Khammam: ఉపాధి సొమ్మ ఉద్యోగుల ఖాతాల్లోకి..
ABN, Publish Date - Jul 09 , 2024 | 03:20 AM
వారంతా ప్రభుత్వ ఉద్యోగులే.. కానీ పేదలకు జీవనోపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకం నిధుల కోసం కక్కుర్తి పడ్డారు. కూలీలుగా పని చేస్తున్నట్లు జాబ్ కార్డులు సృష్టించి.. డబ్బును స్వాహా చేశారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో గత రెండేళ్లుగా ఈ అక్రమాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.
రెండేళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్ల అక్రమాలు
అక్రమంగా జాబ్ కార్డులు సృష్టించి.. నిధుల స్వాహా
ఖమ్మం డీఆర్‌డీఏ ఏపీవో విచారణలో వెలుగులోకి
ఇల్లెందు ఎమ్మెల్యే ఫిర్యాదుతో అక్రమాలు బహిర్గతం
మరో 3 రోజులు విచారణ
కామేపల్లి, జూలై 8: వారంతా ప్రభుత్వ ఉద్యోగులే.. కానీ పేదలకు జీవనోపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకం నిధుల కోసం కక్కుర్తి పడ్డారు. కూలీలుగా పని చేస్తున్నట్లు జాబ్ కార్డులు సృష్టించి.. డబ్బును స్వాహా చేశారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో గత రెండేళ్లుగా ఈ అక్రమాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఉపాధి పథకంలో అవకతవకలపై ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ఫిర్యాదు అందగా.. విచారణ చేపట్టాలని ఖమ్మం జిల్లా అధికారులను ఆయన కోరారు. ఈ మేరకు ఖమ్మం డీఆర్‌డీఏ అడిషనల్ పీవో శిరీష సోమవారం విచారణ చేపట్టగా.. గత రెండేళ్ల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు ఉపాధి నిధులు మళ్లిస్తున్న తీరు బయటపడింది. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం బర్లగూడెంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు జరుగుతున్నాయి.
అయితే, అక్కడ పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్, మేట్‌లు కలిసి తమ బంధువులైన ప్రభుత్వ ఉద్యోగులను ఉపాధి కూలీలుగా చేర్చి జాబ్ కార్డులు సృష్టించారు. కూలీలు పని చేస్తున్నట్లుగా చూపిస్తూ కూలి వేతనం వారి ఖాతాలో జమ చేస్తున్నారు. ఆ తర్వాత సదరు సొమ్మును సగం-సగం చొప్పున పంచుకుంటున్నారు. అక్రమంగా సొమ్ములు పొందుతున్న వారిలో మహబూబాబాద్ జిల్లాలోని పోలీసు కానిస్టేబుల్ నునావత్ సరోజిని, హైదరాబాద్ నిమ్స్‌కు చెందిన వైద్యుడు శివ, గార్ల పోస్టల్ డిపార్టుమెంట్‌లో పని చేస్తున్న చంద్రశేఖర్, భూపాలపల్లిలోని సింగరేణి కార్మికుడు సురేష్, హైదరాబాద్‌కు చెందిన లైబ్రేరియన్ సుధాకర్, టేకుపల్లి పీహెచ్‌సీలో పనిచేస్తున్న పరిగిణి, భద్రాచలం ఐటీడీఏ పాఠశాలలో పని చేస్తున్న జగదీశ్‌బాబు, కామేపల్లిలో మిషన్ భగీరథలో పనిచేస్తున్న రవితోపాటు పొన్నెకల్, బర్లగూడెం గ్రామాల్లోని పలువురు వృద్ధులు, మహిళలు ఉన్నారు.
ఇలా మొత్తం వంద మందిపైగా ఖాతాల్లో కూలి సొమ్ము జమ చేస్తూ స్వాహా చేస్తున్నట్లు ప్రాథమికంగా తేలింది. అక్రమాలకు పాల్పడినవారు కామేపల్లి ఎంపీడీవో కార్యాలయం లాగిన్ ఐడీ నుంచి కాకుండా ఒక ప్రైవేట్ ఇంటర్‌నెట్ సెంటర్ ద్వారా రోజు వారీ మస్టర్లు నమోదు చేసినట్లు తేలింది. ఈ విషయమై డీఆర్‌డీఏ ఏపీఓ శిరీషను వివరణ కోరగా నిధులు మళ్లించినట్టు ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిపారు. మూడు రోజుల్లో విచారణ పూర్తవుతుందని, అన్ని వివరాలు తెలియజేస్తామని చెప్పారు.
Updated Date - Jul 09 , 2024 | 03:20 AM