ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR : జైలుకెళ్లేందుకు నేను సిద్ధం

ABN, Publish Date - Nov 08 , 2024 | 02:34 AM

ఫార్ములా-ఈ కారు రేసులకు సంబంధించి నిధుల విడుదలలో ఏ తప్పూ జరగలేదని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.

  • అక్కడ యోగా.. బయటకొచ్చి పాదయాత్ర చేస్తా

  • ఫార్ములా-ఈలో ఎలాంటి తప్పూ చేయలేదు

  • విచారణకు గవర్నర్‌ అనుమతిస్తే స్వాగతిస్తా

  • ‘ఫార్ములా’పై చంద్రబాబు కలను మేం నెరవేర్చాం

  • కేసీఆర్‌, నేను నిధుల విడుదలకు ప్రతిపాదించాం

రేసు రద్దు చేసిన రేవంత్‌పైనే కేసు పెట్టాలి:కేటీఆర్‌

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కారు రేసులకు సంబంధించి నిధుల విడుదలలో ఏ తప్పూ జరగలేదని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. అయినా తనను జైల్లో పెట్టి సీఎం రేవంత్‌పైశాచికానందం పొందాలనుకుంటే అందుకు సిద్ధమని ప్రకటించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘జైల్లో ఉంటే ఏమవుతుంది? అక్కడ యోగా చేసి బయటకు వస్తా. తర్వాత పాదయాత్ర చేపడతా’’ అన్నారు. హైదరాబాద్‌లో ఫార్ములా-1 రేస్‌ కోసం 2003లోనే అప్పటి సీఎం చంద్రబాబు ప్రయత్నించారని గుర్తు చేశారు. సంస్థ సీఈఓను కూడా కలిశారని చెప్పారు. గోపన్‌పల్లి దగ్గర భూమి సైతం కేటాయించారని ప్రస్తావించారు. తాము అధికారంలోకి వచ్చాక ఫార్ములా వన్‌ రేసింగ్‌ కోసం ప్రయత్నించానని, సాధ్యపడలేదని చెప్పారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించినట్లుగా ఉంటుందని కష్టపడి ఫార్ములా-ఈ రేసింగ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. 2024లో మరోసారి ఇదే ఈవెంట్‌ నిర్వహించడానికి ఫార్ములా-ఈ నిర్వహణ సంస్థ, జీహెచ్‌ఎంసీ, గ్రీన్‌కోల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగిందని వివరించారు. గ్రీన్‌కో సంస్థ మధ్యలో తప్పుకోవడంతో కార్యక్రమం నిలిచి పోకూడదనే ఉద్దేశంతో హెచ్‌ఎండీఏ ద్వారా అడ్వాన్సు చెల్లించి, తర్వాత స్పాన్సర్లను వెతుక్కుందామని కార్యదర్శికి తానే చెప్పానన్నారు.


దీనికి సంబంధించి రూ.55 కోట్లు అడ్వాన్సు కట్టేందుకు అరవింద్‌ కుమార్‌ ఫైలు పంపితే పురపాలక మంత్రిగా సంతకం చేశానని వెల్లడించారు. కాంగ్రెస్‌ అధికారం చేపట్టాక సీఎం రేవంత్‌రెడ్డి ఫార్ములా-ఈ ఈవెంట్‌ను రద్దు చేసిందని, దాంతో అడ్వాన్సుగా ఇచ్చిన రూ.55 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. తొలుత చేపట్టిన ఫార్ములా-ఈ రేసుతో హైదరాబాద్‌కు ప్రపంచఖ్యాతి లభించిందని చెప్పారు. రాష్ట్రంలో ఈ-కార్ల తయారీ పరిశ్రమలు పెట్టుబడి వచ్చేందుకు మార్గం సుగమమైందన్నారు. తాము చంద్రబాబు కలను సాకారం చేస్తే రేవంత్‌రెడ్డి మాత్రం తన గురువు ఆశయానికి గండికొట్టారని విమర్శించారు. రేవంత్‌ తప్పుచేసి తనను దోషిగా నిలబెట్టేయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఫార్ములా-ఈ వ్యవహారంలో ఎలాంటి తప్పూ జరగలేదని, హెచ్‌ఎండీఏకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది కాబట్టి కేబినెట్‌లో ప్రతిపాదించకుండానే నిధులు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. హెచ్‌ఎండీఏ సంస్థ ఛైర్మన్‌గా అప్పటి సీఎం కేసీఆర్‌, వైస్‌ ఛైర్మన్‌గా తాను ప్రతిపాదించి.. ఆ సంస్థ కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా ఉన్న అరవింద్‌ కుమార్‌ ద్వారా ఆ నిధులను అడ్వాన్సుగా చెల్లించినట్లు కేటీఆర్‌ వివరించారు. తనపై కేసు పెట్టినా, న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లినా జరిగిన వాస్తవాన్ని వెల్లడిస్తానని, ఇందులో తనకు వచ్చిందేమీ లేదని వ్యాఖ్యానించారు. ఈ అంశంలో గవర్నర్‌ తన విచక్షణాధికారంతో తనపై విచారణకు అనుమతిస్తే స్వాగతిస్తానన్నారు. ఏసీబీ నుంచి ఎలాంటి నోటీసూ రాలేదని, ఉచ్చు బిగుస్తోంది... కేసు అంటూ మీడియాలో మాత్రమే హడావిడి నడుస్తోందని వ్యాఖ్యానించారు.


  • బీఆర్‌ఎస్‌ను దెబ్బ తీయాలని

రాష్ట్రంలో బీఆర్‌ఎ్‌సను ఖతం చేయాలని కాంగ్రెస్‌,. బీజేపీలు కుట్ర పన్నుతున్నాయని కేటీఆర్‌ ఆరోపించారు రెండు పార్టీల కుమ్మక్కు వ్యవహారం రాజ్‌భవన్‌ భేటీ ద్వారా బయటపడిందన్నారు. గవర్నర్‌ ద్వారా తనను ఇబ్బంది పెట్టే యత్నం చేస్తున్నారని, రేవంత్‌ ఉడత ఊపులకు తాను భయపడేది లేదని చెప్పారు. ‘‘హైదరాబాద్‌ ఇమేజ్‌ను పెంచినందుకు నాపై కేసుపెడతావా? విశ్వనగరం బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బ తీస్తున్నావు. ఇష్టం వచ్చిన కేసు పెట్టుకో. టార్గెట్‌ కేటీఆర్‌ అని కాకుండా ప్రజా సమస్యల పరిష్కారాన్ని టార్గెట్‌గా చేసుకొని పనిచేస్తే మంచిది’’ అన్నారు. రేసును రద్దు చేసినందుకు రేవంత్‌రెడ్డి, సంబంధిత శాఖలపై కేసు పెట్టాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - Nov 08 , 2024 | 02:37 AM