Share News

Jagityala: చిన్నారుల ప్రాణాలకు ‘పెద్ద’ ముప్పు!

ABN , Publish Date - Dec 20 , 2024 | 05:38 AM

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌ గురుకుల పాఠశాలలో అసలేం జరుగుతోంది? పిల్లలు విష పురుగుల బారిన పడి మృతిచెందిన ఘటనలు వరుసగా జరుగుతున్నా యంత్రాంగంలో చలనం లేదెందుకు?

Jagityala: చిన్నారుల ప్రాణాలకు ‘పెద్ద’ ముప్పు!

పెద్దాపూర్‌ గురుకులంలో మళ్లీ పాము కలకలం.. 3నెలల క్రితం ఆరుగురు విద్యార్థులకు పాముకాటు.. ఇద్దరి మృతి

  • తాజాగా మరో ఇద్దరు పిల్లల అస్వస్థత.. పాముకాటనే అనుమానం

  • కోరుట్ల ఆస్పత్రిలో చికిత్స.. గురుకులం చుట్టూ పారిశుధ్య చర్యలు

జగిత్యాల, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌ గురుకుల పాఠశాలలో అసలేం జరుగుతోంది? పిల్లలు విష పురుగుల బారిన పడి మృతిచెందిన ఘటనలు వరుసగా జరుగుతున్నా యంత్రాంగంలో చలనం లేదెందుకు? మంచి చదువు అబ్బుతుందనే ఆశతో ఉన్న ఇంటిని.. కన్న తల్లిదండ్రులను వదిలేసి గురుకులానికి వస్తే ప్రాణాలే పోయేట్టున్నాయంటూ పిల్లలు భయం భయంగా ఉంటున్నారు. అటు..తల్లిదండ్రులు కూడా తమ పిల్లల గురించి ఎప్పుడెలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. మూడు నెలల క్రితం ఆరుగురు విద్యార్థులు పాముకాటుకు గురవగా, వారిలో ఇద్దరు ప్రాణాలు విడిచారు. తాజా గా మరో ఇద్దరు పిల్లలు అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలయ్యారు. ఈ ఇద్దరినీ పాము కరించి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత జూలై 27న పెద్దాపూర్‌ గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి రాజారాం గుణాదిత్య (13)కి పాము కరవడంతో మృతిచెందాడు. అదే రోజు మరో ఇద్దరు విద్యార్థులు గణేశ్‌ (13), రాపర్తి హర్షవర్ధన్‌ (14) కూడా అస్వస్థతకు గురైనా చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ విద్యాసాగర్‌ను కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సస్పెండ్‌ చేశారు. తర్వాత ఆగస్టు మొదటివారంలో ఆరో తరగతి విద్యార్థి ఎడమల అనిరుధ్‌ రెడ్డి (12), హేమంత్‌, మోక్షిత్‌ అనే విద్యార్థులను పాము కరిచింది. ముగ్గురినీ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆగస్టు 9న అనిరుధ్‌ మృతిచెందాడు.


చికిత్స అనంతరం హేమంత్‌, మోక్షిత్‌ కోలుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాల జగిత్యాల జిల్లా కో ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌, ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ మహిపాల్‌ రెడ్డిలను కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మెమోలు ఇచ్చారు. ఆగస్టు 14న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాఠశాలను సందర్శించి, అధికారుల కు దిశానిర్దేశం చేశారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. తాజాగా బుధవారం పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న మెట్‌పల్లి కి చెందిన ఓంకార్‌ అఖిల్‌ (14) అస్వస్థతకు గురయ్యాడు. పాముకాటుకు గురైనట్లు వైద్యులు అనుమానించి యాం టీవీనమ్‌ ఇంజెక్షన్లు ఇచ్చారు. కోరుట్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మర్నాడు గురువారం అదే గురుకులంలో ఎనిమిదో తరగతి చదువుతున్న యశ్వంత్‌ (14) కూడా అస్వస్థతకు గురయ్యాడు. హుటాహుటిన యశ్వంత్‌ను కోరుట్ల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ అబ్బాయి కూడా పాముకాటుకు గురైనట్లు వైద్యులు అనుమానించి యాంటీ వీనమ్‌ ఇంజెక్షన్లు ఇచ్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అఖిల్‌, యశ్వంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. జిల్లా కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ పాఠశాలను సందర్శించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ప్రిన్సిపల్‌ మాధవీలతను సస్పెండ్‌ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఇద్దరు పిల్లలు అస్వస్థతకు గురయ్యారంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి-కోరుట్ల జాతీయ రహదారిపై బైఠాయించారు.


చుట్టూ చెత్తాచెదారం తొలగింపు

పెద్దాపూర్‌ గురుకులం ఆవరణలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, ముళ్లపొదలు, గడ్డి, చెత్తాచెదారాన్ని తొలగించారు. పాడుబడ్డ బావిని, పెద్ద గుంతను పూడ్చివేశారు. పాఠశాల, కళాశాల, వసతి గృహాలు, బాత్‌ రూమ్‌లు మిగతా చోట్ల ఉన్న చెత్తను, గడ్డిని తీసివేయించారు. వినియోగంలో లేని రెండు రేకుల షెడ్డులను కూల్చివేశారు. అయితే అప్పట్లోనే గురుకులంలో అత్యవసర మందులు, పారామెడికల్‌ సిబ్బంది కోసం విద్యార్థుల వసతి గృహం వద్ద కాకుండా కొద్ది దూరంలో గల పాడుబడ్డ కట్టడం కేటాయించడంతో పిల్లలకు సత్వర సేవలు అందడం లేదన్న ఆరోపణలున్నాయి. ఆగస్టు 13న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాఠశాల ను సందర్శించారు. మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు కుటుంబలో ఒకరికి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం కల్పిస్తామని హామీనిచ్చారు. పాఠశాలలో అత్యవసర పనులకు రూ. 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

Updated Date - Dec 20 , 2024 | 05:38 AM