TG: బీఎస్సీ నర్సింగ్‌కు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌పై నీలినీడలు!
ABN, Publish Date - May 28 , 2024 | 04:59 AM
బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాలకు సంబంధించిన కామన్ ఎంట్రెన్స్ పరీక్ష అటకెక్కినట్టేనా? చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ఈ పరీక్ష నిర్వహణపై వైద్యశాఖ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి.
జూన్ 15లోగా ప్రవేశపరీక్ష నిర్వహించాలన్న ఐఎన్‌సీ
ఆ ఆదేశాలు గాలికి..ఏమీ పట్టనట్టుగా వైద్యశాఖ తీరు!
ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు
సీఎం చొరవ తీసుకోవాలంటూ నర్సింగ్ అసోసియేషన్ల విజ్ఞప్తి
హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాలకు సంబంధించిన కామన్ ఎంట్రెన్స్ పరీక్ష అటకెక్కినట్టేనా? చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ఈ పరీక్ష నిర్వహణపై వైద్యశాఖ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు ఈ పరీక్ష నిర్వహణ చేపట్టే సంకేతాలే కానరావడం లేదు. బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు అన్ని రాష్ట్రాలు విధిగా కామన్ ఎంట్రెన్స్ టెస్టు నిర్వహించాలని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్‌సీ) ఇటీవలే లేఖలు రాసింది. విద్యా సంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో జూన్ 15లోగా పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. కానీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాత్రం ఇవేవీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. ఈ విషయం గురించి వైద్య శాఖ మరచినట్టుగా ఆరోపణలూ వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో జిల్లాకొక నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
అయితే నర్సింగ్‌లో ప్రవేశాలకు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహణకు వైద్య శాఖ సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాల కోసం జాతీయ అర్హత పరీక్ష (నీట్)ను తప్పనిసరి చేశారు. అయితే దీనిపై ఇప్పటివరకు తగిన ప్రచారం కల్పించకపోవడంతో మెజార్టీ విద్యార్థులకు బీఎస్సీ నర్సింగ్ కోసం నీట్ రాయాలన్న అవగాహన లేకుండాపోయింది. మరోవైపు ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం కోర్సులకు దాదాపు కాలంచెల్లింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కాలేజీల్లో జీఎన్‌ఎం ప్రవేశాలు నిలిపేశారు. నాణ్యమైన నర్సింగ్ విద్యను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆ రెండు కోర్సుల స్థానంలో నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సును తప్పనిసరి చేసింది. నర్సింగ్ చేయాలనుకునే వారు బీఎస్సీ నర్సింగ్‌లోనే చేరాలి. ఇది చాలా మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తెలియడంలేదు. ఈ నేపథ్యంలో నీట్ రాయలేకపోయిన వారి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు మరో అవకాశం కల్పించాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకే ఐఎన్‌సీ కామన్ ఎంట్రెన్స్ టెస్టుపై అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. కాగా ఈ పరీక్షను ప్రభుత్వ ఆదేశాలమేరకు కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంటుంది. తాజా సమాచారం మేరకు పరీక్ష జరుగుతుందో? లేదోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎవరు చెప్పినా వినేదేలే!...
కామన్ ఎంట్రెన్స్ టెస్టు నిర్వహించాలని ఇటీవల తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ కూడా రాష్ట్ర డీఎంఈ, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ర్టార్‌కు లేఖ రాసింది. అయితే ఈ లేఖలను వైద్య ఆరోగ్యశాఖ బుట్టదాఖలు చేసింది. ఎవరు చెప్పినా వినమన్న ధోరణి ప్రదర్శిస్తోంది. కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ను జూన్ 15లోగా పూర్తి చేయాలని ఐఎన్‌సీ స్పష్టం చేయగా.. ఇందుకింకా కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు, నోటిఫికేషన్స్ విడుదలకాకపోవడంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఇలాంటి సమస్యలతోనే విద్యార్థులు, కాలేజీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోగా ఈసారైనా అవి పునరావృతంకాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని నర్సింగ్ అసోసియేషన్లు, తల్లిదండ్రులు కోరుతున్నారు. సీఎం రేవంత్ చొరవ తీసుకొని బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సీట్లు భర్తీ కష్టమే....ఇంతకు ముందు బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లను ఇంటర్ బైపీసీ మార్కుల ఆధారంగా మెరిట్‌పై చేపట్టేవారు.
2023-24 నుంచి నీట్, ఎంసెట్‌లో ఏదో ఒకదాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని ఐఎన్‌సీ పేర్కొంది. నీట్ రాయకుండా బైపీసీ పూర్తి చేసి బీఎస్సీ నర్సింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ప్రయత్నించిన విద్యార్థులు.. బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో చేరలేకపోయారు. విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తితో ప్రభుత్వం 2023-24 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఆధారంగా ప్రవేశాలకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం తెలంగాణలో 112 నర్సింగ్ కాలేజీలుండగా.. వాటిలో 6,500 బీఎస్సీ నర్సింగ్ సీట్లున్నాయి. వీటిలో 4 వేల సీట్లు కన్వీనర్ కోటా కింద, మిగిలినవి యాజమాన్య కోటాలో హెల్త్ యూనివర్సిటీ భర్తీ చేస్తోంది. కాగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకొక ప్రభుత్వ వైద్య కళాశాలతోపాటు వాటికి అనుబంధంగా, అలాగే నియోజకవర్గానికొక నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే రేవంత్ సర్కారు ప్రకటించింది. ఈమేరకు అన్ని కాలేజీల్లో సీట్లు నిండాలంటే కచ్చితంగా రాష్ట్రస్థాయిలో కామన్ ఎంట్రెన్స్ పరీక్ష తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు.
Updated Date - May 28 , 2024 | 04:59 AM