HYDRA: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి హైడ్రా నోటీసులు
ABN, Publish Date - Aug 28 , 2024 | 10:18 AM
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి హైడ్రా షాక్ ఇచ్చింది. మర్రి రాజశేఖర్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైడ్రా నోటీసులు పంపింది. దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలను అక్రమంగా నిర్మించారంటూ హైడ్రా నోటీసులు పంపింది.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(Marri Rajasekhar Reddy)కి హైడ్రా(HYDRA) షాక్ ఇచ్చింది. మర్రి రాజశేఖర్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైడ్రా నోటీసులు పంపింది. దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలను అక్రమంగా నిర్మించారంటూ హైడ్రా నోటీసులు పంపింది. వీటిని చిన్న దామెర చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో కట్టారంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అధికారులు నోటీసులు పంపించారు. దీనిపై 15రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
కాలేజీలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని లేనిపక్షంలో తగిన చర్యలు తప్పవంటూ రాజశేఖర్ రెడ్డిని హైడ్రా హెచ్చరించింది. దామెర చెరువులో నిర్మించిన మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీలను ఇటీవల హైడ్రా బృందం పరిశీలించింది. వాటిని అక్రమంగా నిర్మించారంటూ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అయితే గతంలో చిన్నదామెర చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన కొన్ని భవనాలను మున్సిపల్ అధికారులు ఇప్పటికే కూల్చివేశారు.
ఇటీవల మరో బీఆర్‌ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన విద్యాసంస్థలకు సైతం హైడ్రా నోటీసులు ఇచ్చింది. మేడ్చల్ జిల్లా నాడెం చెరువు బఫర్‌జోన్‌లో రాజేశ్వర్‌రెడ్డికి చెందిన అనురాగ్ విద్యాసంస్థలు, గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్టు అక్రమ నిర్మించారంటూ నీటిపారుదల శాఖ ఫిర్యాదు మేరకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. దీనిపై పోచారం ఐటీసీ పోలీసుస్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్ పంచాయతీ కొర్రెముల రెవెన్యూ పరిధిలోని 813 సర్వే నంబర్‌లో ఈ నిర్మాణాలు ఉన్నాయి.
అయితే నాడెం చెరువుకు 30మీటర్ల బఫర్‌జోన్ వదిలిపెట్టి నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా సదరు విద్యాసంస్థల యాజమాన్యం నిబంధనల్ని ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే పల్లా మాత్రం అక్రమంగా కేసులు పెట్టారని, న్యాయపరంగా ముందుకు వెళ్తానని హైకోర్టును ఆక్రయించారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు నిబంధనల ప్రకారం హైడ్రా ముందుకు వెళ్లాలని సూచించింది.
Updated Date - Aug 28 , 2024 | 10:34 AM