Kaleshwaram Project: బ్యారేజీలు, పంప్‌హౌజ్‌ల నిర్మాణంలో జరిగిందేంటి?
ABN, Publish Date - Jul 11 , 2024 | 04:20 AM
కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలు, పంప్‌హౌజ్‌ల నిర్మాణం జరిగిన తీరుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ బుధవారం విచారణ జరిపింది. వాటి నిర్మాణ సమయంలో విధులు నిర్వర్తించిన 40 మంది దాకా అసిస్టెంట్ ఇంజనీర్లు(ఏఈ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు(ఏఈఈ)లను ప్రశ్నించింది.
ఏఈ, ఏఈఈలను విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్
నేడు పంప్‌హౌజ్‌ల నిర్మాణ సంస్థ ముఖ్యులకు పిలుపు.. విచారణ
హైదరాబాద్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలు, పంప్‌హౌజ్‌ల నిర్మాణం జరిగిన తీరుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ బుధవారం విచారణ జరిపింది. వాటి నిర్మాణ సమయంలో విధులు నిర్వర్తించిన 40 మంది దాకా అసిస్టెంట్ ఇంజనీర్లు(ఏఈ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు(ఏఈఈ)లను ప్రశ్నించింది. ఆ బ్యారేజీలు, పంప్‌హౌజ్‌లు ఎలా కట్టారు? డిజైన్ల ప్రకారమే వాటి నిర్మాణం జరిగిందా? వంటి అంశాలపై ఆరా తీసింది. ఒక్కో బ్యారేజీలో పనిచేసిన వారిని ఒక్కో గ్రూపు చొప్పున.. మొత్తం బ్యారేజీల ఇంజనీర్లను మూడు గ్రూపులుగా విభజించి, ప్రశ్నించింది. ఇదే తరహాలో మూడు పంప్‌హౌజ్‌ల ఇంజనీర్లను 3 గ్రూపులుగా విభజించి విచారించింది. వీరంతా కమిషన్ ముందు తెలిపిన అంశాల ఆధారంగా వివరాలను అఫిడవిట్ల రూపంలో 10 రోజుల్లో సమర్పించాలని ఆదేశించింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో సాంకేతిక లోపాలు, అవకతవకతలపై విచారణకు జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పంప్‌హౌజ్‌ల నిర్మాణంపై విచారణ నిర్వహించే పరిధి కమిషన్‌కు లేకున్నప్పటికీ.. వాటి నిర్మిత ప్రాంతం ఎంపిక, నిర్వహణతో బ్యారేజీలపై పడిన ప్రభావాలను గుర్తించాలని కమిషన్ నిర్ణయించి, పంప్‌హౌజ్ నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు ఏఈ, ఏఈఈలను విచారించినట్లు సమాచారం. అలాగే.. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి(మేడిగడ్డ), సిరిపురం(అన్నారం), గోలివాడ (సుందిళ్ల) పంప్‌హౌజ్‌లను నిర్మించిన సంస్థకు చెందిన ముఖ్యులను కమిషన్ గురువారం విచారించనుంది.
Updated Date - Jul 11 , 2024 | 04:21 AM