Bhatti Vikramarka: కేసీఆర్ పాలనలో సింగరేణి సంక్షోభంలో కూరుకుపోయింది
ABN, Publish Date - Feb 25 , 2024 | 10:56 PM
గత కేసీఆర్ పాలనలో సింగరేణి సంక్షోభంలో కూరుకుపోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. కోల్ బ్లాక్ ఆక్షన్‌లో పాల్గొనకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి నష్టం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోల్ బ్లాక్ ఆక్షన్‌లో తప్పకుండా పాల్గొంటుందని తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం: గత కేసీఆర్ పాలనలో సింగరేణి సంక్షోభంలో కూరుకుపోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. కోల్ బ్లాక్ ఆక్షన్‌లో పాల్గొనకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి నష్టం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోల్ బ్లాక్ ఆక్షన్‌లో తప్పకుండా పాల్గొంటుందని తెలిపారు. కొత్తగూడెంలో సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియాలో 45 ఎకరాల విస్తీర్ణంలో రూ.56.76 కోట్ల వ్యయంతో నిర్మించిన 10.5మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సింగరేణి సీఎండీ ఎన్. బలరాం, ఎమ్మెల్యేలు, మాళోత్ రాందాస్ నాయక్, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, మట్టా రాగమయి, జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ... కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా అన్న కేసీఆర్ సవాల్‌కు కాంగ్రెస్, కరెంట్ రెండూ కావాలని ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. సింగరేణి ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 27వ తేదీన గృహజ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణలో కరెంట్ వెలుగులు కాంగ్రెస్ పాలనలో స్థాపించిన విద్యుత్ ప్రాజెక్ట్‌ల వల్లే వచ్చాయని చెప్పారు. సింగరేణి తెలంగాణ ప్రగతిలో కీలకంగా ఉందన్నారు. సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ఇన్సూరెన్స్ పథకం రేపటి నుంచి ప్రారంభం అవుతుందని చెప్పారు. సింగరేణి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
సింగరేణి సంస్థ తెలంగాణకే కల్ప తరువు: మంత్రి తుమ్మల
భవిష్యత్ కరెంట్ అవసరాలకు సోలార్ పవర్ ఎంతో అవసరమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ విస్తరణలో ప్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని కోరారు. సింగరేణి డీ.ఎం.ఎఫ్.టీ నిధులు మైన్ ప్రభావిత ప్రాంతాల్లో మంజూరు చేయాలని సూచించారు. కరెంట్ వినియోగం పెరిగినందున సోలార్ రూఫ్ టాప్ పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. సింగరేణి సంస్థ తెలంగాణకే కల్ప తరువుగా నిలిచిందని తెలిపారు.
Updated Date - Feb 25 , 2024 | 10:56 PM