Congress: తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ అదిరిపోయే ఆఫర్!
ABN, Publish Date - Mar 29 , 2024 | 01:47 AM
కాంగ్రెస్‌లో కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థి ఎవరన్న చిక్కుముడి వీడడం లేదు. ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ తొమ్మిది సార్లు సమావేశమై అభ్యర్థులను ఖరారు చేసినా కరీంనగర్ అభ్యర్థి విషయం తేలడం లేదు..
కరీంనగర్ తెరపైకి తీన్మార్ మల్లన్న
బీసీకి టికెట్ ఇచ్చే యోచనలో కాంగ్రెస్
బీసీ గండం దాటితేనే ‘వెలిచాల’కు అవకాశం
31న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్) :
కాంగ్రెస్‌లో (Congress) కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థి ఎవరన్న చిక్కుముడి వీడడం లేదు. ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ తొమ్మిది సార్లు సమావేశమై అభ్యర్థులను ఖరారు చేసినా కరీంనగర్ అభ్యర్థి విషయం తేలడం లేదు. ఈ కమిటీ సమావేశం ఈనెల 31న ఢిల్లీలో జరుగనుండగా పదోసారైనా అభ్యర్థి ప్రకటన వెలువడుతుందా అన్నది ప్రశ్నార్థకంగానే ఉన్నది. రాష్ట్రం నుంచి ఈ స్థానానికి మాజీ శాసనసభ్యుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరు మాత్రమే పంపించగా ఢిల్లీ స్థాయిలో మూడుపేర్లు ప్రధానంగా పరిశీలనకు వచ్చాయి.
రెడ్డి.. వెలమ.. బీసీ..
రెడ్డి సామాజికవర్గానికి చెందిన ప్రవీణ్‌రెడ్డి, వెలమ సామాజికవర్గానికి చెందిన వెలిచాల రాజేందర్‌రావు, బీసీ సామాజికవర్గం నుంచి రుద్ర సంతోష్‌కుమార్ పేర్లు పరిశీలనకు వచ్చాయి. తొలుత రెడ్డి సామాజికవర్గంవైపే మొగ్గు చూపిన కేంద్ర నాయకత్వం రాష్ట్రంలో రెడ్డి అభ్యర్థులు ఎక్కువ అవుతున్నారన్న కారణంగా వెలిచాల రాజేందర్‌రావు పేరును పరిశీలించడం ప్రారంభించింది. మంత్రి పొన్నం ప్రభాకర్‌తోపాటు ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మరో ముగ్గురు శాసనసభ్యులు, ముగ్గురు నియోజకవర్గ ఇన్‌చార్జిలు కూడా రాజేందర్‌రావుకు మద్దతు ప్రకటించడంతో ఆయన పేరే తొమ్మిదవ జాబితాలో ప్రకటిస్తారని అందరూ ఆశించారు. ఈ వ్యవహారం కులాల సమీకరణాల మధ్య మరింత చిక్కుపడి పోయి అధిష్ఠానం నిర్ణయం తీసుకోకుండా తర్వాత సమావేశానికి వాయిదా వేసింది. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉండగా మూడు స్థానాలను ఎస్సీలకు, రెండు స్థానాలను ఎస్టీలకు రిజర్వుచేశారు.
12 జనరల్ స్థానాల్లో బీసీలు, అగ్రవర్ణాలకు చెందిన ఇతర కులాలకు ఈ స్థానాలను కేటాయించాల్సి ఉన్నది. ఇప్పటి వరకు 13 స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానవర్గం అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులను ఖరారు చేయని స్థానాల్లో కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ మిగిలిపోయాయి. వరంగల్ ఎస్సీలకు రిజర్వు చేసిన స్థానం కాగా, మిగతా మూడు జనరల్ స్థానాలుగా ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రకటించిన 13 మంది అభ్యర్థుల్లో ఇద్దరు ఎస్సీ, ఇద్దరు ఎస్టీ, ముగ్గురు బీసీ, ఆరుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. కరీంనగర్‌ను మొదటి నుంచి రెడ్డికి కానీ వెలమకు కానీ ఇవ్వాలనే అభిప్రాయంతోనే సర్వేలు నిర్వహిస్తూ వచ్చి ప్రవీణ్‌రెడ్డి, రాజేందర్‌రావు పేర్లను పరిశీలించి తర్జనభర్జన పడుతూ ఖరారు చేయకుండా ఉన్నారు. ఇప్పుడు ఈ రెండు సామాజికవర్గాలకు కాకుండా బీసీలకు ఈ స్థానం కేటాయించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ బీసీలకు ఆరు స్థానాలను, బీజేపీ ఐదు స్థానాలను కేటాయించాయి.
ఇప్పటి వరకు కాంగ్రెస్ మూడు స్థానాల్లో మాత్రమే బీసీలకు అవకాశం కల్పించింది. మిగిలిన మూడు స్థానాల్లో రెడ్డి, వెలమ, ఇతర కులాలకు చెందిన వారిని ప్రకటిస్తే బీసీ వ్యతిరేక పార్టీ అని అనుకునే ప్రమాదముందని, ఇతర పార్టీలు కూడా ఇదే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకవెళ్తాయని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. బీసీల ఓట్లు కీలకంగా ఉన్నందున మిగిలిన మూడు స్థానాల్లో ఒకటి లేక రెండు స్థానాలను వారికే ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన రోజుల్లోనే బీసీలకు ఐదు సీట్లు కేటాయించాలనే డిమాండ్ వచ్చింది. పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలకు కూడా బహిరంగంగానే ఈ ప్రకటనకు మద్దతు పలికారు. ఇప్పుడు మూడు సీట్లతో సరిపెడితే బీసీలు దూరమయ్యే అవకాశముందని కాంగ్రెస్ నాయకత్వం ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తున్నది. ఖమ్మంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సతీమణి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు, కమ్మ సామాజికవర్గానికి చెందిన మరోమంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కుమారుడు టికెట్ ఆశిస్తున్నారు. వీరిలో ఒకరికి టికెట్ ఇవ్వాల్సి ఉన్ననేపథ్యంలో బీసీల కోటాలో వారు రారు. మిగిలిన రెండు స్థానాలు కరీంనగర్, హైదరాబాద్‌లో బీసీలకు అవకాశం కల్పించడమే మిగిలిందని తెలుస్తున్నది.
స్థానికులకు అవకాశం ఇవ్వాలంటున్న సంతోష్‌కుమార్
కరీంనగర్ నుంచి టికెట్ ఆశిస్తున్న రుద్ర సంతోష్‌కుమార్ పేరు పరిశీలనలో ఉన్నా ఈ స్థానంలో భువనగిరి టికెట్ ఆశించిన తీన్మార్ మల్లన్న అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తే ఎలా ఉంటుందని అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఈ ప్రతిపాదనను కేంద్ర కమిటీ ముందు ఉంచారని, ఈ కారణంగానే రాజేందర్‌రావు పేరు ప్రకటన దశలో నిలిచిపోయిందని సమాచారం. రుద్ర సంతోష్‌కుమార్ స్థానికుడినైన తనకు కాకుండా స్థానికేతరులకు టికెట్ ఇవ్వడం సమంజసం కాదని, అలా చేస్తే పార్టీ ఎన్నికల్లో దెబ్బతినే అవకాశమున్నదని నాయకులతో అన్నట్లు తెలిసింది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్, బీఆర్‌ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ను స్థానికేతరుడిగా అభివర్ణిస్తూ ప్రచారం చేస్తున్నారు. పక్క జిల్లాకు చెందిన వినోద్‌కుమార్ ఒకసారి కరీంనగర్ ఎంపీగా గెలిచిన నేపథ్యం ఉన్నా ఆయనను స్థానికేతరుడు అంటున్న దశలో కాంగ్రెస్ స్థానికేతర అభ్యర్థిని తీసుకొని వస్తే బీజేపీ లాభపడడం మినహా కాంగ్రెస్‌కు మిగిలేది ఏమి లేదనే వాధనను సంతోష్‌కుమార్ తెరపైకి తెస్తున్నారని తెలిసింది. కరీంనగర్ స్థానం తీన్మార్ మల్లన్నకు దక్కుతుందా... సంతోష్‌కుమార్ ప్రయత్నాలు ఫలిస్థాయా... బీసీ గండాన్ని దాటుకొని రాజేందర్‌రావు టికెట్ దక్కించుకుంటారా అనేది తేలాల్సి ఉంది.
Updated Date - Mar 29 , 2024 | 08:28 AM