Share News

Hyderabad: బాబోయ్ శివ బాలకృష్ణ ఆస్తుల లెక్క ఇదీ.. ఏసీబీ సంచలన ప్రకటన..

ABN , Publish Date - Feb 07 , 2024 | 06:44 PM

HMDA Former Director Shiva Balakrishna: అవినీతి సొర చేప, తిమింగలం.. ఈ పదాలేవీ హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు సరిపోవంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. అతగాడి అక్రమాస్తుల చిట్టా చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. అక్రమాస్తుల కేసులో శివ బాలకృష్ణను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు తాజాగా అతన్ని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

Hyderabad: బాబోయ్ శివ బాలకృష్ణ ఆస్తుల లెక్క ఇదీ.. ఏసీబీ సంచలన ప్రకటన..
HMDA Former Director Shiva Balakrishna

హైదరాబాద్, ఫిబ్రవరి 07: అవినీతి సొర చేప, తిమింగలం.. ఈ పదాలేవీ హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు సరిపోవంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. అతగాడి అక్రమాస్తుల చిట్టా చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. అక్రమాస్తుల కేసులో శివ బాలకృష్ణను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు తాజాగా అతన్ని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కేసుకు సంబంధించిన వివరాలను కోర్టులో సబ్మిట్ చేయగా.. శివ బాలకృష్ణకు 14 రోజుల రిమాండ్ పొడగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దాంతో శివ బాలకృష్ణను చంచల్ గూడ జైలుకు తరలించారు ఏసీబీ అధికారులు. అంతకు ముందు శివ బాలకృష్ణను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు.

ఇదిలాఉంటే.. హెచ్ఎండీయే మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆస్తుల వివరాలపై ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు మొత్తం రూ. 250 కోట్ల అక్రమాస్తులు గుర్తించామన్నారు. అలాగే ఆయనకు సంబంధించి 214 ఎకరాల భూమిని, 29 ప్లాట్లను గుర్తించినట్లు వెల్లడించారు అధికారులు. శివ బాలకృష్ణకు తెలంగాణతో పాటు వైజాగ్ లోనూ ప్లాట్స్ ఉన్నాయని తెలిపారు. 19 ఓపెన్ ప్లాట్లు, 7 అపార్ట్మెంట్ ప్లాట్స్, 3 విల్లాలు ఉన్నాయని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర తెలిపారు.

మరికొందరు అరెస్టయ్యే అవకాశం..

ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని సుధీంద్ర తెలిపారు. అధికారుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు. హెచ్ఎండీయేలో కీలక ఫైల్స్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. లాకర్స్ లోను భారీగా బంగారం, పత్రాలు గుర్తించామని చెప్పారు. రియల్ ఎస్టేట్ కంపెనీలలో పెట్టుబడులపై వెరిఫై చేస్తున్నామని సుధీంద్ర తెలిపారు.

Updated Date - Feb 07 , 2024 | 06:45 PM