Supreme Court: నీట్‌పై సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిటీతో విచారణ జరపాలి..
ABN, Publish Date - Jun 24 , 2024 | 05:10 AM
నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని జ్యుడీషియల్ కమిటీతో విచారణ జరిపించాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం లోపభూయిష్టంగా ఉందని, నీట్‌లో జరిగిన అక్రమాలకు అదే కారణమని ఆయన ఆరోపించారు.
ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్
ప్రధాని క్షమాపణలు చెప్పాలి: ఒవైసీ
హైదరాబాద్/ కరీంనగర్ అర్బన్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని జ్యుడీషియల్ కమిటీతో విచారణ జరిపించాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం లోపభూయిష్టంగా ఉందని, నీట్‌లో జరిగిన అక్రమాలకు అదే కారణమని ఆయన ఆరోపించారు. నీట్‌లో జరిగిన అక్రమాలతో 24 లక్షల మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, నీట్, నెట్ పరీక్షలను పూర్తిగా రద్దు చేసి గతంలో మాదిరిగా వీటి నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హరగోపాల్ మాట్లాడారు. జాతీయ విద్యా విధానాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకించి, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక విద్యా విధానాన్ని రూపొందించాలని ఆయన కోరారు.
ప్రధాని యువత భవిష్యత్తుపై యుద్ధం ప్రకటించారని, 23 లక్షల మంది రాసిన నీట్- యూజీ పరీక్షపై గందరగోళ పరిస్థితులు నెలకొల్పారని, 9 లక్షల మంది రాసిన యూజీసీ- నెట్, 2 లక్షల మంది రాసిన సీఎ్‌సఐఆర్- నెట్ పరీక్షలను రద్దు చేశారని.. 2లక్షల మంది పరీక్షకు సిద్ధమైన తరుణంలో రాత్రికి రాత్రే నీట్- పీజీ పరీక్షను రద్దు చేశారని మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఈ పరిణామాలకు మోదీ ఆయన మంత్రి వర్గం బాధ్యత వహిస్తూ యువతకు క్షమాపణలు చెప్పాలని ఆదివారం ఎక్స్ వేదికగా ఒవైసీ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా నీట్‌ను రద్దు చేయాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆదివారం కరీంనగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంటి ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - Jun 24 , 2024 | 05:10 AM