TG Politics: బీజేపీ, కాంగ్రెస్ పొలిటికల్ గేమ్.. మధ్యలో ఇరుక్కున్న బీఆర్‌ఎస్..!
ABN, Publish Date - Aug 17 , 2024 | 11:25 AM
తెలంగాణ రాజకీయం ఆసక్తిరేపుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘోర పరాజయం తర్వాత.. సీనియర్ నేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడం, కొందరు ఎమ్మెల్యేలు సైతం హస్తం గూటికి చేరడంతో తెలంగాణలో బీఆర్‌ఎస్ పని అయిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ రాజకీయం ఆసక్తిరేపుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘోర పరాజయం తర్వాత.. సీనియర్ నేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడం, కొందరు ఎమ్మెల్యేలు సైతం హస్తం గూటికి చేరడంతో తెలంగాణలో బీఆర్‌ఎస్ పని అయిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడానికి, శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ మాత్రం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడానికి సంప్రదింపులు జరుపుతున్నాయి. ఇప్పటికే 9మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. మొత్తం 26మందిని చేర్చుకుంటే బీఆర్‌ఎస్ శాసనసభ పక్షం కాంగ్రెస్‌లో విలీనమైనట్లవుతుంది. దీంతో మరో 17మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం సిద్ధం చేశారు. ఇదే సమయంలో బీజేపీలో చేరేందుకు కొందరు ఎమ్మెల్యేలు ఆసక్తి చూపిస్తున్నా.. రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేయాలని షరతులు పెట్టడంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారట. ఎమ్మెల్యే చేరికల అంశం ఓవైపు కొనసాగుతుండగానే బీఆర్‌ఎస్ బీజేపీలో విలీనం అవుతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి పక్కా సమాచారంతోనే ఈ వ్యాఖ్యలు చేశారా.. లేదంటే వ్యూహంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారా అనేది తెలియాల్సి ఉంది. ఓవైపు బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం అవుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ విలీనం అవుతుందంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మరో బాంబు పేల్చారు. బండి సంజయ్ రేవంత్‌రెడ్డికి కౌంటర్ ఇచ్చేందుకే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. రేవంత్, సంజయ్ పోటాపోటీగా స్టేట్‌మెంట్లపై బీఆర్‌ఎస్ నేతలు నోరు మెదపడం లేదు. తాము ఏ పార్టీలో విలీనం కాబోమని.. ఒంటరిగానే బీఆర్‌ఎస్ ముందుకెళ్తోందని కేటీఆర్ ఇటీవల ప్రకటించారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.
పెట్టుబడుల సాధనకు.. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్!
రేవంత్ వ్యాఖ్యల వెనుక..
బీఆర్‌ఎస్ బీజేపీలో విలీనమవుతుందంటూనే.. కేసీఆర్‌కు గవర్నర్ అవుతారని, హరీష్‌రావును అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా ఎన్నుకుని.. కేటీఆర్‌కు కేంద్రమంత్రి పదవి ఇస్తారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కవితకు బెయిల్ రావడంతో పాటు ఆమెను రాజ్యసభకు పంపిస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు. నిజంగా బీఆర్‌ఎస్ బీజేపీలో విలీనమవుతుందా అనే విషయంలోనే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం బీఆర్‌ఎస్ తెలంగాణలో కొంత బలహీనపడుతోంది. వాస్తవానికి బీఆర్‌ఎస్ బలహీనపడితే ఆ స్థానంలో తాము బలపడొచ్చని బీజేపీ లెక్కలు కడుతోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ బీజేపీలో విలీనం ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారం ద్వారా బీజేపీ అంటే ఇష్టంలేని బీఆర్‌ఎస్ నేతలను తమ గూటికి తెచ్చుకోవడం కోసమే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారా లేదా నిజంగానే విలీనానికి సంబంధించి బీజేపీ, బీఆర్‌ఎస్ పెద్దల మధ్య చర్చలు జరిగాయా అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడంలేదు.
పోలవరానికి.. త్వరగా నిధులివ్వండి
కౌంటర్ కోసమేనా..
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. త్వరలోనే కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ విలీనం అవుతుందని, కేసీఆర్‌కు ఏఐసీసీ పదవి, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్, హరీష్‌కు మంత్రి పదవి, కవితకు ఎంపీ పదవి ఇస్తారన్నారు. బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకునే ఖర్మ తమకు లేదన్నారు. కేవలం రేవంత్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చేందుకు మాత్రమే బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే చర్చ జరుగుతోంది. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ.. బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో గులాబీ బాస్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తి రేపుతోంది.
మధుసూదన రెడ్డిపై సస్పెన్షన్ వేటు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Telangana News and Latest Telugu News
Updated Date - Aug 17 , 2024 | 11:25 AM