ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: 195 టీఎంసీల ఎత్తిపోత సాధ్యమయ్యేనా?

ABN, Publish Date - Jul 02 , 2024 | 04:44 AM

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద వేర్వేరు ఎత్తులతో బ్యారేజీ నిర్మిస్తే కలిగే ముంపును తెలిపే సూచీ పటాలు, టోపోషీట్లు అందించాలని జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నీటిపారుదల శాఖ అధికారులను కోరింది.

  • బ్యారేజీల ఎంపికకు ప్రామాణికమేంటి?

  • తుమ్మిడిహెట్టి వద్ద వేర్వేరు ఎత్తుతో బ్యారేజీలు కడితే ముంపు ఎంత?

  • ‘ప్రాణహిత-చేవెళ్ల’ వివరాలివ్వండి

  • నీటిపారుదల శాఖను కోరిన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌

హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద వేర్వేరు ఎత్తులతో బ్యారేజీ నిర్మిస్తే కలిగే ముంపును తెలిపే సూచీ పటాలు, టోపోషీట్లు అందించాలని జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నీటిపారుదల శాఖ అధికారులను కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 195 టీఎంసీల జలాల ఎత్తిపోత, బ్యారేజీలు, ఆఫ్‌లైన్‌ రిజర్వాయర్ల నిర్వహణ సాధ్యమయ్యే పనేనా? దీనిపై ఏమైనా అధ్యయనాలు చేశారా? అని కమిషన్‌ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌కు ఇప్పటిదాకా (జూన్‌ 28 వరకు) అఫిడవిట్ల రూపంలో అరకొర సమాచారాన్ని మాత్రమే ఇంజనీర్లు అందించగా.. సమగ్రంగా, మరింత అదనపు సమాచారం కోరుతూ నీటిపారుదల శాఖకు కమిషన్‌ లేఖ రాసింది.


అలా ఎందుకు వాడారు?

బ్యారేజీల స్థలాల ఎంపికకు నిర్వహించిన సర్వేలు, విచారణ విషయంలో నీటిపారుదల శాఖలో అంతర్గతంగా సాగిన ఫైళ్ల వివరాలను అందించాలని కమిషన్‌ కోరింది. బ్యారేజీల నిర్మాణం చేపట్టడానికి ముందు డ్రాయింగ్‌ల తయారీ కోసం సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌(సీడీవో) చీఫ్‌ ఇంజనీర్‌కు క్షేత్ర స్థాయి అధికారులు పంపించిన సైట్‌ సర్వే నివేదికలను సైతం సమర్పించాలంది. మేడిగడ్డ బ్యారేజీ పునాది- సీకెంట్‌ పైల్స్‌ మధ్య గ్యాప్‌ ఉండాలని, రెండింటికీ జాయింట్‌ ఇవ్వాలని చేసిన ప్రతిపాదనలకు గల కారణాలను తెలపాలని సూచించింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాది దిగువనే సీకెంట్‌ పైల్స్‌ వినియోగించగా.. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో తద్విరుద్ధంగా ఉండడానికి కారణం ఏంటని ప్రశ్నించింది. దేశంలో జలాశయాల నిర్మాణంలో సీకెంట్‌ పైల్స్‌ను వాడే ఆనవాయితీ లేదని, ఈ నేపథ్యంలో వీటి వినియోగంపై సాంకేతిక చర్చలు జరిగాయా? అని కమిషన్‌ ప్రశ్నించింది.


ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డీపీఆర్‌ను సమర్పించాలని హైడ్రాలజీ విభాగం సీఈని కమిషన్‌ ఆదేశించింది. కేంద్రం నుంచి ప్రాజెక్టుకు వచ్చిన అనుమతులు, ఈ విషయంలో జరిగిన ఫైళ్లు/ఉత్తర ప్రత్యుత్తరాల సమాచారం వివరాలను సమర్పించాలని నిర్దేశించింది. ప్రాజెక్టుకు నీటి లభ్యతపై అధ్యయనాలతో పాటు ఈ విషయంలో సీడబ్ల్యూసీతో జరిగిన సంప్రదింపుల సమాచారాన్ని అందించాలని సూచించింది. ఇక బ్యారేజీల నిర్మాణానికి పరిపాలన అనుమతుల కోసం పంపిన ప్రతిపాదనల విషయంలో జరిగిన సంప్రదింపుల వివరాలనూ కమిషన్‌ కోరింది. వ్యాప్కోస్‌ 2016 జనవరి 17న సమర్పించిన మూడు బ్యారేజీల డీపీఆర్‌లను అందించాలంది. బ్యారేజీల నిర్మాణానికి ఇచ్చిన సాంకేతిక అనుమతుల పత్రాలు కూడా సమర్పించాలని నిర్దేశించింది.


బ్యారేజీల వైఫల్యాలపై నివేదిక ఇవ్వండి

మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలకు గల కారణాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని క్వాలిటీ కంట్రోల్‌ విభాగం సీఈని కమిషన్‌ కోరింది. క్షేత్ర స్థాయి ఇంజనీర్లు అందించిన నివేదిక తర్వాత నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ బ్యారేజీల మరమ్మతులకు చేసిన సిఫారసుల వివరాలు కూడా అందించాలని తెలిపింది. ఇక బ్యారేజీల గేట్ల నిర్వహణపై నమూనా అధ్యయనాలు ఏమైనా జరిగాయా? బ్యారేజీల నిర్వహణపై ప్రొటోకాల్‌, మ్యానువల్‌, మార్గదర్శకాలపై రామగుండం సీఈతో వాలంతరీ డీజీ, తెలంగాణ ఇంజనీరింగ్‌ రిసెర్చ్‌ ల్యాబ్‌ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలు అందించాలని కమిషన్‌ స్పష్టం చేసింది. ఆనకట్టల భద్రత చట్టం-2021ని అనుసరించి, వర్షాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీల స్థితిగతులపై నివేదికలు ఏమైనా తెప్పించుకున్నారా? అని ఆరా తీసింది.

Updated Date - Jul 02 , 2024 | 04:46 AM

Advertising
Advertising