Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌కు నేను సిద్ధం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ABN, Publish Date - Oct 19 , 2024 | 01:49 PM
మూసీ ప్రక్షాళన వ్యతిరేకించే బీఆర్ఎస్, బీజేపీ నేతలు మూడు నెలలపాటు ఆ ప్రాంతంలో నివాసం ఉంటే సుందరీకరణ అంశాన్ని పక్కనపెడతానని రేవంత్ రెడ్డి సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాను రేవంత్ రెడ్డి సవాలును స్వీకరిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: మూసీ సుందరీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విరిసిన సవాల్‌కు తాను సిద్ధమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. మూసీ ప్రక్షాళన వ్యతిరేకించే బీఆర్ఎస్, బీజేపీ నేతలు మూడు నెలలపాటు ఆ ప్రాంతంలో నివాసం ఉంటే సుందరీకరణ అంశాన్ని పక్కనపెడతానని రేవంత్ రెడ్డి సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాను రేవంత్ రెడ్డి సవాలును స్వీకరిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మూడు నెలలపాటు తాను నివాసం ఉంటానని, మరి ఇందుకు సీఎం సిద్ధమేనా అని ప్రశ్నించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. " మూసీ ప్రాంతంలో నివాసం ఉండటానికి నేను సిద్ధం. ముఖ్యమంత్రి సిద్ధమేనా?. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు నేను మూడు నెలలపాటు మూసీ ప్రాంతంలో నివాసం ఉంటాను. నది శుద్దికి బీజేపీ వ్యతిరేకం కాదు. పేదల ఇళ్లు కొడితే బీజేపీ ఊరుకోదు. బీఆర్ఎస్ నేత కేటీఆర్‌తో నీతులు చెప్పించుకునే స్థితిలో మేము లేము. మూసీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్, బీఆర్ఎస్‌కు లేదు. నది సుందరీకరణకు తెరతీసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం.
ప్రజలు తిరగబడటంతో అప్పటి ప్రభుత్వ పెద్దలు తోక ముడిచారు. చేతనైతే మూసీలో వ్యర్థాలు కలవకుండా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలి. నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ కడితే వరదల నుంచి కాపాడుకోవచ్చు. ప్రజలు కోరుకోనప్పుడు మూసీ సుందరీకరణ ఎందుకు?. నదీ పరివాహక ప్రాంత ప్రజల తరుఫున బీజేపీ పోరాడుతోంది. వారి ఇళ్లు కూలుస్తామంటే ఒప్పుకునేది లేదు. మూసీ నిర్వాసితులకు అండగా ఉంటాం. వారి తరఫున పోరాడుతాం. అడ్డగోలుగా వచ్చి ఇళ్లపై పడితే చూస్తూ ఊరుకోం" అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
KTR: కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను టార్గెట్ చేస్తూ కేటీఆర్ ట్వీట్..
Hyderabad: గబ్బు రేపుతున్న హైదరాబాద్ పబ్బులు..
TG News: ముగ్గురు యువకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు చూస్తే..
Updated Date - Oct 19 , 2024 | 01:53 PM