Hyderabad: ఆయిల్ పామ్ పంటపై అధికారులు దృష్టి సారించండి: మంత్రి తుమ్మల..
ABN, Publish Date - Dec 10 , 2024 | 04:28 PM
ఈ ఏడాది రైతులకు మరింత లబ్ధి చేకూర్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అన్నదాతలకు యంత్రపరికరాలు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించాలని స్పష్టం చేశారు. రైతన్నలకు చేయూత నిచ్చి పంటల దిగుబడి పెంచే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు.
హైదరాబాద్: మార్చి 2025 నాటి కల్లా లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు చేయడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్ పథకాల అమలను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఉద్యాన, వ్యవసాయ, మార్కెటింగ్ పథకాల అమలు, అధికారుల పనితీరుపై సచివాలయంలో రాష్ట్రస్థాయి అధికారులతో మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా, పథకాల పురోగతిపై తుమ్మలకు అధికారులు పలు నివేదికలు సమర్పించారు. వాటిని పరిశీలించిన మంత్రి.. ఈ ఏడాది రైతులకు మరింత లబ్ధి చేకూర్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్నదాతలకు యంత్రపరికరాలు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించి వారి వృద్ధికి సహకరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతన్నలకు చేయూత నిచ్చి పంటల దిగుబడి పెంచే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రాథమిక సహకార సంఘాల బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.
వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతి రూపాయినీ పూర్తిస్థాయిలో వినియోగించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను పునరావృతం కానివ్వొద్దని స్పష్టం చేశారు. అన్నదాతలకు రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచిందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజాపాలనలో అన్నదాతలు సుభిక్షంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ మేరకు రైతన్నలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఉద్యాన, వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులకు మంత్రి తుమ్మల చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: మౌనికతో మనోజ్ పెళ్లి అంటే పెద్దయ్యకు ఇష్టం లేదు: పని మనిషి
KTR :ఆ దాడిని ఖండిస్తున్నా.. పోలీసులకు కేటీఆర్ వార్నింగ్
Updated Date - Dec 10 , 2024 | 04:32 PM