Kothagudem: హోమ్ వర్క్ చేయకపోతే మరీ ఇంత దారుణంగా కొడతారా.. వైరల్ అవుతున్న వీడియో..
ABN, Publish Date - Oct 18 , 2024 | 12:14 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గొల్లగూడెంలోని మానస వికాస్ పాఠశాలలో ఈనెల 16న ఆరో తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడు సతీశ్ హోమ్ వర్క్ ఇచ్చారు. నిన్న (గురువారం) ఉదయం విద్యార్థులను ఒక్కొక్కరిగా పిలిచి తాను ఇచ్చిన వర్క్ చెక్ చేశాడు.
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. హోమ్ వర్క్ పూర్తి చేయలేదన్న కారణంతో ఓ విద్యార్థిపై ఉపాధ్యాయుడు రెచ్చిపోయాడు. చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా చావ బాదాడు. ఒంటి నిండా గాయాలు కావడంతో విద్యార్థి నరకయాతన అనుభవిస్తున్నాడు. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. టీచర్ దారుణంగా కొడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గొల్లగూడెంలోని మానస వికాస్ పాఠశాలలో ఈనెల 16న ఆరో తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడు సతీశ్ హోమ్ వర్క్ ఇచ్చారు. నిన్న (గురువారం) ఉదయం విద్యార్థులను ఒక్కొక్కరిగా పిలిచి తాను ఇచ్చిన వర్క్ చెక్ చేశాడు. అయితే ఓ విద్యార్థి మాత్రం హోమ్ వర్క్ చేయలేదు. అదే విషయాన్ని బాలుడు ఉపాధ్యాయుడికి చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన టీచర్ తాను చెప్పిన పని ఎందుకు చేయలేదంటూ చిన్నారిని బెత్తంతో తీవ్రంగా కొట్టాడు. అది చాలదన్నట్లు చేతులతో పిడిగుద్దులు కురిపించాడు. కసి తీసే వరకూ తీవ్రంగా కొట్టాడు. దెబ్బలకు బాలుడు విలవిలాడినా వదలకుండా ఎర్రెత్తినట్లు దాడి చేశాడు. ఈ ఘటనతో తరగతి గదిలోని మిగిలిన విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నోరు మెదపకుండా అందరూ అలానే చూస్తూ ఉండిపోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలు తరగతి గదిలోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి.
అయితే నిన్న సాయంత్రం పాఠశాల అనంతరం విద్యార్థి ఇంటికి వెళ్లిపోయారు. భయంతో తల్లిదండ్రులకు విషయం చెప్పలేదు. అయితే బాలుడి తల్లి అతనికి స్నానం చేయించేందుకు బట్టలు తీసింది. ఒంటి నిండా గాయాలు ఉండడంతో ఆమె ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయ్యింది. ఈ విషయాన్ని వెంటనే భర్తకు చెప్పింది. ఇద్దరూ కలిసి కుమారుడిని ప్రశ్నించగా.. ఉపాధ్యాయుడు దాడి చేయడం గురించి వివరించాడు. దీంతో ఇవాళ (శుక్రవారం) ఉదయం విద్యార్థి కుటుంబసభ్యులు, బంధువులు పాఠశాలకు వెళ్లి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. తప్పు చేస్తే దండించాలి గానీ ఇంత ఘోరంగా కొడతారా అంటూ ఉపాధ్యాయుడిని ప్రశ్నించారు. అనంతరం పాఠశాల ఎదుట నిరసనకు దిగారు. సీసీ కెమెరా ఫుటేజ్ తమకు చూపించాలని డిమాండ్ చేశారు. దీంతో చేసేదేమీ లేక ప్రధానోపాధ్యాయు సీసీ ఫుటేజ్ వారికి చూపించారు.
సీసీ టీవీ ఫుటేజ్‌లో విద్యార్థిపై దాడికి సంబంధించిన దృశ్యాలు చూసి అంతా ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురయ్యారు. దారణంగా కొట్టడంపై మరోసారి నిలదీశారు. అనంతరం ఆ వీడియోలను తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఘటనపై ఫిర్యాదు చేసి ఆధారంగా వీడియోను సమర్పించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి విచారణ జరిపి ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన కాస్త జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Group 4 candidates: గాంధీభవన్ వద్ద గ్రూప్ - 4 అభ్యర్థుల ఆందోళన.. డిమాండ్స్ ఇవే
Hyderabad: ఎంఎంటీఎస్ సేవలను మెరుగుపరుస్తాం.. సమయపాలనను నేనే పర్యవేక్షిస్తా
Updated Date - Oct 18 , 2024 | 12:14 PM