Share News

Government Responsibilities: రైతులకు మళ్లీ రుణాలు ఇవ్వండి..

ABN , Publish Date - Jul 19 , 2024 | 02:58 AM

రైతు రుణ మాఫీ కింద వచ్చిన నిధులను బ్యాంకర్లు జమ చేసుకొని... భవిష్యత్తు అవసరాల కోసం రైతులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.

Government Responsibilities: రైతులకు మళ్లీ రుణాలు ఇవ్వండి..

  • రూ.31వేల కోట్ల మేర రుణ మాఫీ.. దేశ బ్యాంకింగ్‌ చరిత్రలోనే ఓ రికార్డు

  • రైతులను ఇబ్బంది పెట్టొద్దు.. బ్యాంకుల వద్ద ఉత్సవాలు: ఎస్‌ఎల్‌బీసీ భేటీలో భట్టి

  • ప్రతి పైసా తిరిగి రైతులకివ్వాలి.. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలి: తుమ్మల

హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రైతు రుణ మాఫీ కింద వచ్చిన నిధులను బ్యాంకర్లు జమ చేసుకొని... భవిష్యత్తు అవసరాల కోసం రైతులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. రైతులకు రుణాలు ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా అశ్రద్ధ చూపొద్దని, లీడ్‌ బ్యాంకు పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు. రుణ మాఫీ మొదటి విడత నిధులు విడుదల నేపథ్యంలో గురువారం ఉదయం ప్రజాభవన్‌లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సదర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రుణమాఫీ పథకానికే వినియోగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర అప్పులకు జమ చేసుకోవద్దని ఆదేశించారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం రానున్న రోజుల్లో మరిన్ని పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుందని తెలిపారు.పీఏసీఎ్‌సలకు సంబంధించి డీసీసీబీలకు విడుదల చేసిన నిధులు ఒకటి, రెండు రోజుల్లో సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు. రుణమాఫీ పథకాన్ని ప్రకటించినపుడు ఎవరూ నమ్మలేదని, బ్యాంకింగ్‌ చరిత్రలోనే ఇది కనీవినీ ఎరుగని సందర్భమని అన్నారు.


మొదటి విడతలో రూ.లక్షలోపు బకాయి ఉన్న 11.50 లక్షల మంది రైతులకు రూ.6098 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు, ఆగస్టు నెలలో రూ.2లక్షల వరకు రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. మూడు విడతల్లో కలిపి 40 లక్షల మంది ఖాతాల్లో రూ.31 వేల కోట్లను జమ చేయనున్నట్లు చెప్పారు. ఇంత పెద్దమొత్తంలో ఒకే సారి రుణాలు రికవరీ కావడం దేశ బ్యాంకింగ్‌ చరిత్రలోనే ఓ రికార్డు అని పేర్కొన్నారు. రెండు లక్షల కంటే ఎక్కువ బకాయిలు ఉన్న రైతులతో బ్యాంకర్లు మాట్లాడాలని, ప్రభుత్వం జమ చేసిన మొత్తాన్ని మినహాయించుకుని... మిగిలిన మొత్తాన్ని రికవరీ చేసుకోవాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. రుణమాఫీ నేపథ్యంలో బ్యాంకుల వద్ద అధికారులు ఉత్సవాలు జరపాలని, విస్తృతంగా ప్రచారం చేయాలని భట్టి పిలుపు నిచ్చారు.


ప్రభుత్వ ఉత్తర్వులు పాటించాల్సిందే..

ప్రభుత్వ ఉత్తర్వులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బ్యాంకర్లను హెచ్చరించారు. బ్యాంకులకు వచ్చే వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులకు పూర్తి సమాచారం ఇవ్వాలని, రైతులకు సహకారం అందించాలని సూచించారు. రుణమాఫీ విజయవంతం కావడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నెల రోజుల పాటు రుణాల రెన్యువల్‌, నగదు చెల్లింపులకు బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రుణ మాఫీ నిధులను రైతులకు తప్పకుండా అందేలా చూడాల్సిన బాధ్యతను బ్యాంకర్లు తీసుకోవాలని సూచించారు.

Updated Date - Jul 19 , 2024 | 02:58 AM