Hyderabad: మరో సిక్సర్!
ABN, Publish Date - Jul 12 , 2024 | 02:56 AM
ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నుంచి మరో ఆరుగురు ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ శుక్రవారం, శేరిలింగంపల్లి శాసనసభ్యుడు అరికెపూడి గాంధీ శనివారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో అధికార పార్టీలో చేరడం ఖాయమైంది.
కాంగ్రెస్‌లోకి మరోొ ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
జీహెచ్‌ఎంసీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వారే!
నేడు కాంగ్రెస్‌లోకి ప్రకాశ్‌గౌడ్, రేపు అరికెపూడి గాంధీ
హైదరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్ కీలక ఎమ్మెల్సీ సైతం
ఇప్పటికే హస్తం పార్టీలోకి ఏడుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
టార్గెట్ 26.. ఆపై సీఎల్పీలో బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనమే!
అసెంబ్లీ మొదలయ్యే నాటికి పూర్తయ్యేలా రేవంత్ కసరత్తు
హైదరాబాద్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నుంచి మరో ఆరుగురు ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ శుక్రవారం, శేరిలింగంపల్లి శాసనసభ్యుడు అరికెపూడి గాంధీ శనివారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో అధికార పార్టీలో చేరడం ఖాయమైంది. గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని మరికొందరు ఎమ్మెల్యేలు కూడా నాలుగైదు రోజుల్లో ఒకరి తర్వాత ఒకరు ఇదే బాటన నడవనున్నట్లు చెబుతున్నారు. వీరితో సీఎం సన్నిహిత వర్గాలు సంప్రదింపులను పూర్తి చేశాయి. ఈ మేరకు అంతా సిద్ధమైనట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
అందరూ ఒకేసారి వెళ్లాలని తొలుత భావించినా.. వ్యక్తిగత ముహూర్తాలకు అనుగుణంగా ఒకరి తర్వాత ఒకరు చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వీరేకాక నగరానికి చెందిన, గత ప్రభుత్వ హయాంలో హవా సాగించిన కీలక ఎమ్మెల్సీ కూడా బీఆర్‌ఎ్‌సను వీడనున్నట్లు చెబుతున్నారు. కాగా, ఇప్పటికే ఏడుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరిన సంగతి తెలిసిందే. కొత్తగా వెళ్లేవారితో కలిపితే మొత్తం సంఖ్య 13కు పెరగనుంది.
మరో 13 మందినీ లాగేస్తే..
ప్రస్తుతం సాంకేతికంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38. వీరిలో మూడింట రెండొంతులు.. 26 మంది ప్రత్యేక శాసనసభాపక్షంగా ఏర్పడి కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ)లో విలీనం కానున్నారని చెబుతున్నారు. 2018 ఎన్నికల అనంతరం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్‌ఎస్ ఇదే విధానాన్ని అనుసరించిన సంగతిని గుర్తుచేస్తున్నాయి. కాగా, అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే ఈ నెల 24వ తేదీ కల్లా బీఆర్‌ఎస్ శాసనసభా పక్షం (బీఆర్‌ఎ్‌సఎల్పీ).. సీఎల్పీలో విలీనం అయ్యేలా సీఎం రేవంత్‌రెడ్డి కసరత్తును ముమ్మ రం చేశారని పేర్కొంటున్నాయి. మరోవైపు 26 మంది వెళ్లిపోతే బీఆర్‌ఎస్ సభ్యుల సంఖ్య 12కు పడిపోతుంది.
119 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా పొం దేందుకు కనీసం కావాల్సిన సంఖ్య ఇది. ఒకవేళ 27వ ఎమ్మెల్యే కూడా వెళ్లిపోతే బీఆర్‌ఎస్ ప్రధాన ప్రతిపక్ష హోదాను, కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాను కోల్పోనున్నారు. ఇక సీఎం రేవంత్ సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (గద్వాల) ఇప్పటికే అధికార పార్టీలో చేరారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆయన కూడా వచ్చేస్తే ఆ జిల్లా లో బీఆర్‌ఎస్ ఖాళీ కానుందని చెబుతున్నారు.
మేం చేర్చుకోకుంటే.. బీజేపీ చేర్చుకుంటుంది..
రాష్ట్రంలో బీజేపీని కట్టడి చేసేందుకే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీఆర్‌ఎస్ డీలాపడిందని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటున్నారని, తాము చేర్చుకోకుంటే బీజేపీలోకి వెళ్లే ఆస్కారం ఉందనీ అంటున్నారు. బీజేపీకి ఆ అవకాశం ఇవ్వకూడదని.. అధిష్ఠానాన్ని ఒప్పించిన తర్వాతనే, చేరికల ప్రక్రియను సీఎం రేవంత్ ముమ్మరం చేశారని కాంగ్రెస్ వర్గాలు వివరిస్తున్నాయి.
Updated Date - Jul 12 , 2024 | 02:56 AM