KTR: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన కేటీఆర్..
ABN, Publish Date - Nov 22 , 2024 | 03:53 PM
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా మాట్లాడున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
హైదరాబాద్: పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా మాట్లాడున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలంతా రెండు నాలుకల ధోరణితో ఉన్నారని కేటీఆర్ మండిపడ్డారు. అదానీతో తెలంగాణ సర్కార్ చేసుకున్న ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. "అదానీ అవినీతిపరుడైతే సీఎం రేవంత్ రెడ్డి నీతిపరుడు ఎలా అవుతాడో రాహుల్ గాంధీ చెప్పాలి. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే అదానీతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయించాలి. కెన్యా లాంటి చిన్న దేశాలే రద్దు చేసుకున్నప్పుడు రేవంత్ ఎందుకు రద్దు చేసుకోరు?. అదానీతో ఒప్పందాలపై పునరాలోచన చేయాలని ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి సైతం అన్నారు. ఈ అంశంలో షర్మిల సూచనలను ముఖ్యమంత్రి తీసుకోవాలి. మహరాష్ట్ర వెళ్లి అదానీని గజదొంగ అన్న రేవంత్.. తెలంగాణలో మాత్రం గజమాల వేస్తున్నారు. అదానీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలపై తెలంగాణ బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలి?. అదానీ వ్యవహారంతో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని మరోసారి రుజువైంది.
అదానీతో దేశానికి నష్టమైతే తెలంగాణకు నష్టం కాదా?. దీనిపై రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి. స్కిల్ యూనివర్శిటీకి రూ.100 కోట్లు తీసుకోవడం తప్పా?.. కాదా?. కోహినూరు హోటల్లో మంత్రి పొంగులేటి, అదానీ రహస్య సమావేశమైన మాట వాస్తవం. ఆయనతో రేవంత్ సర్కార్ రద్దు ఒప్పందాలు చేసుకోవటం లేదు?. అదానీ వేల కోట్ల రూపాయల ఒప్పందాలపై రోజూ విమర్శించే రాహుల్ దీనికి సమాధానం చెప్పాలి. రాహుల్‌కి తెలిసే రేవంత్ రెడ్డి విరాళం తీసుకున్నారా?. జాతీయ పార్టీకి ఢిల్లీలో ఒక నీతి ఉంటే గల్లీలో మరొక నీతి ఉంది. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్ పార్టీనా?.
కేసీఆర్ హయాంలో ఎంత ప్రయత్నం చేసినా తెలంగాణలో అదానీకి అవకాశం ఇవ్వలేదు. ఆయనతో మేము ఫొటోలు దిగిన మాట వాస్తవం. అంతే మర్యాదగా బయటకు పంపించాం. రేవంత్ మాత్రం అదానీకి ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలికారు. అదానీతో చేసుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకోవాలి. బడే బాయ్ మోదీ ఆదేశాలను చోటా బాయ్ రేవంత్ అమలు చేశారు. తెలంగాణలో అదానీ వ్యాపార సామ్రాజ్య ఏర్పాటుకు ముఖ్యమంత్రి సహకారం అందిస్తున్నారు. అదానీ వ్యవహారంతో భారతదేశ ప్రతిష్ఠ మసకబారింది. ఈ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి. రామన్నపేటలో అదానీ సిమెంట్ పరిశ్రమ వద్దని ఆందోళన చేసినా రేవంత్ పట్టించుకోలేదు" అంటూ ధ్వజమెత్తారు.
ఈ వార్తలు కూడా చదవండి:
హైడ్రా చేతికి సరికొత్త అధికారాలు
నిజ్జర్ హత్య కుట్రలో మోదీ ప్రమేయంపై కెనడా యూటర్న్
లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు.. ఊపిరి పీల్చుకుంటున్న మదుపరులు..
For More Telangana News and Telugu News..
Updated Date - Nov 22 , 2024 | 05:42 PM