Share News

Minister Ponguleti: తెలంగాణ నూతన ఆర్‌ఓ‌ఆర్ చట్టం దేశానికే రోల్ మోడల్: మంత్రి పొంగులేటి..

ABN , Publish Date - Nov 13 , 2024 | 03:42 PM

హైదరాబాద్ గాంధీ భవన్‌లో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున కార్యక్రమానికి హాజరై మంత్రి పొంగులేటికి పలు సమస్యలపై దరఖాస్తులు, ఫిర్యాదులు అందజేశారు.

Minister Ponguleti: తెలంగాణ నూతన ఆర్‌ఓ‌ఆర్ చట్టం దేశానికే రోల్ మోడల్: మంత్రి పొంగులేటి..
Minister Ponguleti Srinivasa Reddy

హైదరాబాద్: వికారాబాద్‌ కలెక్టర్, అధికారులపై దాడి ఘటన వెనుక ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి త్వరలోనే మీడియా ముందుకు తీసుకువస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంతమంది కుట్రలు చేస్తున్నారని, అలాంటి వారి ఆగడాలు ఏమాత్రం సాగవని మంత్రి హెచ్చరించారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పొంగులేటి పాల్గొన్నారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున కార్యక్రమానికి హాజరై మంత్రి పొంగులేటికి పలు సమస్యలపై దరఖాస్తులు, ఫిర్యాదులు అందజేశారు.


జైల్లో పెట్టి ధర్నాలు చేస్తారా?

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. " కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటా నిలబెట్టుకుంది. ప్రతిపక్షాలు ధర్నాలు, నిరసనలు చేయాల్సిన అవసరం లేదు. అధికారంలో ఉన్నప్పుడు అన్నదాతలను జైళ్లలో పెట్టినవారు ఇప్పుడు పచ్చ కండువా వేసుకుని వారి వద్దకే వెళ్లి మద్దతు ఇస్తున్నామని చెబుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతన్నలను జైళ్లలో పెట్టి ఇప్పుడు ధర్నాలు, నిరాహార దీక్షలు, పోరాటాలు అంటూ వారిని మోసం చేస్తు్న్నారు. ధరణి చట్టంతో అనేక ఇబ్బందులు పడ్డామని రైతులు, భూ యజమానులు చెప్పిన విషయం గుర్తు లేదా?. ఇందిరమ్మ ఇళ్లు అంటే ఇందిరమ్మ రాజ్యం. అర్హులైన ప్రతి పేదవాడికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించాం. ఇవాళ అత్యధికంగా వాటికి సంబంధించిన అర్జీలే వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్ రూమ్‌ల ఆశ పెట్టి గత పదేళ్లపాటు ఎన్నికల్లో గెలిచింది. కానీ వాటిని ఇంతవరకూ కట్టించలేదు.


వారికే రూ.5లక్షలు ఇస్తాం..

తెలంగాణ పేద ప్రజలకు 24 లక్షల ఇళ్లు కట్టిస్తామని మేము చెప్పాం. గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది. లబ్ధిదారులు నాలుగు వందల చదరపు అడుగుల ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది. మొదటి విడతలో స్థలం ఉన్నవారికి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఇస్తుంది. విడతల వారీగా రూ.5 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇస్తాం. ఇంటిని మహిళా యజమాని పేరిట ఇవ్వాలనేది కాంగ్రెస్ లక్ష్యం. అసెంబ్లీ సాక్షిగా దేశానికే రోల్ మోడల్‌గా ఉండే కొత్త ఆర్‌ఓ‌ఆర్ చట్టం తీసుకువస్తాం. ధరణినీ విదేశీ సంస్థలకు బీఆర్ఎస్ తాకట్టు పెట్టింది. దానిని నెల కిందటే విడిపించాం. త్వరలో ఉద్యోగాల నియామకాలకు ఇచ్చిన మాట ప్రకారం భర్తీ చేస్తాం.


రుణమాఫీ పక్కా..

రైతు రుణమాఫీ కింద రూ.2 లక్షల చొప్పున ఇంకా కొంత మంది రైతులకు అందించాల్సి ఉంది. ఇందిరమ్మ రాజ్యంలో తొండి ఆట ఆడం. మిగిలిన అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవం. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుగు సాగుతున్నాం. రాష్ట్రంలో పండిన చివరి ధాన్యం గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. లగుచర్ల ఇష్యూలో కాస్త ఓపిక పడితే ఒక్కొక్కటిగా అన్ని విషయాలూ బయటకు వస్తాయి. దాడి వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ చట్టప్రకారం శిక్షిస్తాం. ప్రతిపక్షం మాదిరిగా తొందర పడాల్సిన అవసరం లేదు" అని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి:

‘లగచర్ల' దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం

హనుమకొండ ఆస్పత్రిలో ఎలుకల స్వైరవిహారం

ఫిలింనగర్‌లో యువతి ఆత్మహత్య

Read Latest Telangana News and National News

Updated Date - Nov 13 , 2024 | 03:48 PM