Tunnel construction: ఎస్‌ఎల్‌బీసీని రెండేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యం
ABN, Publish Date - Aug 13 , 2024 | 03:26 AM
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ పనులను రెండేళ్లలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
బేరింగ్, యంత్ర సామగ్రిని పంపించండి
రాబిన్స్ కంపెనీ సీఈవో లాక్‌హోంకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వినతి
2 నెలల్లో పంపిస్తామని సీఈవో హామీ
హైదరాబాద్, ఆగష్టు 12 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ పనులను రెండేళ్లలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా టన్నెల్ బోరింగ్ యంత్రాలను ఉత్పత్తి చేసే రాబిన్స్ కంపెనీ సీఈవో లాక్‌హోంతో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టన్నెల్ తవ్వకాలకు ఉపయోగించే అధునాతన మెషినరీని కంపెనీ సీఈవో.. కోమటిరెడ్డికి చూపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టన్నెల్ బోరింగ్ మిషన్‌లో కీలకమైన బేరింగ్‌తోపాటు, ఇతర యంత్ర సామగ్రి మరమ్మతులకు గురికావడంతో ఎస్‌ఎల్‌బీసీ పనులు ఆగిపోయినట్లు తెలిపారు.
ఎస్‌ఎల్‌బీసీ పూర్తయితే.. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ను కట్డడి చేయడంతోపాటు 4లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని, హైదరాబాద్ వాసులకు తాగునీరు అందించే అవకాశం ఉంటుందని చెప్పారు. టన్నెల్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టిందని, యంత్ర సామగ్రిని వీలైనంత త్వరగా సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఎస్‌ఎల్‌బీసీ పనులకు సంబంధించిన బిల్లులను గ్రీన్‌చానల్ ద్వారా చెల్లించాలని నిర్ణయించామని, బేరింగ్, ఇతర్ యంత్రాలు అందిన 40రోజుల్లోనే చెల్లింపులు చేస్తామని చెప్పారు.
దీనిపై సంసిద్ధత వ్యక్తం చేసిన సీఈవో లాక్‌హోం.. రెండు నెలల్లోగా 7 డయామీటర్ల బేరింగ్‌తోపాటు ఇతర సామగ్రిని సముద్ర మార్గం ద్వారా చెన్నైకు చేర్చుతామని, అక్కడి నుంచి పనులు జరుగుతున్న ప్రాంతానికి తరలిస్తామని చెప్పారు. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి కార్యాలయం సోమవారం మీడియాకు ఓ ప్రకటనలో విడుదల చేసింది. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను బ్లాస్టింగ్ విధానంలో పూర్తి చేసే అవకాశం లేకపోవడం.. కేవలం బోరింగ్ మిషన్ ద్వారా మాత్రమే పనులు చేసేందుకు అవకాశం ఉండడంతో రాబిన్స్ కంపెనీతో చర్చలు జరిపినట్లు అందులో పేర్కొన్నారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా సాగు నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ అజయ్‌కుమార్ పాల్గొన్నారు.
Updated Date - Aug 13 , 2024 | 03:26 AM