Minister Uttam: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృ వియోగం..
ABN, Publish Date - Sep 29 , 2024 | 04:47 PM
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందారు. దీంతో పురుషోత్తం రెడ్డి భౌతికకాయాన్ని సందర్శనార్థం ఆస్పత్రి నుంచి ఉత్తమ్ ఇంటికి తరలించారు.
హైదరాబాద్: తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. మంత్రి ఉత్తమ్‌కు పితృ వియోగం కలిగింది. అనారోగ్య సమస్యలు, వయో భారం కారణంగా ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి ఇవాళ(ఆదివారం) ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో మంత్రి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.
అనారోగ్యంతో మృతి..
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇవాళ ఉదయం పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో పురుషోత్తం రెడ్డి భౌతికకాయాన్ని సందర్శనార్థం ఆస్పత్రి నుంచి ఉత్తమ్ ఇంటికి తరలించారు. దీంతో పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
సీఎం దిగ్భ్రాంతి..
అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృ వియోగం కలగడంపై పలువురు నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం సహా పలువురు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సంతాపం తెలియజేశారు. ఇప్పటికే ఆయన ఇంటి వద్దకు పెద్దఎత్తున కాంగ్రెస్ శ్రేణులు చేరుకుంటున్నారు.
బీఆర్ఎస్ నేతల పరామర్శ..
పురుషోత్తం రెడ్డి మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే ఉత్తమ్ నివాసం వద్దకు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్ గౌడ్, డాక్టర్ సంజయ్ చేరుకున్నారు. పురుషోత్తం రెడ్డి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
స్వగ్రామంలో విషాదం..
మరోవైపు మంత్రి ఉత్తమ్ తండ్రి మృతితో వారి స్వస్థలం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పురుషోత్తం రెడ్డి మరణ వార్త విన్న గ్రామస్థులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు పలువురు గ్రామస్థులు పెద్దఎత్తున హైదరాబాద్‌కు తరలివస్తున్నారు. దీంతో ఇవాళ సాయంత్రం వరకూ సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచనున్నారు.
ఈ వార్తలు కూడా చడవండి:
Minister Ponnam: ఆ విషయంలో సోషల్ మీడియా పుకార్లు నమ్మెుద్దు: మంత్రి పొన్నం..
MLA RajaSingh: హత్యకు రెక్కీ.. స్పందించిన రాజా సింగ్
Ponnam: ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీ
Updated Date - Sep 29 , 2024 | 04:48 PM