటి అని భర్త వద్ద పలుమార్లు వాపోయింది. ఈ క్రమంలో శుక్రవారం బలవన్మరణానికి పాల్పడింది.
Updated Date - Sep 28 , 2024 | 09:35 PM