Cyber Security: కాంబోడియా సైబర్ కేసులోకీలక వ్యక్తి అరెస్టు..
ABN, Publish Date - Jul 14 , 2024 | 05:06 AM
కాంబోడియాలో ఉద్యోగాల పేరుతో భారతదేశ యువకులను పంపి.. అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న ముఠాలోని కీలక నిందితుడిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) అరెస్టు చేసింది.
హైదరాబాద్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): కాంబోడియాలో ఉద్యోగాల పేరుతో భారతదేశ యువకులను పంపి.. అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న ముఠాలోని కీలక నిందితుడిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) అరెస్టు చేసింది. బిహార్‌కు చెందిన మహమ్మద్ షాబాద్ ఆలం ఇక్కడి నుంచి యువకులను కాంబోడియాకు పంపేవాడని గుర్తించింది. అతను ఎక్కడికక్కడ ఏజెంట్లను నియమించుకుని.. యువతను ఉద్యోగాల పేరుతో వంచిస్తున్నాడు. కాంబోడియాకు తీసుకువెళ్లిన యువకులను చైనా ఏజెంట్లకు అప్పగిస్తున్నాడని సీఎ్‌సబీ వెల్లడించింది.
చైనా ఏజెంట్లు బాధితుల వీసా, పాస్‌పోర్టులను తీసుకుని, వారితో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తుంటారని.. సిరిసిల్లకు చెందిన ఓ యువకుడి వద్ద ప్రాసెసింగ్ ఫీజు పేరుతో రూ.1.40లక్షలు తీసుకుని, అక్కడ బానిసలా మార్చి, సైబర్ నేరాలు చేయించారని పేర్కొన్నారు. ఆ యువకుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. షాబాద్ ఆలం దుబాయ్ పారిపోయే ప్రయత్నంలో ఉండగా.. అతణ్ని అరెస్టు చేసినట్లు సీఎ్‌సబీ తెలిపింది.
Updated Date - Jul 14 , 2024 | 05:06 AM