Share News

Hyderabad: పంప్‌హౌ్‌సల కోసం నీటి నిల్వలతో బ్యారేజీలు దెబ్బతిన్నాయా?

ABN , Publish Date - Jul 09 , 2024 | 02:55 AM

పంప్‌హౌస్‌ల హెడ్‌లకు నీరు తాకేలా ఉండాలన్న కారణంతోనే బ్యారేజీల్లో నీటి నిల్వ చేయడంతో బ్యారేజీలు దెబ్బతిన్నాయా? అని జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ అధికారులను నిలదీసినట్లు తెలిసింది.

Hyderabad: పంప్‌హౌ్‌సల కోసం నీటి నిల్వలతో బ్యారేజీలు దెబ్బతిన్నాయా?

  • గోదావరి వరద అంచనాలో యంత్రాంగం విఫలం!

  • కాళేశ్వరం కార్పొరేషన్‌ నిధులు ఏ విధంగా విడుదల చేశారు?

  • 14 మందిని విచారించిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌

  • నేడు కూడా విచారించనున్న కమిషన్‌

  • బ్యారేజీలపై కమిషన్‌కు నివేదిక ఇచ్చిన నిపుణుల కమిటీ

హైదరాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): పంప్‌హౌస్‌ల హెడ్‌లకు నీరు తాకేలా ఉండాలన్న కారణంతోనే బ్యారేజీల్లో నీటి నిల్వ చేయడంతో బ్యారేజీలు దెబ్బతిన్నాయా? అని జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ అధికారులను నిలదీసినట్లు తెలిసింది. సోమవారం ఆయన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని పంప్‌హౌ్‌సల నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్న రామగుండం మాజీ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, గజ్వేల్‌ ఈఎన్‌సీ హరిరామ్‌, మహబూబ్‌నగర్‌ ఇన్‌ చార్జీ సీఈగా ఉన్న రమణారెడ్డి, రామగుండం సీఈ సుధాకర్‌రెడ్డి, చీఫ్‌ అకౌంట్‌ ఆఫీసర్‌ పద్మావతితోపాటు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ) స్థాయి వరకున్న అధికారులను విచారించారు. మేడిగడ్డలో 6 మీటర్లు, అన్నారంలో 11 మీటర్లు, సుందిళ్లలో 9 మీటర్ల మేర నీటిని నిల్వ చేస్తేనే... కన్నెపల్లి (మేడిగడ్డ), సిరిపురం(అన్నారం), గోలివాడ(సుందిళ్ల) పంప్‌హౌ్‌సలకు నీరు చేరుతుందని అధికారులు వివరించగా... ఆ కారణంగానే బ్యారేజీలు దెబ్బతిన్నాయా? అని జస్టిస్‌ ఘోష్‌ ప్రశ్నించారు.


బ్యారేజీలు నీటి మళ్లింపు కోసం కడితే... కాళేశ్వరంలో నీటి నిల్వ కోసం కట్టినట్లు కనిపిస్తోందన్నారు. గోదావరి వరదను కచ్చితంగా అంచనా వేయడంలో యంత్రాంగం వైఫల్యం చెందిందని ఆక్షేపించారు. కాగా, పంప్‌హౌస్‌ నిర్మాణ సంస్థ కు చెందిన ఇద్దరు ప్రతినిధులు కూడా హాజరై, విచారణకు సహకారం అందిస్తామని జస్టిస్‌ ఘోష్‌కు వివరించారు. ఇక మంగళవారం డీఈఈ, బుధవా రం ఏఈఈ తత్సమాన కేడర్‌ ఉద్యోగులను కమిషన్‌ విచారించనుంది. సోమవారం మొత్తం 14 మందిని విచారించిన కమిషన్‌, ఈ నెల 16లోపు కమిషన్‌కు నివేదించిన సమాచారాన్ని అఫిడవిట్ల రూపంలో అందించాలని జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ అధికారులను ఆదేశించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కార్పొరేషన్‌కు నిధులు ఏ విధంగా అందాయి?


ఆ నిధులను ఏ విధంగా నిర్మా ణ సంస్థలకు విడుదల చేశారు? వంటి అంశాలపై అధికారుల నుంచి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ సమాచారం సేకరించారు. మరోవైపు కమిషన్‌కు సహాయంగా ఉండటానికి వీలుగా వేసిన నిపుణుల కమిటీ సోమవారం బ్యారేజీలపై నివేదికను కమిషన్‌కు అందించింది. ఇక కాళేశ్వరంపై విచారణ నివేదికను కంప్రోల్టర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(కాగ్‌) కూడా కమిషన్‌కు అందించింది. ఈ నివేదిక పరిశీలించిన తర్వాత కాగ్‌ హైదరాబాద్‌ విభాగం అధికారులనూ విచారణకు హాజరుకావాలని కమిషన్‌ నిర్ణయించింది. ఇక ఇప్పటిదాకా అందిన అఫిడవిట్లను నిశితంగా పరిశీలిస్తున్న కమిషన్‌ అనంతరం తదుపరి నోటీసులు/క్రాస్‌ ఎగ్జామినేషన్‌పై నిర్ణయం తీసుకోనుంది.


విజిలెన్స్‌కు మళ్లీ లేఖ

కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ పూర్తి నివేదికను సమర్పించాలంటూ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డీజీకి మళ్లీ లేఖ రాయాలని నీటి పారుదల అధికారులను జస్టిస్‌ చంద్రఘోష్‌ ఆదేశించారు. ఇక జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎస్‌ఏ)తోనూ పూర్తి నివేదికను తెప్పించుకోవాలని నిర్దేశించారు.

Updated Date - Jul 09 , 2024 | 02:55 AM