Share News

KCR: మోదీకి ఓటేస్తే వినాశనమే

ABN , Publish Date - Apr 28 , 2024 | 05:08 AM

లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ మోదీకి ఓటేస్తే వినాశనం తప్పదని బీఆర్‌ఎస్‌ చీఫ్‌, మాజీ సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు.

KCR: మోదీకి ఓటేస్తే వినాశనమే

  • రాష్ట్రంలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్‌ సర్కార్‌

  • కాంగ్రెస్‌, బీజేపీలకు ఎన్నికల్లో కర్రు కాల్చి వాతపెట్టాలి

  • నాగర్‌కర్నూల్‌ రోడ్‌షోలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

నాగర్‌కర్నూల్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ మోదీకి ఓటేస్తే వినాశనం తప్పదని బీఆర్‌ఎస్‌ చీఫ్‌, మాజీ సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు దొందూ దొందేనని.. తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు.

పోరుబాట బస్సు యాత్ర సందర్భంగా శనివారం సాయంత్రం ఆయన నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ కూడలి వద్ద బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు మద్దతుగా ఏర్పాటు చేసిన రోడ్‌షోలో మాట్లాడారు. విభజన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలను దారుణంగా వంచించారని విమర్శించారు. ‘‘వ్యవసాయ రంగానికి అందిస్తున్న


ఉచిత విద్యుత్తు పథకానికి మీటర్లు బిగించాలని నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం కోరింది. అందుకు నేను వ్యతిరేకించినందుకే కక్ష కట్టారు. తెలంగాణ ఆకాంక్షలను ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలను ఏనాడూ పట్టించుకోని నరేంద్రమోదీకి మళ్లీ ఓటేస్తే తెలంగాణకు వినాశనం తప్పదు’’ అని కేసీఆర్‌ వివరించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సర్కారుపై గులాబీ బాస్‌ విరుచుకుపడ్డారు. ‘‘అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధిలోనే కాంగ్రెస్‌ అసమర్థ ప్రభుత్వంగా నిరూపితమైంది. వేసవిలో ప్రజలకు కనీసం తాగునీరు కూడా అందించలేని దుర్మార్గమైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉండటం దురదృష్టకరం. మా ప్రభుత్వ హయాంలో మిషన్‌ భగీరథ పథకం ద్వారా కేవలం రూపాయికే నీటి కనెక్షన్లిచ్చాం. రక్షిత తాగునీటిని అందించాం.

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక మళ్లీ బోర్లు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ఎందుకు జరుగుతోంది?’’ అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన గ్యారెంటీలు ఏవీ సక్రమంగా అమలు కావడంలేదన్నారు. ‘‘ఆడపిల్లల పెళ్లిళ్లకు తులం బంగారం పథకం ఏమైంది? విద్యార్థినులకు స్కూటీల పంపిణీ ఎంత వరకు వచ్చింది?’’ అని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్‌గా రైతుబంధు డబ్బులు ఖాతాలో జమ అయ్యేవని.. ఇప్పుడాపరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అమలైన పథకాలను కూడా కొనసాగించలేని దుస్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నదని దుయ్యబట్టారు.


సమర్థంగా పాలనను కొనసాగించలేని ముఖ్యమంత్రి.. చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తనను అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నారని.. ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో తిరిగి రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి.. తెలంగాణకు మేలు చేకూర్చేందుకు గొందిలో ప్రాణం ఉన్నంత వరకు ప్రయత్నిస్తామన్నారు.

ఈ ఎన్నికల్లో మైనార్టీ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, సెక్యులర్‌ భావాలు గల బీఆర్‌ఎ్‌సకు ఓటేస్తే వారి ప్రయోజనాలను కాపాడేందుకు అహర్నిషలు కృషి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ వైఫల్యాల గురించి మాట్లాడాలంటే దినమంతా సరిపోదని, తాగునీటి సంగతి దేవుడెరుగు తమ ప్రభుత్వ హయాంలో కరెంటు పోయేది సంచలనమేనని, ప్రస్తుతం వచ్చేది విశేషమైపోయిందన్నారని కేసీఆర్‌ విమర్శించారు. రోడ్‌షోలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రిజనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 06:49 AM