KISHAN REDDY: ఫోన్ ట్యాపింగ్‌లో సెలబ్రేటీలను టార్గెట్ చేశారు.. కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Oct 03 , 2024 | 11:12 AM
నాగ చైతన్య-సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మర్యాదపూర్వకంగా మాట్లాడని నేతలను మీడియా సంస్థలు బహిష్కరించాలని అన్నారు. కుటుంబ వ్యవహారాలు , వ్యకిగత విషయాలు రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని కిషన్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్: నాగ చైతన్య-సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. సమంత- అక్కినేని కుటుంబాలు మంత్రి తీరును తప్పు పట్టారు. దాంతో కొండా సురేఖ వెనక్కి తగ్గి.. తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. అయితే ఈ విషయంపై రాజకీయ, సినీ ప్రముఖులు కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. మర్యాదపూర్వకంగా మాట్లాడని నేతలను మీడియా సంస్థలు బహిష్కరించాలని అన్నారు. కుటుంబ వ్యవహారాలు , వ్యకిగత విషయాలు రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని కిషన్ రెడ్డి అన్నారు.
ఇవాళ(గురువారం) హైదరాబాద్‌లోని కేంద్ర బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.... ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరమని.. ఒకరి సంభాషణను వినడం తప్పని అన్నారు. భార్య భర్తలు , వ్యాపార వేత్తలు , సెలబ్రేటీలను టార్గెట్ చేశారని ఆరోపించారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ మొదలు పెట్టారని.. సీఎం రేవంత్ ఇప్పుడు కొనసాగిస్తున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కొడుకుకు అయితే అడ్డూ అదుపు లేదని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాషా చాలా ఇబ్బందిగా ఉందని కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
కూల్చివేతల వల్ల పేరు వస్తుంది అంటే కరెక్ట్ కాదని అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో వేలాదిమంది పేదలు రోడ్డున పడే అవకాశం ఉందని హెచ్చరించారు. గతంలో బీఆర్ఎస్ అవలంభించిన విధానాలే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తోందని విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో వర్షపు నీరు ఎటు వెళ్తుందో చెప్పాలని అన్నారు. డ్రైనేజి సిస్టం అంతా మూసీకి అనుసంధానం చేశారని కిషన్‌రెడ్డి అన్నారు.
మూసీకి డైవర్ట్ చేసిన డ్రైనేజి వ్యవస్థ మీద ప్రత్యామ్నాయం చూపాలని అన్నారు. నిర్మాణాల కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డికి అంత తొందర ఎందుకో అర్థం కావడం లేదని కిషన్‌రెడ్డి చెప్పారు. ఇప్పుడు హైడ్రా కూలుస్తున్న ఇళ్లన్నీ ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మించినవేనని అన్నారు. కాంగ్రెస్ , బీఆర్ఎస్ దోపిడీ పార్టీలు , దొంగల పార్టీలు అని విమర్శించారు. అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోపిడీలకు తెర లేపాయని ఆరోపించారు. హైడ్రా అంటే రేవంత్ రెడ్డి అని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆలోచనకు హైడ్రా ప్రతి రూపమని అన్నారు. బడా బాబుల ఫామ్ హౌస్‌లు కూల్చాలని కిషన్‌రెడ్డి అన్నారు.
ఫాతిమా కాలేజీని కూల్చకుండా ఎందుకు సమయం ఇచ్చారని ప్రశ్నించారు. ఎంఐఎం నాయకులకు సంబంధించిన వాటిని ఎందుకు కూల్చడం లేదని కిషన్‌రెడ్డి నిలదీశారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చిందన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో హిమాచల్ ప్రదేశ్ కొట్టు మిట్టాడుతోందని ఆరోపించారు. కర్ణాటకలో కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటుందన్నారు. ఆ రాష్ట్రాల తర్వాత తెలంగాణ కోలుకోలేని ఆర్థిక ఇబ్బందిని చూడబోతుందని హెచ్చరించారు. హైడ్రా కోసం విధి విధానాలు రూపొందించే సమయంలో ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సలహా ఇచ్చారు. ఇళ్లను కూల్చి వేసే సమయంలో పసి పిల్లల అర్తనాథలు రేవంత్ రెడ్డికి వినిపించడం లేదా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
Updated Date - Oct 03 , 2024 | 12:02 PM