Hyderabad: గబ్బు రేపుతున్న హైదరాబాద్ పబ్బులు..
ABN, Publish Date - Oct 19 , 2024 | 10:05 AM
హైదరాబాద్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు పబ్బుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి మెరుపుదాడులు నిర్వహించారు. పలు పబ్బులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేశారు.
హైదరాబాద్: నగరంలోని పబ్బులు గబ్బు రేపుతున్నాయి. డబ్బు సంపాదనే లక్ష్యంగా చెలరేగిపోతున్నాయి. ఒకవైపు వరసగా డ్రగ్స్‌తో పట్టుపడుతుండగా మరోవైపు యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ అడ్డంగా బుక్కవుతున్నారు. వినోదం ముసుగులో మత్తు పదార్థాలు సరఫరా చేస్తూ యువతను పెడదారి పట్టిస్తున్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా విచక్షణ మరుస్తున్నారు. నగర పోలీసులు డ్రగ్స్, రేవ్ పార్టీలు వంటి వాటిపై సీరియస్ దృష్టి సారించి ఇప్పటికే విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, బడా పారిశ్రామిక వేత్తలను పలు పబ్బుల్లో అరెస్టు చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కొంతమంది పబ్బుల నిర్వహకుల తీరు మాత్రం మారడం లేదు. డబ్బు సంపాదించేందుకు దేనికైనా సిద్ధం అవుతున్నారు. ఇలాంటి వారి ఆగడాలు అరికట్టేందుకు నగర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు పబ్బుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి మెరుపుదాడులు నిర్వహించారు. పలు పబ్బులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేశారు. టేల్స్ ఓవర్ స్పిరిట్ పబ్‌లో ఏకంగా 140మందిని అదుపులోకి తీసుకున్నారు. పబ్బు నిర్వాహకులు ఇతర రాష్ట్రాలకు చెందిన 40యువతులను తీసుకువచ్చి యువకులను ఆకర్షించేందుకు అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. ఒకసారి తమ వద్దకు వచ్చిన వారిని పదేపదే రప్పించేందుకు ఇలాంటి పనులకు పాల్పడినట్లు తెలుస్తోంది. పక్కా సమాచారం మేరకు దాడులు చేసి యువతీయువకులు, నిర్వాహకులు సహా మెుత్తం 140మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అందరికీ నోటీసులు జారీ చేశారు. యువతులను పునరావాస కేంద్రాలకు తరలించారు. పబ్బు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. మరోవైపు టేల్స్ ఓవర్ స్పిరిట్ పబ్‌లో డ్రగ్స్ వినియోగించారా లేదా అనే దిశగానూ విచారణ సాగుతోంది.
మరోవైపు కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పబ్ యాజమాన్యాలు ఉద్యోగాల పేరుతో యువతులను ట్రాప్ చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. వీక్ ఎండ్‌లో నాలుగు గంటలు పని చేస్తే రెండు వేలు ఇస్తామని నిర్వాహకులు ఆఫర్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పబ్‌కి వచ్చే కస్టమర్లతో చనువుగా ఉంటూ.. వారు ఎక్కువ మద్యం సేవించేలా చూడాలని యువతులకు చెప్తున్నట్లు తెలిపారు. మద్యం సేవిస్తున్నట్లు నటించి తాము ఇచ్చే సాప్ట్ డ్రింక్ తాగుతూ యువకులను మత్తులో ముంచాలని యువతులకు పబ్ యాజమానులు సూచిస్తున్నట్లు చెప్పారు. కస్టమర్‌తో ఎక్కువ బిల్ చేపించిన యువతికి కమీషన్ కూడా ఇస్తున్నారని పోలీసులు తెలిపారు. అసభ్య, అశ్లీల నృత్యాలు చేసే యువతులకు ఎక్కువ మెుత్తంలో డబ్బు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారని విచారణలో దిమ్మతిరిగే విషయాలను పోలీసులు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: ‘నిమ్స్’లో గుండె కవాటాల బ్యాంక్..
Road Accident: అతివేగంగా దూసుకొచ్చిన కారు.. ఇంతలోనే
Updated Date - Oct 19 , 2024 | 10:38 AM