Ponguleti: లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ నేతలకు మంత్రి పొంగులేటి మాస్ వార్నింగ్
ABN, Publish Date - Nov 14 , 2024 | 09:02 PM
లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. రైతుల సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. కలెక్టర్‌పై దాడి చేయడం హేయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: ప్రభుత్వాన్ని అస్ధిరత పరిచే కుట్ర జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ దుష్ట పాలనలో వేములఘాట్‌లో రైతు ఆత్మార్పణ చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ(గురువారం) గాంధీభవన్‌లో మంత్రి పొంగులేటి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ... రైతులకు సంకెళ్లు... దళితులను ట్రాక్టర్‌తో తొక్కించిన ఘటనలు మరిచారా? అని ప్రశ్నించారు. లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు. రైతుల సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. కలెక్టర్‌పై దాడి చేయడం హేయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
కలెక్టర్‌ను చంపాలనే కుట్ర బీఆర్ఎస్ చేసింది:జగ్గారెడ్డి
హైదరాబాద్: వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను చంపాలనే కుట్ర బీఆర్ఎస్ నేతలు చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. కలెక్టర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి కలెక్టర్‌ను కాపాడారని అన్నారు. గురువారం గాంధీభన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పథకం ప్రకారమే కలెక్టర్‌పై దాడి జరిగిందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజలపై బీఆర్ఎస్ దాడులు చేసిందని ధ్వజమెత్తారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ కార్యకర్తలతో అధికారులపై దాడులు చేస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు.
పదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ నేతలు ఖూనీ చేశారు:సామ రామ్మోహన్ రెడ్డి
హైదరాబాద్: పదేళ్లలో బీఆర్ఎస్ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మీడియా , కమ్యునికేషన్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. గురువారం గాంధీభన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నాకు దక్కనిది ఎవరికి దక్కకూడదు అనే సైకో లాగా బీఆర్ఎస్ నేతలు ప్రవర్తిస్తున్నారు. మాకే అధికారం ఉండాలి, అందరూ మాకు కట్టు బానిసలుగా ఉండాలని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు. మాకు అధికారం లేకపోతే అల్లకల్లోలం సృష్టించాలని గులాబీ నేతలు ఆలోచిస్తున్నారు’ అని సామ రామ్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.
ఆఫీసర్లపైనా అయినా దాడులు చేసి పబ్బం గడుపుకోవాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారని చెప్పారు. అతి తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ రివ్యూలు సీఎం రేవంత్ రెడ్డి చేశారని అన్నారు. మా రెక్కల్లో ఉన్న బలానికి మించి పని చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారని ఆరోపించారు. అభివృద్ధిని బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తుంటే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. ఆర్మీని పెట్టయినా భూసేకరణ చేస్తామని కేటీఆర్ గతంలో అనలేదా అని ప్రశ్నించారు. అమాయకపు రైతులను బీఆర్ఎస్ నేతలు కేసుల్లో ఇరికించారని సామ రామ్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నేతలకు మందుల సామేల్ స్ట్రాంగ్ కౌంటర్
సూర్యాపేట : లగచర్ల ఘటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లగచర్లలో అమాయక గిరిజనులను రెచ్చగొట్టి దాడులు చేయించిన కేటీఆర్ ఇప్పుడు ఏమి తెలవనట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని మీరు , మీ బావ , చెల్లి ఎన్ని ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. చిన్న పిల్లాడైన కేటీఆర్ కొడుకుపై 30 ఎకరాల భూములెక్కడివని నిలదీశారు. దోచుకుని దాచుకున్న కేసీఆర్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హతలేదని అన్నారు. ముసుగు దొంగలను తయారు చేసి కలెక్టర్‌పై దాడులు చేయించడం దుర్మార్గమని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
Hyderabad: ఫోన్ ట్యాపింగ్ కేసు.. చిరుమర్తి లింగయ్య కీలక విషయాలు వెల్లడి..
BJP: మిడి మిడి జ్ఞానంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు: కిషన్ రెడ్డి
Read Latest Telangana News and TELUGU NEWS
Updated Date - Nov 14 , 2024 | 09:08 PM