Hyderabad: అక్టోబరులో ఆర్‌ఆర్‌ఆర్ శంకుస్థాపన..
ABN, Publish Date - Jun 20 , 2024 | 04:00 AM
‘‘రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణానికి అక్టోబరులో శంకుస్థాపన చేస్తాం. ఉత్తరభాగానికి రెండు నెలల్లో టెండర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాం’’ అని ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు.
ఉత్తర భాగానికి రెండు నెలల్లో టెండర్లు
దేశంలో అత్యుత్తమ హైకోర్టును నిర్మించబోతున్నాం
ఢిల్లీలో 22 అంతస్తుల్లో తెలంగాణ భవన్
విజయవాడ హైవేపై బ్లాక్‌స్పాట్ల తొలగింపు పనులు
రూ.5,600కోట్లతో హైదరాబాద్-బెంగళూరు హైవే
ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): ‘‘రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణానికి అక్టోబరులో శంకుస్థాపన చేస్తాం. ఉత్తరభాగానికి రెండు నెలల్లో టెండర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాం’’ అని ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. బుధవారం ఆయన సచివాలయంలో జాతీయ రహదారులు, ప్రాజెక్టులు, రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెండింగ్‌లో ఉన్న ఆస్పత్రుల నిర్మాణాలపై ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘‘రాజేంద్రనగర్‌లో నిర్మించే హైకోర్టు భవనాన్ని దేశంలోనే బెస్ట్‌గా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం హైకోర్టు భవన డీపీఆర్ సిద్ధమవుతోంది’’ అని వివరించారు. ఆర్‌ఆర్‌ఆర్ చుట్టూ రింగ్ రైల్ ప్రాజెక్టును తీసుకువస్తామని, ఆర్‌ఆర్‌ఆర్-ఓఆర్‌ఆర్ మధ్య రేడియల్ రోడ్లు, స్పోర్ట్స్ జోన్‌లు రాబోతున్నాయని తెలిపారు.
ఉస్మానియా ఆస్పత్రిని ప్రస్తుతం ఉన్న స్థానంలోనే..పాత డిజైన్‌లోనే నిర్మిస్తామని కోమటిరెడ్డి వివరించారు. ‘‘దీనిపై అఖిలపక్షం సమావేశాన్ని నిర్వహించాం. అవసరమైతే మరోసారి అఖిలపక్ష నేతలతో సమావేశమవుతాం. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, హైదరాబాద్ చుట్టుపక్కల నిర్మాణంలో ఉన్న 4 టిమ్స్ ఆస్పత్రులను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువస్తాం’’ అని వెల్లడించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లకు విస్తరించే పనులను డిసెంబరులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఈ రోడ్డును గ్రీన్‌ఫీల్డ్ హైవేగా మార్చేలా ముందుకువెళ్తున్నామన్నారు. ‘‘ఈ రహదారి విస్తరణ విషయంలో కాంట్రాక్ట్ కంపెనీ కొర్రీలు పెట్టడంతో పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి.. పనులు త్వరగా జరిగేలా విజ్ఞప్తి చేస్తాం. ఈ రహదారిపై ప్రమాదాలు జరిగే 17 బ్లాక్‌స్పాట్లను ఇప్పటికే గుర్తించాం. వాటిని సరిచేసేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది.
ఈ నెల 23 నుంచి చౌటుప్పల్ వద్ద ఈ పనులను ప్రారంభిస్తాం. హైదరాబాద్-బెంగళూరు రహదారిని రూ.5,600 కోట్లతో ఎక్స్‌ప్రెస్ వేగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నాం. రూ.6వేల కోట్లతో శ్రీశైలం హైవేను నిర్మించాలనుకుంటున్నాం. వీటికి సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, అంబర్‌పేట్ ఫ్లైఓవర్ నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం’’ అని కోమటిరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో పలు రోడ్లను జాతీయ రహదారులుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సీఎం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మూసీ ప్రాజెక్టును ‘నమామి గంగే’ మాదిరిగా చేపడతామన్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్‌ను దాదాపు 5.2 ఎకరాల స్థలంలో 22 అంతస్తులతో నిర్మించనున్నట్టుతెలిపారు. ఆర్‌అండ్‌బీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న చిన్న బిల్లులు రూ.400 కోట్ల వరకు ఉంటాయని, వాటిని త్వరలోనే చెల్లిస్తామన్నారు.
పార్కింగ్ లేకుండా ఎలా కట్టారు!
సచివాలయం పార్కింగ్ విషయంలో మంత్రి కోమటిరెడ్డి సంబంధిత అధికారులపై సీరియస్ అయినట్లు తెలిసింది. ‘‘అసలు పార్కింగ్ సదుపాయం లేకుండా.. సచివాలయాన్ని ఎలా నిర్మించారు? మంత్రులు, అధికారులు, వీఐపీల కార్లను ఎండకు ఎండేలా.. వానకు తడిసేలా పార్క్ చేయాలా? డ్రైవర్లు ఎక్కడుంటారు?’’ అని ప్రశ్నించినట్లు సమాచారం. దీనికి అధికారులు స్పందిస్తూ.. సోలార్ రూఫ్‌టా్‌పలను ఏర్పాటు చేసి, వాటి కింద కార్లను పార్క్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, మల్టీపర్పస్ పార్కింగ్ అంశాన్ని అధ్యయనం చేస్తున్నామని వివరించారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి ఈనెల 25న ఢిల్లీ వెళ్లనున్నారు. రెండ్రోజులపాటు ఆయన ఢిల్లీలో ఉంటారు. రహదారుల నిర్మాణాలకు అనుమతులు, అటవీ భూముల సేకరణ సహా.. పలు అంశాలపై కేంద్ర మంత్రులు నితిన్‌గడ్కరీ, భూపేంద్ర యాదవ్‌లతో సమావేశమవ్వనున్నారు.
Updated Date - Jun 20 , 2024 | 04:00 AM