CV Anand: కాళేశ్వరంపై త్వరగా నివేదిక ఇవ్వండి..
ABN, Publish Date - Aug 20 , 2024 | 05:24 AM
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను త్వరగా అందించాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ఆదేశించారు.
విజిలెన్స్ డీజీకి జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశం
మధ్యంతర నివేదిక అందజేసిన డీజీ ఆనంద్
హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను త్వరగా అందించాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ఆదేశించారు. సోమవారం కమిషన్ ముందు ఆ విభాగం డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ హాజరయ్యారు. విచారణ నివేదిక ఎక్కడిదాకా వచ్చిందని ఈ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ ఆరా తీయగా... ప్రాథమిక నివేదికను ఙప్పటికే ఇచ్చామని ఆనంద్ తెలిపారు. మధ్యంతర నివేదిక సిద్ధంగా ఉందని కాపీని తీసి, ఆయనకు అందజేశారు. పూర్తి నివేదిక ఇవ్వడానికి కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఒక అంశంపై కమిషన్ విచారణ జరుగుతున్నప్పుడు మరో సంస్థ విచారణ చేయాలా? వద్దా? స్పష్టత ఇవ్వాలని ఆనంద్ కోరారు.
కమిషన్ ఏర్పడే నాటికీ జరిగిన విచారణ ప్రక్రియలో భాగంగా చోటు చేసుకున్న అంశాలు, గుర్తించిన అంశాలపై పూర్తి నివేదిక అందించాలని జస్టిస్ ఘోష్ స్పష్టం చేశారు. విచారణలో భాగంగా ప్రాజెక్టుకు చెందిన కీలక పత్రాలను తీసుకెళ్లారని, ఆ పత్రాల ప్రతులన్నీ కమిషన్‌కు అందించాలని జస్టిస్ పీసీ ఘోష్ కోరారు. అందుకు ఆనంద్ అంగీకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యాలకు గల కారణాలేంటి? డిజైన్ లోపమా? నిర్మాణ లోపమా? నిర్వహణ లోపమా? కారణాలు గుర్తించాలని బెంగాల్ లోని ఫరక్కా బ్యారేజీకి చెందిన ఇంజనీరింగ్ నిపుణులతో జస్టిస్ ఘోష్ తనిఖీలు చేయించారు.
బ్యారేజీ వైపల్యానికి గల కారణాలపై వారి నుంచి నివేదికను కోరారు. విచారణలో కీలకమైన క్రాస్ ఎగ్జామినేషన్ బుధ వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 21న తొలి రోజు మాజీ ఈఎన్‌సీ(జనరల్) సి.మురళీధర్‌ను కమిషన్ చైర్మన్ స్వయంగా ప్రశ్నించనున్నారు. ఇప్పటికే 57 మంది అఫిడవిట్లు దాఖలు చేశారు. ఎవరెవరినీ క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలనే దానిపై ఘోష్ నిర్ణయం తీసుకుంటారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వైఖరిపై కమిషన్ ఆగ్రహంతో ఉంది.
విచారణలో భాగంగా కమిషన్ ముందు హాజరై... వివరాలు అందించిన ఆయన్ను అఫిడవిట్ రూపంలో వివరాలు అందించాలని కమిషన్ ఆదేశించింది. ఆయన స్పందించలేదు. సోమవారం కూడా కమిషన్ నుంచి ఆయనకు ఫోన్ వెళ్లింది. అఫిడవిట్ దాఖలు చేయకపోతే తదుపరి ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై కమిషన్ సమాలోచనలు జరుపుతోంది. క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ముగిసే లోపు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణం జరుగుతున్నప్పుడు కీలక స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కబురు పంపించాలని కమిషన్ యోచిస్తోంది. కమిషన్ ముందు హాజరై... పథకానికి సంబంధించిన వివరాలు అందించాలని కోరే అవకాశం ఉంది.
Updated Date - Aug 20 , 2024 | 05:24 AM