Vinod Kumar: తెలంగాణ రికార్డ్స్ రైట్స్-2024 బిల్లు పూర్తిగా అధ్యయనం చేశా..
ABN, Publish Date - Aug 24 , 2024 | 05:57 PM
రికార్డ్ ఆఫ్ రైట్స్-2020(ఆర్వోఆర్) స్థానంలో తెచ్చే తెలంగాణ రికార్డ్స్ రైట్స్ బిల్లు-2024ను లోతుగా అధ్యయనం చేసినట్లు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ తెలిపారు. వరంగల్‌లో ప్రాక్టీస్ చేసిన న్యాయవాదిగా తాను, రెవెన్యూ చట్టాలపై అవగాహన కలిగిన వరంగల్, కరీంనగర్ న్యాయవాదులతో కూలంకషంగా చర్చించినట్లు ఆయన వెల్లడించారు.
హైదరాబాద్: రికార్డ్ ఆఫ్ రైట్స్-2020(ఆర్వోఆర్) స్థానంలో తెచ్చే తెలంగాణ రికార్డ్స్ రైట్స్ బిల్లు-2024ను లోతుగా అధ్యయనం చేసినట్లు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ తెలిపారు. వరంగల్‌లో ప్రాక్టీస్ చేసిన న్యాయవాదిగా తాను, రెవెన్యూ చట్టాలపై అవగాహన కలిగిన వరంగల్, కరీంనగర్ న్యాయవాదులతో కూలంకషంగా చర్చించినట్లు ఆయన వెల్లడించారు. రికార్డ్స్ రైట్స్ బిల్లు-2024 బిల్లుకు ప్రజలు, న్యాయవాదులు, రెవెన్యూ అధికారులు, రిటైర్డ్ అధికారులు సూచనలు చేయాలంటూ తెలంగాణ సర్కార్ చెప్పిన విషయం తెలిసిందే. బిల్లుపై ఫీడ్ బ్యాక్ ఇచ్చేందుకు శుక్రవారం సాయంత్రం వరకు అవకాశం కల్పించింది. దీంతో కొంతమంది న్యాయవాదులతో చర్చించినట్లు మాజీ ఎంపీ తెలిపారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.." తెలంగాణ రికార్డ్స్ రైట్స్ బిల్లు-2024లో మెుత్తం 20సెక్షన్లు ఉన్నాయి. వాటన్నింటినీ లోతుగా అధ్యయనం చేశా. సెక్షన్ 20లో పాత చట్టం పూర్తిగా తీసేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అలా చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అనవసరం అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని రిపీల్ చేయాలి. కానీ ప్రస్తుతం సెక్షన్ 20ని తీసేయాల్సిన అవసరం లేదు. కొత్త బిల్లులో పాత చట్టాలను కొనసాగిస్తూనే నాలుగు కొత్త సెక్షన్లు మాత్రమే పొందుపరుస్తున్నారు. సెక్షన్-9 భూదారు, సెక్షన్-14 అప్పీల్, సెక్షన్-15 రివిజన్ మాత్రమే కొత్తగా తెస్తున్నారు.
దీని కోసం మొత్తం పాత చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం కూడా ధరణి చట్టం-2020లో మార్పులు చేయాలని అభిప్రాయపడింది. దురదృష్టవశాత్తూ ఎన్నికలు రావడంతో చేయలేకపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన చట్టంలో తప్పు చేసిన అధికారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ కొత్త బిల్లులో అది ఎక్కడా కనిపించడం లేదు. దీని వల్ల అధికారుల్లో భయం ఉండదు. ఈ అంశాన్ని తిరిగి పొందుపర్చాలని తెలంగాణ సర్కార్‌ను కోరుతున్నా. కొత్త బిల్లులోని భూదారు అనే పదానికి సరైన నిర్వచనం లేదు. దానిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నా" అని చెప్పుకొచ్చారు.
Updated Date - Aug 24 , 2024 | 05:57 PM